Speed News
(24/02/2021)

రేపటి నుంచి 6, 7, 8 తరగతులు ప్రారంభం: సబిత
*ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ఆరు నుంచి ఎనిమిది వరకు తరగతులకు రేపటి నుంచి ప్రత్యక్ష బోధన ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించింది. తల్లిదండ్రుల లిఖిత పూర్వక అనుమతి ఉంటేనే విద్యార్థులను అనుమతించాలని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు మంత్రి సబితాఇంద్రారెడ్డి స్పష్టం చేశారు.
విద్యార్థులు, ఉపాధ్యాయుల భద్రత కోసం ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.రేపటి నుంచి వీలైనంత వరకు వచ్చే నెల ఒకటో తేదీలోగా తరగతులు ప్రారంభించాలని సూచించారు.

తూర్పు లద్ధాఖ్​లో బలగాల ఉపసంహరణ తర్వాత కూడా చైనాతో భారత్​కు ఉన్న ఎఫ్​డీఐ నిబంధనల్లో ఎలాంటి మార్పు ఉండదని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. నిబంధనలు అలాగే కొనసాగుతాయని స్పష్టం చేసింది. బలగాల ఉపసంహరణ తర్వాత.. చైనాపై ఆంక్షలను ఎత్తివేస్తారంటూ మీడియాలో వస్తున్న వార్తలను ఖండించింది.

నిజామాబాద్​ జిల్లా బోధన్​ పట్టణంలో నకిలీ పాస్​పోర్టుల కేసులో 11 మంది ప్రధాన సూత్రదారులు ఉన్నారని సైబరాబాద్​ సీపీ సజ్జనార్​ వెల్లడించారు. ఇప్పటి వరకు ఇద్దరు పోలీసులతో సహా ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నకిలీ ఆధార్​, ఇతర పత్రాలతో పాస్​పోర్టులు పొందినట్లు గుర్తించామన్నారు.

మహారాష్ట్ర లాతూర్ నగరం ఎమ్​ఐడీసీ ప్రాంతంలోని ఓ హస్టల్​లో దాదాపు 40 మంది విద్యార్థినులకు కరోనా సోకింది. హాస్టల్​లో ఓ విద్యార్థినికి కరోనా పాజిటివ్ నిర్ధరణ కాగా మిగతా వారికీ పరీక్షలు చేయించారు హాస్టల్​ నిర్వాహకులు.

కూలీలను లక్షాధికారులు గా మార్చిన వజ్రాలు…
మధ్యప్రదేశ్ పన్నాలో కూలీ పనులు చేసుకునే ఇద్దరు రాత్రికి రాత్రే లక్షాధికారులు అయ్యారు. విలువైన రెండు వజ్రాలు దొరకడమే ఇందుకు కారణం. బహిరంగ మార్కెట్లో వాటి ధర రూ.30 లక్షలకు పైగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

తమిళనాడులో నీటి కుంటలు, చెరువులు, సరస్సులు రానురాను మాయమవుతున్నాయని ప్రజా పనులు విభాగం మాజీ అధికారులు విడుదల చేసిన ఓ నివేదిక తెలిపింది. అధికారుల ఉదాసీనత, ప్రజలు నిర్లక్ష్యం కారణంగా 50ఏళ్లలో సుమారు వెయ్యికి పైగా జల వనరులు కబ్జాకు గురైనట్లు పేర్కొంది.

పాకిస్థాన్​ ఎంపీ మౌలానా సలాహుద్దీన్​ 14 ఏళ్ల మైనర్​ను వివాహం చేసుకున్నారని చిత్రాల్​ ప్రాంతంలోని స్వచ్ఛంద సంస్థ ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

రోజురోజుకు పెరుగుతున్న డీజిల్ ధరలు ఆర్టీసీకి గుదిబండలా మారిపోయాయి. ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఆర్టీసీపై డీజిల్ ధరలు మరింత నష్టాన్ని తీసుకొస్తున్నాయి. ఆర్టీసీ సంస్థలో ఏడాదికి సుమారు 20 లక్షల కిలోమీటర్ల డీజిల్​ను వినియోగిస్తున్నారు. దీనిపై ఆర్టీసీపై ఏడాదికి రూ. 1230 కోట్ల వరకు ఖర్చు చేస్తోంది. ఈ ఏడాది రెండు నెలల్లోనే ఆర్టీసీ డీజిల్​పై రూ. 342 కోట్లు ఖర్చు చేసింది.

పతంజలి ‘కొరోనిల్’కు మహారాష్ట్రలో అనుమతి లేదు.
కొరోనిల్ క్లినికల్ ట్రయల్స్ జరిగినట్లు చెప్తున్నారని, ఈ ట్రయల్స్‌ను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ప్రశ్నించిందని దేశ్‌ముఖ్ పేర్కొన్నారు. కోవిడ్-19 చికిత్సలో కొరోనిల్ సమర్థతపై  ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సర్టిఫికేట్ ఇచ్చినట్లు పతంజలి ఆయుర్వేద సంస్థ చెప్తోందని, అయితే ఈ వాదనను డబ్ల్యూహెచ్‌వో తోసిపుచ్చిందని తెలిపారు. ఆదరాబాదరాగా ఇలాంటి మందును ఆవిష్కరించడం, దానిని ఇద్దరు సీనియర్ కేంద్ర మంత్రులు సమర్థించడం అత్యంత శోచనీయమని తెలిపారు. డబ్ల్యూహెచ్‌వో, ఐఎంఏ వంటి సమర్థ ఆరోగ్య సంస్థల నుంచి సరైన సర్టిఫికేషన్ లేకుండా కొరోనిల్‌ను మహారాష్ట్రలో అమ్మేందుకు అనుమతించబోమని పేర్కొన్నారు.

వాహనం లోయలోపడి..తెలుగు సైనికుడి మృతి
ఆత్మకూరు/కొత్తపల్లి: దేశరక్షణకై సైన్యంలో చేరి ఊహించని ప్రమాదంలో అశువులుబాసిన సైనికుడు పొలుగంటి శివగంగాధర్‌ (28) అంత్యక్రియలు సోమవారం ఆయన స్వగ్రామంలో అధికారిక లాంఛనాలతో జరిగాయి. కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం గువ్వలకుంట్ల గ్రామానికి చెందిన రాముడు, రాములమ్మ దంపతుల ఏకైక కుమారుడు శివగంగాధర్‌ 2017లో భారత ఆర్మీలో చేరారు. భారత్‌-చైనా సరిహద్దులోని లడక్‌ ప్రాంతంలో విధులు నిర్వహించేవారు. ఈ నెల 18న ఆయన ప్రయాణించే ఆర్మీ వాహనం ప్రమాదవశాత్తు 400 అడుగుల లోతున్న లోయలో పడిపోవడంతో శివ మృతి చెందారు.

ప్రముఖ నేత హత్య కేసు విచారణ… ప్రాణభయంతో కొట్టుమిట్టాడుతున్న జడ్జి..
భోపాల్: కాంగ్రెస్ నేత దేవేంద్ర చౌరాసియా హత్య కేసుపై విచారణ జరుపుతున్న జడ్జి తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తనపై దామోహ్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్, ఇతర పోలీసులు మితిమీరిన ఒత్తిడి తెస్తున్నారని వాపోతున్నారు. తనకు జరగరానిదేమైనా జరిగే అవకాశం ఉందని భయపడుతున్నారు.

విద్యుత్ తీగను తాకిన ఇనుప నిచ్చెన… బాలుడు దుర్మరణం!
ముంబై: మహారాష్ట్రలోని ఎయిరోలీలో 12 ఏళ్ల బాలుడు విద్యుదాఘాతానికి బలయ్యాడు. రోడ్డు పక్కన ఉంచిన ఇనుప నిచ్చెనను ఆ బాలుడు తాకాడు. అయితే ఆ నిచ్చెనకు ఒక విద్యుత్ తీగ తగులుకుని ఉంది. ఈ నేపధ్యంలో దానిలో ఏర్పడిన విద్యుత్ ప్రవాహం కారణంగా ఆ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కొద్ది క్షణాల్లోనే ఆ బాలుని శరీరం పూర్తిగా కాలిపోయింది. రబలె పోలీసు అధికారి యోగేష్ గావ్డే మాట్లాడుతూ విద్యుదాఘాతంతో మృతి చెందిన బాలుడిని గుర్తించాల్సివుందన్నారు. ఫుట్‌పాత్ మీద వెళుతున్న ఆ బాలుడు నిచ్చెనను తాకిన కారణంగా ఈ ప్రమాదం సంభవించిందన్నారు. ఈ ఘటన అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డయ్యింది. పోలీసులు దీనిని యాక్సిడెంటల్ డెత్‌గా నమోదు చేశారు.

ప్లేటు బిర్యానీ రూ. 20 వేలు.. ఎక్కడో తెలుసా?
న్యూఢిల్లీ: మీరు బిర్యానీ ప్రియులు అయితే ఈ వార్త తప్పకుండా మీకోసమే. అంతేకాదు, తప్పకుండా చదవి తీరాల్సిన వార్త కూడా. సాధారణంగా బిర్యానీ అనగానే ప్రపంచవ్యాప్తంగా గుర్తొచ్చే పేరు హైదరాబాద్ ఆ తర్వాత లక్నో. అయితే, ఇప్పుడీ బిర్యానీ ప్రపంచవ్యాప్తమైపోయింది. ఇక, ఇప్పుడు చెప్పబోయే బిర్యానీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది. దుబాయ్‌లోని ఓ బ్రిటిష్ కాలం నాటి బంగ్లా ఇప్పుడు ‘బాంబే బరో’ పేరుతో లగ్జరీ హోటల్‌గా మారిపోయింది. ఇటీవలే ప్రారంభమైన ఈ హోటల్‌లో బిర్యానీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది.

రాయల్ గోల్డ్ బిర్యానీ’ పేరుతో అందించే ఈ బిర్యానీ ప్లేట్ ధర ఎంతో తెలుసా? 1,000 దిర్హమ్‌లు. భారత కరెన్సీలో రూ. 19,704 మాత్రమే. హోటల్ తొలి వార్షికోత్సవం సందర్భంగా మెనూలో దీనిని చేర్చారు. మూడు కేజీల ఈ బిర్యానీని పెద్ద గోల్డ్ మెటాలిక్ ప్లేట్‌లో సర్వ్ చేస్తారు. ఇందులో చికెన్ బిర్యానీ రైస్, కీమా రైస్, వైట్/శాఫ్రాన్ రైస్‌ వేరియంట్లు లభిస్తాయి. బేబీ ఆలుగడ్డలు, ఉడకించిన గుడ్లతో అలంకరిస్తారు.

పెళ్లిరోజునే రక్తదానం చేసిన వధూవరులు
లక్నో: నవ దంపతులు రక్తదానం చేసి ప్రాణ దాతలు అయ్యారు. ఓ యువతి ప్రాణాలు కాపాడటానికి  కొత్తగా వివాహం చేసుకున్న జంట పెళ్లి రోజునే రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచింది. ఆపదలో ఉన్న యువతి కోసం రక్తదానం చేసి మానవత్వం చాటుకున్న వధూవరులను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. నూతన జంట రక్తదానం చేసిన విషయాన్ని ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీస్‌ ఆశీష్‌ మిశ్రా ట్విటర్లో పంచుకున్నారు. ఈ జంటను ప్రశంసిస్తూ మిశ్రా నవదంపతుల ఫొటోను షేర్‌ చేశారు.

గాల్వ‌న్ దాడిపై కామెంట్‌.. చైనా బ్లాగ‌ర్ అరెస్టు
బీజింగ్‌: గ‌త ఏడాది జూన్ 15వ తేదీన ల‌డాఖ్‌లో జ‌రిగిన స‌రిహ‌ద్దు ఘ‌ర్ష‌ణ‌లో తమ సైనికులు కూడా చ‌నిపోయిన‌ట్లు ఇటీవ‌ల చైనా అంగీక‌రించిన విష‌యం తెలిసిందే. ఆ ఘ‌ర్ష‌ణ‌లో మ‌ర‌ణించిన న‌లుగురు ఆర్మీ ఆఫీస‌ర్ల‌కు కొన్ని రోజుల క్రితం వీర పుర‌స్కారాల‌ను అంద‌జేసింది. గాల్వ‌న్‌ ఘ‌ట‌న వీడియోను కూడా చైనా రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే. ఆ వీడియోపై 38 ఏళ్ల  చైనా బ్లాగ‌ర్ ఒక‌రు అనుచిత కామెంట్ చేశారు. దేశ హీరోల‌ను, అమ‌రుల‌ను అమ‌ర్యాదప‌రిస్తే వారిని అరెస్టు చేసే విధంగా రెండేళ్ల క్రితం చైనా ఓ చ‌ట్టం చేసింది. ఆ చ‌ట్టం ప్ర‌కారం క్యూ అనే బ్లాగ‌ర్‌ను అరెస్టు చేశారు. ఫిబ్ర‌వ‌రి 19న అత‌న్ని అదుపులోకి తీసుకున్న‌ట్లు నాన్‌జింగ్ ప‌బ్లిక్ సెక్యూర్టీ బ్యూరో పేర్కొన్న‌ది. బ్లాగ‌ర్ క్యూకు  వీబోలో సుమారు 25 ల‌క్ష‌ల మంది ఫాలోవ‌ర్లు ఉన్నారు.   అయితే అత‌ని అకౌంట్‌ను ఏడాది పాటు బ్యాన్ చేస్తున్న‌ట్లు ఇటీవ‌ల మైక్రోబ్లాగింగ్ సైట్ వీబో ప్ర‌క‌టించింది.

భార్య పాతివ్రత్య నిరూపణకు అగ్ని పరీక్ష!
ఉస్మానాబాద్‌: మహారాష్ట్రలో అమానుష ఘటన జరిగింది. నేటి ఆధునిక కాలంలోనూ భార్యను అనుమానిస్తూ శీల పరీక్ష చేశాడు. పురాణాల్లో అగ్ని పరీక్ష చేయగా నేడు భర్త సలసల కాగే నూనెలో చేతులు పెట్టించి ఆమె పాతివ్రత్యాన్ని పరీక్షించాడు. ఈ ఘోర ఘటన మహారాష్ట్రలోని ఉస్మానాబాద్‌ జిల్లా పరాండలోని కచాపురి చౌక్‌లో జరిగింది. అయితే భార్యకు పరీక్ష చేస్తూ దాన్ని వీడియో తీసి సోషల్‌ మీడియాలో పంచుకోవడం తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది.

About The Author