ఏపీలో డేంజరస్ కరోనా వైరస్, సీసీఎంబీ


ఏపీలో డేంజరస్ కరోనా వైరస్, సీసీఎంబీ శాస్త్రవేత్తలు గుర్తించారన్న చంద్రబాబు..లాక్ డౌన్ డిమాండ్!!
టీడీపీ అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారిపై షాకింగ్ విషయం వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ప్రమాదకరమైన కరోనా వైరస్ విజృంభిస్తోంది అని చంద్రబాబు పేర్కొన్నారు.ఈరోజు పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన చంద్రబాబు రాష్ట్రంలో తాజా కరోనా పరిస్థితులపై మాట్లాడి, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా లాక్ డౌన్ కు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
అత్యంత ప్రమాదకరమైన కరోనావైరస్ ఎన్ 440 కె, కర్నూలులో గుర్తించిన సిసిఎంబి శాస్త్రవేత్తలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ప్రమాదకరమైన కరోనావైరస్ ఎన్ 440 కె వ్యాపిస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. తొలిసారిగా దీనిని కర్నూలులో సిసిఎంబి శాస్త్రవేత్తలు గుర్తించారని ఆయన తెలిపారు.ఇతర వైరస్ల కన్నా ఈ వైరస్ పది రెట్లు ఎక్కువ ప్రభావం చూపిస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు.దీంతో ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం లాక్ డౌన్ చేయాలని,ఆ దిశగా చర్యలు చేపట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు.
:: ప్రభుత్వ నిధులు ప్రచార ఆర్భాటాలకు , గత సర్కార్ మీద బురద చల్లటానికి దుర్వినియోగం
ఇప్పటికే కరోనా మహమ్మారి ఉధృతి దృష్ట్యా 14 రోజుల పాటు ఒరిస్సాలో లాక్ డౌన్ ప్రకటించారని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం అంతంతమాత్రంగా సాగుతుందన్న చంద్రబాబు, వ్యాక్సినేషన్ కార్యక్రమం కోసం పలు రాష్ట్రాలు పెద్ద ఎత్తున ఆర్డర్లు పెట్టాయని, ఏపీ సీఎం జగన్ మాత్రం అవేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.మూడు వేల కోట్ల ప్రభుత్వ నిధులు కేవలం కార్యాలయాలకు రంగులు వేయటం కోసం దుర్వినియోగం చేసిన సర్కార్, గత ప్రభుత్వం పై బురదజల్లడానికి,గోరంతలు కొండంతలుగా చూపించడానికి, ప్రచార ఆర్భాటాలకు నిధులను దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు.
:: సీఎం జగన్ ప్రజారోగ్యంపై దృష్టి పెట్టాలన్న చంద్రబాబు
ప్రజారోగ్యంపై దృష్టి పెట్టడం లేదని, ఇప్పటికైనా సీఎం జగన్ ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.ఆసుపత్రులలో బెడ్ లు, ఆక్సిజన్ సరఫరా పెంచాలని డిమాండ్ చేసిన చంద్రబాబు ఏపీ తాజా పరిస్థితిపై పార్టీ నేతలతో చర్చించారు.రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరగటం ఆందోళన కలిగిస్తుందని అన్నారు. ఇదిలా ఉంటే పెరుగుతున్న కరోనా కేసులు నేపద్యంలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ కరోనా నియంత్రణకు కీలక నిర్ణయం తీసుకుంది.
:: ఏపీలో పాక్షిక కర్ఫ్యూ విధింపు, లాక్ డౌన్ చర్యలకు టీడీపీ డిమాండ్
రాష్ట్రంలో ఎల్లుండి నుండి కఠిన ఆంక్షలను, పాక్షిక కర్ఫ్యూ విధించి పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఉదయం 6 గంటలనుండి 12 గంటల వరకు దుకాణాలకు అనుమతించి,రెండు వారాల పాటు ఇదే విధానాన్ని అనుసరించి పాక్షికంగా ప్రజలందరూ లాక్ డౌన్ ను పాటించాలని ప్రభుత్వం చెబుతోంది.కరోనా మహమ్మారి కట్టడికి సీఎం జగన్ తాజా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కానీ టీడీపీ మాత్రం లాక్ డౌన్ చర్యలపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తుంది.

About The Author