మూఢనమ్మకాలు బాణామతి చేతబడులంటూ…
మూఢనమ్మకాలు
బాణామతి చేతబడులంటూ
మంత్రతంత్రాల చింతలు మనిషి మస్తిష్కంలో
గెరిల్లా యుద్ధతంత్రాలై బ్రమిస్తుంటే
తన తలరాతకు తాయత్తే తాహత్తని తలుస్తూ
హెతుతత్వ తలంపులకు తిలోదకాలిచ్చిన వైనమది.
జోతిష్యగుడారంలో జాతకాన్ని వెతుక్కుంటూ
చేవను చేతలలో కాక చేతిగీతలలో
చూసుకునే మనిషి జీవితం భేతాళుడి ఆఖరి కథలా
అస్తిత్వపుస్తకంలో చిరిగిపోయిన కాగితమవుతుంది
సత్కార్యాలకు శకునం శాసనమై నిలిచిన వేళ
గ్రహణం గ్రహచారాలంటూ కాలంచెల్లిన ఆచారాలకి
మనిషి అజ్ఞానం మరింత ఆజ్యమవుతుంటే,
తన అంతఃకరణం
మూడత్వానికి తర్పణమైపోయింది.
అసంకల్పిత అనర్థాలకు హేతువని
శుభతంతుకు వితంతును వెలేసి
దురాచారద్రోణిలో తోసేసిన షడ్గుణాల మనస్తత్వం
వితండశృంగంపై తాండవమాడుతుంది.
బల్లిపాటుకు బెదిరిపోయి
సైందవస్వప్న స్వైరవిహారాల
పర్యవసనాలను శాస్త్రంలో పరికిస్తూ
ఉసురుభీతితో ఖననమయ్యే కలియుగదేహం
జోస్యజాడ్యానికి నిఘంటువైపోయింది…
ఆవాసద్వారాలకు దారులుచూపుతూ
వాస్తును కాస్తు చేసే కుహానజ్ఞానుల
భోనులో చిక్కిన మూడుల మది
మీమాంసయాతనతో
అనునిత్యం అంత్యక్రియలు జరుపుకుంటుంది…..
మద్యపానం ఆరోగ్యానికి హానికరమంటూ
లిక్కర్ పై అతికించిన స్టికర్ లా
ఆస్తిక సాగరంలో పడిన ఎతియిజం ఆనవాళ్ళు
శంఖశిలాజాల్లా రూపుదిద్దుకుంటుంటే,
మిస్టరీ వీడని మూడత్వహిస్టరీ నుంచి
మనిషి విజ్ఞత చెదిరిపోయిన అక్షరమైపోయింది…