వెయ్యి మంది టిటిడి ఉద్యోగులకు కోవిడ్ వ్యాక్సినేషన్…
శ్రీవారి దర్శనానికి విచ్చేస్తున్న భక్తులకు నేరుగా సేవలందిస్తున్న వివిధ విభాగాల్లోని వెయ్యి మందికి పైగా ఉద్యోగులకు టిటిడి ఇప్పటివరకు కోవిడ్ వ్యాక్సినేషన్ అందించింది. టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి ఆదేశాల మేరకు మార్చి 4వ తేదీ నుండి తిరుమలలో, మార్చి 5వ తేదీ నుండి తిరుపతిలో ఉద్యోగులకు వ్యాక్సిన్లు వేస్తున్నారు.
మొదటి విడతలో భక్తులకు నేరుగా సేవలందించే ఉద్యోగులకు, రెండో విడతలో 45 ఏళ్లు పైబడి, షుగర్, బిపి సమస్యలు ఉన్న వారికి, మూడో విడతలో ఇతర ఉద్యోగులందరికీ వ్యాక్సిన్లు వేస్తారు.
ఇందులో భాగంగా మంగళవారం తిరుమలలో టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, శ్రీవారి ఆలయ ప్రధానార్చకుల్లో ఒకరైన శ్రీ వేణుగోపాల దీక్షితులు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ ఎవి.ధర్మారెడ్డి మాట్లాడుతూ టిటిడి ఉద్యోగులు వ్యాక్సిన్ వేయించుకుని కోవిడ్ వ్యాధి నుండి సురక్షితంగా ఉండాలని కోరారు.
టిటిడి సిఎంఓ డాక్టర్ నర్మద, ఆరోగ్యాధికారి డాక్టర్ ఆర్ఆర్.రెడ్డి ఆధ్వర్యంలో తిరుమల అశ్విని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కుసుమకుమారి, తిరుపతిలోని కేంద్రీయ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కుసుమ ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు.
—————————————————————-
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.