అద్దెకు సొంత వాహనాలు…


టూ వీలర్లు కూడా…
– టూరిస్ట్‌ పర్మిట్‌తో దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా..
– ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి
– ఎల్లోప్లేట్‌ విధానానికి స్వస్తి
– వైట్‌ ప్లేట్‌ దందాకు రాజముద్ర
– ఆర్టీసీల ఆదాయానికి గండి
నవతెలంగాణ-హైదరాబాద్‌ బ్యూరో
ఇప్పటి వరకు వైట్‌ నెంబర్‌ ప్లేట్‌ ఉన్న వాహనాలు ప్రయాణీకులను రవాణా చేయడం నిషేధం. ఆర్టీఏ తనిఖీల్లో పట్టుబడితే వాహనాలను సీజ్‌ చేసి, భారీగా జరిమానాలు విధించేవారు. దీన్ని కచ్చితంగా అక్రమ రవాణాగా పరిగణించేవారు. ఇప్పుడు ఈ అక్రమాన్ని సక్రమం చేస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఒకే దేశం- ఒకే పర్మిట్‌ పేరుతో మోటారు వాహన సవరణ చట్టాన్ని తెచ్చింది. యావత్‌ దేశమంతా కరోనా విపత్తుతో సతమతమవుతున్న తరుణంలో కేంద్రప్రభుత్వం ఈ సవరణ చట్టానికి రాజముద్ర వేసుకున్నది. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి టూరిస్ట్‌ పర్మిట్‌ పేరుతో కేంద్రప్రభుత్వానికి డబ్బు చెల్లిస్తే, దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా కార్లు, బైక్‌లు, బస్సులు సహా అన్ని వాహనాలతోనూ ప్రయాణం చేయోచ్చు. 9 సీట్ల కంటే తక్కువ ఉన్న నాన్‌ ఏసీ వాహనమైతే ఏడాదికి రూ.15వేలు, ఏసీ వాహనమైతే రూ.25వేలు చెల్లించి టూరిస్ట్‌ పర్మిట్‌ తీసుకోవచ్చు.

23 సీట్ల కంటే తక్కువ ఉన్న మినీ బస్సులు, ఇతర వాహనాలు నాన్‌ ఏసీ అయితే ఏడాదికి రూ.50వేలు, ఏసీ అయితే రూ.75 వేలు చెల్లించాలి. 23 సీట్లకంటే ఎక్కువ ఉన్న నాన్‌ ఏసీ బస్సులైతే టూరిస్ట్‌ పర్మిట్‌ కోసం ఏడాదికి రూ.2 లక్షలు, ఏసీ బస్సు అయితే రూ.3 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. టూరిస్ట్‌ పర్మిట్‌ తీసుకున్నా, ఆయా రహదారులపై టోల్‌టాక్స్‌, ఫాస్టాగ్‌ వంటివి చెల్లించాల్సిందే. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల జాతీయ రహదారులపై వాహనాల రద్దీ పెరుగుతుంది.

ఫలితంగా రోడ్డు ప్రమాదాలూ పెరుగుతాయి. ముఖ్యంగా ఆర్టీసీలు ఆర్థికంగా మరింత నష్టపోతాయి. తద్వారా ప్రజారవాణా కుంటుపడుతుంది. సాధారణ ప్రజలు, పేదలకు రవాణా అందుబాటులో లేకుండా పోతుంది.

ఆయా రూట్లలో ఇప్పటి వరకు ఆర్టీసీలకు గుత్తాధిపత్యం ఉంది. టూరిస్ట్‌ పర్మిట్లుతో రాజ్యాంగంలో ఆర్టీసీలకు కల్పించిన ప్రత్యేక భద్రత చట్టాలన్నీ రద్దు చేయబడినట్టు అవుతుంది. లాభాలు వచ్చే రద్దీ రూట్లలో కూడా ప్రయివేటు బస్సులు ప్రయాణీకులను రవాణా చేసుకొనే అవకాశాలు ఏర్పడతాయి. ఇప్పటి వరకు ప్రయాణీకుల రవాణా కోసం రాష్ట్రాల్లో ఎల్లో నెంబర్‌ ప్లేట్‌ను ఇచ్చేవారు.

క్యాబ్‌లు, ఆటోలు, బస్సులకు కూడా ఇదే విధానం అమల్లో ఉండేది. ఎల్లో నెంబర్‌ ప్లేట్‌ వాహనానికి అదనంగా త్రైమాసిక పన్నులు, రోడ్డు ట్యాక్స్‌లు, ఫిట్‌నెస్‌లు ఉంటాయి. ఫిట్‌నెస్‌ అనేది ప్రయాణీకుల భద్రతకు అత్యంత కీలకం. ఇప్పుడది ప్రశ్నార్థకమవుతుంది.

టూరిస్ట్‌ పర్మిట్ల వల్ల వాటన్నింటినీ ఎత్తేసి, సంవత్సర పన్నును ఒకేసారి కట్టాల్సి ఉంటుంది. టూరిస్ట్‌ పర్మిట్లు వైట్‌ ప్లేట్‌ వాహనాలు కూడా తీసుకోవచ్చు. ఫలితంగా సొంత కార్లను కూడా ప్రజారవాణా కోసం అద్దెకిచ్చుకోవచ్చు. ఒకే దేశం-ఒకే పర్మిట్‌ విధానం వల్ల రాష్ట్రాల హక్కులు హరించబడతాయని జాతీయ రవాణా సంఘాలు అభ్యంతరాలు తెలిపినా, కేంద్రం పట్టించుకోలేదు. ఇప్పటికే గ్రేటర్‌ హైదరాబాద్‌ వంటి ప్రాంతాల్లో వైట్‌ప్లేట్‌ కార్లు, ద్విచక్ర వాహనాలను కూడా అద్దెకు ఇస్తున్నారు. ర్యాపిడో, ఊబర్‌, ఓలా వంటి సంస్థలు ఆన్‌లైన్‌ సర్వీస్‌ సెంటర్ల ద్వారా సొంత ద్విచక్ర వాహనాల ద్వారా ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి.

About The Author