క్యాథలిక్ చర్చ్ లో మతాచార్యుల ఆధిపత్యం…
కేరళలో ఒక నన్, మతాచార్యులకు ఇచ్చిన వార్నింగ్ లెటర్, నోటీసులు చర్చిలో ఆధిపత్య భావజాలాన్ని వెల్లడిస్తున్నాయి.
పంజాబ్‌కు చెందిన మతాచార్యునికి వ్యతిరేకంగా కేరళలో నిరనసన ప్రదర్శనలకు నేతృత్వం వహించిన మతాధిపతికి నోటీసులు జారీ చేసిన కొన్ని నెలల తర్వాత, నిందితులపై ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడానికి నిరసనగా చేపట్టిన ప్రదర్శనలలో పాల్గొన్న నన్‌కు వార్నింగ్ లెటర్ ఇచ్చారు.
జలంధర్‌కు చెందిన బిషప్ ఫ్రాంకో ములక్కల్ 2014-16 మధ్యకాలంలో ఒక నన్‌పై 13 సార్లు లైంగిక అత్యాచారానికి పాల్పడినందుకు కొంతకాలం జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు.
44 ఏళ్ల ఆ నన్, 2018, జూన్‌లో తనపై జరిగిన అత్యాచారాల గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్యాథలిక్ చర్చి మతాచార్యులకు ఎన్ని సార్లు చెప్పినా వాళ్లు తన ఫిర్యాదుపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ఆమె ఆరోపించారు.
సిస్టర్ లూసీ కలరుప్పకు, ఫాదర్ అగస్టీన్‌కు నోటీసులు జారీ చేయడం చూస్తే, మతపరమైన సంస్థల్లో ఇలా ఎంత మంది బలి కావాలన్న సందేహాలు తలెత్తుతున్నాయి.
తనకు జారీ చేసిన వార్నింగ్ లెటర్లో కోరినట్లు సిస్టర్ లూసీ బుధవారం వేనాడులోని ఫ్రాన్సీసియన్ క్లారిస్ట్ కాంగ్రిగేషన్ సుపీరియర్ జనరల్ ముందు హాజరై, జరిగిన దానికి పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు.
”నేను ఎలాంటి తప్పూ చేయలేదని, అత్యాచారానికి గురైన నన్‌కు మద్దతు పలకడం ద్వారా సరైన పనే చేశానని భావిస్తున్నాను. నిజానికి ఆ నిరసనలో సిస్టర్లు అందరూ పాల్గొనాల్సింది. కానీ వాళ్లా పని చేయలేదు” అని సిస్టర్ లూసీ బీబీసీకి తెలిపారు.
”వాళ్లేం చేయాలనుకుంటే అది చేయనివ్వండి. నేనేం దాని గురించి భయపడ్డం లేదు” అన్నారామె.
సిస్టర్ లూసీ మిషనరీస్ ఆఫ్ జీసస్కు చెందిన అనేక మంది నన్లతో కలిసి గత సెప్టెంబర్‌లో కోచిలో బిషప్ ములక్కల్‌పై చర్యలు తీసుకోవాలంటూ నిర్వహించిన నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు.
ఈ నిరసన ప్రదర్శనలు ‘సేవ్ అవర్ సిస్టర్స్’ కమిటీ ఆధ్వర్యంలో జరిగాయి.
నిజానికి చర్చి పద్ధతుల ప్రకారం, అలాంటి ఫిర్యాదులను సాధారణంగా చర్చి ఉన్నతాధికారులు పోలీసులకు పంపాలి. కానీ అలా జరగలేదుర.
బాధితురాలి కొలీగ్స్ ఐదుగురు నిబంధనలను ఉల్లంఘించి, నిరసన ప్రదర్శనల్లో పాల్గొనడంతో దీనికి పెద్ద ఎత్తున ప్రాధాన్యత లభించింది.
సెప్టెంబర్ 22న పోలీసులు బిషప్ ములక్కల్‌ను అరెస్ట్ చేశామని ప్రకటించాకే ఆ నిరసన ప్రదర్శనలను విరమించుకున్నారు. ప్రస్తుతం ఆ బిషప్ బెయిల్ మీద బైట ఉన్నారు.
ఆందోళనల తర్వాత ఏం జరిగింది?
బిషప్ అరెస్ట్ తర్వాత కొన్ని వారాల పాటు ఏమీ జరగలేదు. కానీ నవంబర్ 11న ఎర్నాకులం-అంగామలి ఆర్చిడయోసిస్కు చెందిన బిషన్ జాకోబ్ మనతోదత్, ఫాదర్ అగస్టీన్‌కు షోకాజ్ నోటీసు జారీ చేశారు. ‘సేవ్ అవర్ సిస్టర్స్’తో ఆయనకున్న సంబంధాలేమిటో వెల్లడించాలని ఆ నోటీసులో కోరారు.
అయితే ఆ నిరసనలు చర్చికి వ్యతిరేకంగా కాదని ఫాదర్ అగస్టీన్ వివరించారు. కానీ ఫాదర్ అగస్టీన్ వెంటనే ఎస్ఓఎస్ నుంచి బయటకు రావాలని బిషబ్ జాకోబ్ ఆదేశించారు.
నోటీసుకు ప్రతిస్పందన
తాను ఇంతవరకు ఆ నోటీసులు సమాధానం ఇవ్వలేదని, త్వరలో ఆ పని చేస్తానని ఫాదర్ అగస్టీన్ బీబీసీకి తెలిపారు. అయితే తనకు, సిస్టర్ లూసీకి నోటీసులు ఇవ్వడం క్రిస్మస్ రోజు పోప్ ఇచ్చిన సందేశానికి విరుద్ధమని ఆయన అన్నారు.
”లైంగిక అత్యాచారాలను సహించేది లేదని పోప్ చాలా గట్టిగా హెచ్చరించారు. అంతే కాదు, వాటిని కప్పి పుచ్చే ప్రయత్నాలను కూడా సహించబోనని అన్నారు. కానీ ఇక్కడ కేరళలో మాత్రం చర్చి అలాంటి వారిపై ఏ చర్యనూ తీసుకోవడం లేదు” అని ఫాదర్ అగస్టీన్ అన్నారు.
చర్చి పెద్దలు భవిష్యత్తులో సిస్టర్ల నుంచి వచ్చే ప్రశ్నల గురించి భయపడుతున్నారని ఆయన అన్నారు. ”ఇక్కడ ఓ బానిస వ్యవస్థలాంటిది ఉంది. ఎవరూ ఎలాంటి ప్రశ్నలూ అడగరాదు. సొంతంగా నిర్ణయాలు తీసుకోరాదు. దీనికి విధేయత అని పేరు పెట్టారు.”
సిస్టర్ లూసీ 2015 మేలో తనకు వచ్చిన బదిలీని లెక్క చేయనందుకు, ఒక కవితల పుస్తకాన్ని ప్రచురించినందుకు, కారు డ్రైవింగ్ నేర్చుకున్నందుకు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నందుకు పదేపదే ప్రశ్నించారు.
చర్చికి హాని చేసే నిరసన ప్రదర్శనల్లో ఆమె ఎందుకు పాల్గొన్నారో, కొన్ని క్రైస్తవేతర పత్రికల్లో ఎందుకు కథనాలు ప్రచురించారో, టీవీ ఛానెల్ చర్చలలో ఎందుకు పాల్గొన్నారో వివరించాలని కోరారు.
ఎందుకు జరుగుతోంది?
దీనికి సమాధానంగా ఫాదర్ అగస్టీన్, ”చర్చికి లోబడి ఉంటేనే క్రీస్తుకు లోబడి ఉన్నట్లు భావిస్తారు. కానీ క్రీస్తు ముందు మహిళలు, పురుషులన్న తేడా లేనప్పుడు, ఎందుకు వారిని ద్వితీయ, తృతీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారు?” అని ప్రశ్నించారు.
ఫెమినిస్టు వేదాంతి అయిన కోచురాణి అబ్రహాం బీబీసీతో, ”నిజానికి భారతదేశంలోను, ప్రపంచవ్యాప్తంగాను క్యాథలిక్ చర్చిలో మతాచార్యుల ఆధిపత్యం చాలా ఉంది. అదే ముఖ్యమైన సమస్య. నిజానికి ఒక సిస్టర్ ఎలా నడుచుకోవాలి, మతాధిపతి ఎలా నడుచుకోవాలన్న దానిపై స్పష్టమైన నియమాలున్నాయి. సమస్య ఎక్కడుందంటే పురుషులు ఆ అధికారక్రమంలో పైనుంటే సిస్టర్లు కింద ఉన్నారు” అని వివరించారు.
కొన్నేళ్ల క్రిందట సిస్టర్‌గా తప్పుకున్న కోచురాణి, భారతదేశంలో మహిళలు మత విధానాలను అనుసరించడం చాలా కష్టం అంటారు. చర్చిలలో చాలా పితృస్వామ్య భావాలు ఉన్నాయని ఆమె ఆరోపించారు.
ఇక్కడ గొర్రెల్లా అనుసరించాలంతే..
జనవరి 1న కేరళలో సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ఆధ్వర్యంలో మహిళలంతా కలిసి శబరిమలలోకి మహిళల ప్రవేశాన్ని అడ్డుకుంటున్న బీజేపీ, తదితర సంస్థలకు వ్యతిరేకంగా అతి పెద్ద మానవ హారంగా ఏర్పడ్డారు. సిస్టర్ లూసీకి యాదృచ్ఛికంగా అదే రోజు నోటీసులు జారీ అయ్యాయి.
”సుపీరియర్ జనరల్ మీరు ఈ పని చేయకూడదు అంటే చేయకూడదంతే. వాళ్లు చెప్పినదానిని గొర్రెల్లా అనుసరించాలి” అని కోచురాణి అన్నారు.
సిస్టర్ లూసీ, ఫాదర్ అగస్టీన్ల కారణంగా చర్చి ప్రతిష్ట మసకబారిందా?
దీనిపై సైరో-మలబార్ చర్చ్‌కు చెందిన ‘లైట్ ఆఫ్ ట్రూత్’ పత్రిక ఎడిటర్ ఫాదర్ పాల్ తెలక్కాట్, ”దీని వల్ల చర్చి ప్రతిష్ట దెబ్బ తిన్నది నిజమే అయినా, మనం వాస్తవాలను అంగీకరించాలి. న్యాయం కోసం పోరాడినప్పుడు ఇలాంటి ఒత్తిళ్లు తప్పవు. నిజానికి యేసు జీవించింది, మరణించింది దాని కోసమే” అన్నారు.