ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా ఒకే పర్మిట్
పది మంది కలిస్తే చాలు పర్యాటక పర్మిట్లపై దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చు. క్యాబ్‌లు, మ్యాక్సీ క్యాబ్‌లు మొదలుకొని బస్సుల వరకు దేశవ్యాప్తంగా రాకపోకలు సాగించవచ్చు. రాష్ట్రాలు మారినప్పుడల్లా పన్నులు చెల్లించాల్సిన అవసరం లేకుండా.. కేవలం ఒకే పర్మిట్ తీసుకుంటే చాలు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘వన్ నేషన్– వన్ పర్మిట్’లో భాగంగా ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఇది అమల్లోకి రానుంది. మన రాష్ట్రంలో త్వరలోనే అమలు చేయనున్నట్టు రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.దేశవ్యాప్తంగా ఎక్కడికైనా వెళ్లొచ్చు
సాధారణంగా పెళ్లిళ్లు, వేడుకలు, తీర్థయాత్రలకు వెళ్లే వారికోసం రవాణాశాఖ ఇప్పటివరకు టూరిస్టు పర్మిట్లు ఇస్తోంది. కాంట్రాక్టు క్యారేజీలుగా తిరిగే వాహనాలు మాత్రం రాష్ట్ర, అంతర్రాష్ట్ర పర్మిట్లపై తిరుగుతున్నాయి. ప్రైవేట్ బస్సులకు ఇచ్చే ఈ పర్మిట్ల వల్ల రవాణా శాఖకు భారీగా ఆదాయం లభిస్తుంది. అయితే కొత్తగా అమల్లోకి రానున్న వెసులుబాటు వల్ల.. ప్రైవేట్ బస్సులు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు చెల్లించి టూరిస్టు పర్మిట్లపై దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా రాకపోకలు సాగిస్తాయి. ఒక్కసారి పన్ను చెల్లిస్తే ఏడాది పాటు వాహనాలు నడుపుకోవచ్చు.
ప్రైవేటు ఆపరేటర్లకు ప్రయోజనం
కొత్తగా అమల్లోకి రానున్న టూరిస్టు పర్మిట్ల వల్ల ప్రస్తుతం జిల్లా, రాష్ట్ర స్థాయి పర్మిట్లపై బస్సులు నడిపే ప్రైవేట్ ఆపరేటర్లకు మాత్రం ఎంతో ప్రయోజనం కలుగనుంది. అయితే ఇప్పటికే ప్రైవేటు వాహనాల అక్రమ రవాణా వల్ల తీవ్రంగా నష్టపోతున్న ఆర్టీసీకి మరింత నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ప్రస్తుతం కాంట్రాక్టు క్యారేజీలుగా పర్మిట్లు తీసుకొంటున్న ప్రైవేట్ బస్సులు స్టేజీ క్యారేజీలుగా తిరుగుతున్న సంగతి తెలిసిందే.
హైదరాబాద్ నుంచి సుమారు 1,150 ప్రైవేట్ బస్సులు తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు, చెన్నై, షిరిడీ తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. మరోవైపు లక్షకు పైగా క్యాబ్‌లు అంతర్రాష్ట్ర పర్మిట్‌లపై ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. ఇలాంటి వాహనాలన్నీ ఇక నుంచి టూరిస్టు పర్మిట్లపై తిరిగే అవకాశం ఉంది. దీనివల్ల ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి మారినప్పుడు పర్మిట్ల కోసం అదనంగా చెల్లించవలసిన అవసరం ఉండదు.
టూరిస్టు పర్మిట్ల ఫీజులివీ
9 సీట్ల కంటే తక్కువ సామర్థ్యమున్న నాన్ ఏసీ వాహనమైతే ఏడాదికి రూ.15 వేలు, ఏసీ వాహనమైతే రూ.25 వేల చొప్పున చెల్లించాలి.
10 మంది ప్రయాణికులకు తక్కువ కాకుండా.. 20 మందికి మించకుండా తిరిగే నాన్ ఏసీ మినీ బస్సులు ఏడాదికి రూ.50 వేలు, ఏసీ మినీ బస్సులు రూ.75 వేల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
23 సీట్లకంటే ఎక్కువ ఉన్న నాన్ ఏసీ బస్సులు టూరిస్ట్ పర్మిట్ కోసం ఏడాదికి రూ.2 లక్షలు, ఏసీ బస్సులు రూ.3 లక్షల చొప్పున ఫీజు చెల్లించి పర్మిట్లు తీసుకోవచ్చు.
టూరిస్ట్ పర్మిట్ తీసుకున్న వాహనాలు టోల్‌ట్యాక్స్, ఇతర చార్జీలన్నీ యథావిధిగా చెల్లించాల్సి ఉంటుంది.
ఇది చాలా అన్యాయం
కేంద్రం తీసుకున్న నిర్ణయం చాలా అన్యాయంగా ఉంది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్‌లో వైట్ ప్లేట్ కార్లు, ద్విచక్ర వాహనాలను అద్దెకు ఇస్తున్నారు. ర్యాపిడో, ఉబెర్, ఓలా వంటి అగ్రిగేటర్ సంస్థలు కూడా టూరిస్టు పర్మిట్లపై తిరిగే అవకాశం ఉంది. చట్టబద్ధంగా త్రైమాసిక పన్ను చెల్లించి తిరిగే రవాణా వాహనాలకు ఇది చాలా నష్టం.