రేవ్ పార్టీ… వెలుగులోకి కొత్త విషయాలు
సంస్థాన్ నారాయణ్‌పూర్ ఫాంహౌజ్‌లో రేవ్ పార్టీ వ్యవహారం నేపథ్యంలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. హైదరాబాద్ పబ్బుల నుంచి శివారు ప్రాంతాల్లో ఉన్న ప్రైవేట్ గెస్ట్‌హౌజ్‌లు, రిసార్ట్‌లకు మకాం మార్చిన డ్రగ్స్ స్మగ్లర్లు సరికొత్త దందాకు తెరలేపినట్లు తెలుస్తోంది. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల కోసం వేర్వేరు వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేస్తూ, విద్యార్థులను డ్రగ్స్ గ్యాంగ్స్ ఆకర్షిస్తున్నాయి. అంతేగాక ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా రేవ్ పార్టీ వివరాలు షేర్ చేస్తూ బరితెగిస్తున్నాయి. ఈ క్రమంలో పబ్స్ నుంచి ఆర్డర్ చేయించుకుని పలువురు ఇంజనీరింగ్ విద్యార్థులు మాదక ద్రవ్యాలు సేవిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా సంస్థాన్ నారాయణ్‌పూర్ రేవ్ పార్టీ వివరాలను కూడా గిరీష్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.ఇక ఈ పార్టీలో పాల్గొన్న వాళ్లంతా డ్రగ్స్ వాడినట్లు సమాచారం. గంజాయితో పాటు ఇతర డ్రగ్స్, మద్యం సేవించినట్లు తెలుస్తోంది. కాగా ప్రముఖ రియల్టర్ ధన్వంత్ రెడ్డి కుమారుడు శ్రీకాంత్ రెడ్డి సంస్థాన్ నారాయణ్‌పూర్‌లో శుక్రవారం రేవ్ పార్టీ ఆర్గనైజ్ చేసినట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. సమాచారం అందుకున్న పోలీసులు, అక్కడికి చేరుకుని సుమారు 90 మందిని అదుపులోకి తీసుకున్నారు. భారీ ఎత్తున బైకులు, కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి విచారణ కొనసాగుతోంది.