ఏపీపీ కాగితపు పరిశ్రమ, రామాయపట్నం పోర్టు లో శంకుస్థాపన…
ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గ పరిధిలో బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాలో ఏర్పాటుకానున్న ఏపీపీ కాగితపు పరిశ్రమ, రామాయపట్నం పోర్టు శంకుస్థాపన చేసి, పైలాన్లను ఆవిష్కరించారు. కాగితపు పరిశ్రమకు సంబంధించి ఎంవోయూల మార్పిడి అనంతరం జన్మభూమి- మావూరు సభలో పాల్గొన్నారు. సంక్రాంతి సంబరాలు, ముగ్గుల పోటీలు, పిల్లల ఆటల పోటీలనూ సీఎం సందర్శించారు.
ఆయా కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ, ప్రకాశం జిల్లాలో కీలకమైన వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయడంతో పాటు టంగుటూరి ప్రకాశం పంతులు విశ్వవిద్యాలయం, ఉద్యాన, పశుసంవర్ధక కళాశాలలు, రామాయపట్నం పోర్టు, భారీ కాగిత పరిశ్రమ, జాతీయ రహదారులు, రైల్వేలైన్ ఏర్పాటు చేసి అభివృద్ధిలో రాష్ట్రంలో అమరావతి తర్వాత స్థానంలో ఒంగోలు నిలిచేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలో డెయిరీ అప్పుల పాలై రైతులు ఇబ్బందులు పడుతున్న సందర్భంలో ప్రభుత్వం రంగంలోకి దిగి రైతులను ఆదుకుందన్నారు. జిల్లాలో 4 లక్షల మంది రైతులకు రూ.1918 కోట్ల మేర రుణమాఫీ చేశామన్నారు. గోదావరి-పెన్నా నదులను అనుసంధానం చేసి సోమశిలకు నీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.