వచ్చే 15 రోజుల్లో యాక్టివ్ కేసులు రెట్టింపు…
వచ్చే పక్షం రోజుల్లో తమ రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసులు రెట్టింపయ్యే ప్రమాదముందంటూ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే గురువారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఈనెల 30వ తేదీ నాటికి రాష్ట్రంలో యాక్టివ్ కేసులు ప్రస్తుతమున్న 5.64 లక్షల నుంచి 11.9 లక్షలకు చేరుకుంటాయని అందులో తెలిపారు. రోజుకు ప్రస్తుతమున్న 1,200 మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్ వాడకం అప్పటికి 2వేల టన్నులకు చేరుకుంటుందని పేర్కొన్నారు. పెరిగిన అవసరాలు తీర్చేలా దేశంలోని మిగతా ప్రాంతాల నుంచి ఆక్సిజన్‌ను విమానాల ద్వారా తరలించేందుకు జాతీయ విపత్తు నిర్వహణ చట్టాన్ని ప్రయోగించేందుకు అనుమతివ్వాలని కోరారు. కరోనా కేసుల దృష్ట్యా పొరుగు రాష్ట్రాలు కూడా ఆక్సిజన్ సరఫరాకు అశక్తత వ్యక్తం చేశాయన్నారు. అలాగే, రెమిడెసివిర్ ఔషధాన్ని డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి చేసేందుకు అనుమతులు మంజూరు చేయాలని కోరారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారిని ప్రకృతి విపత్తుగా ప్రకటించాలని కోరారు. దీనివల్ల రాష్ట్ర విపత్తు స్పందన నిధి నుంచి బాధితులకు సాయం అందించేందుకు వీలవుతుందన్నారు. కేసుల తీవ్రత దృష్ట్యా ఈనెల 14 నుంచి మే 1వ తేదీ వరకు 15 రోజులపాటు రాష్ట్రంలో ప్రభుత్వం కఠిన నిబంధనలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే.