ఆంధ్రప్రదేశ్ లో మాస్కు ధరించకపోతే జరిమానా…
అమరావతి: మాస్కు ధరించకపోతే జరిమానా విధించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా నివారణ చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. 1 నుంచి 9వ తరగతులకు సెలవులు ప్రకటించామని తెలిపిన సీఎం.. హాస్టళ్లు, కోచింగ్ సెంటర్లు కూడా మూసివేయాలని ఆదేశించారు.
100 జరిమానా విధించాలని సీఎం జగన్ అధికారులను ఈ సందర్బంగా ఆదేశించారు. కరోనా సమస్యలన్నింటికీ 104 నెంబర్ పరిష్కారంగా ఉండాలన్నారు. సినిమా హాళ్లు, ఫంక్షన్ హాళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, హోటళ్లలో భౌతిక దూరం తప్పనిసరి అని అన్నారు. ఆస్పత్రులలో వైద్య సదుపాయాలు, వైద్యులు అందుబాటులో ఉండాలని చెప్పారు.
థియేటర్లు, ఫంక్షన్ హాళ్లలో.. సీఎం కీలక ఆదేశాలు
ఫంక్షన్ హాళ్లలో రెండు కుర్చీల మధ్య ఆరు అడుగుల దూరం, థియేటర్లలో ప్రతి రెండు సీట్ల మధ్య ఒక సీటు ఖాళీగా ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అయితే, పదవ తరగతి, ఇంటర్ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని సీఎం జగన్ స్పష్టం చేశారు. అన్ని ఆస్పత్రుల్లో తగినంత ఆక్సిజన్ సరఫరా ఉండాలన్నారు సీఎం. విశాఖ ప్లాంటు నుంచి రావాల్సిన ఆక్సిజన్ వాటా సరఫరా అయ్యేలా చూడాలని, ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. కరోనా నిర్ధారణ అయినవారి ప్రైమరీ కాంటాక్టులు త్వరగా ట్రేస్ చేయాలని, కోరుకున్నవారందరికీ టెస్టులు చేయాలన్నారు.
కోవిడ్ మరణాలు.. వర్క్ ఫ్రం హోం కావాలంటూ సచివాలయ ఉద్యోగులు
ఏపీలో కరోనాతో ఇద్దరు సచివాలయ ఉద్యోగులు మరణించారు. దీంతో సచివాలయ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇది ఇలావుండగా, ఇద్దరు హైకోర్టు ఉద్యోగులు కూడా కరోనా బారినపడి మరణించారు. రెండ్రోజుల క్రితం విజయనగరం సీసీఎస్ పోలీస్ స్టేషన్ డీఎస్పీ పాపారావు కరోనా బారినపడి మరణించారు. కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి రోజు రోజుకు మరింతగా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 37,765 నమూనాలను పరీక్షించగా.. 5963 మందికి కరోనా సోకినట్లు తేలింది. తాజాగా నమోదైన 5963 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,68,000కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 27 మంది మృతి చెందారు. ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 2569 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 9,12,510కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 48,053 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,57,15,757 కరోనా నమూనాలను పరీక్షించారు.