టెస్టులు తగ్గించి కేసులు తగ్గాయని ఎలా చెప్తారు: హైకోర్టు
రాష్ట్రంలో కరోనా టెస్టులు ఎందుకు పెంచడం లేదని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. కేవలం రాత్రి కర్ఫ్యూ పెట్టి చేతులు దులుపుకున్నారని మండిపడింది. రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ఈ విచారణకు తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి, పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో టెస్టులు తగ్గించి కేసులు తగ్గాయని ఎలా చెప్తారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.అయితే రాష్ట్రంలో టెస్టులు పెంచామని పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ కోర్టుకు తెలపగా.. దీనిపై స్పందించిన హైకోర్టు ఒక్క రోజు కూడా లక్ష టెస్టులు దాటలేదని విమర్శించింది. అసలు లాక్‌డౌన్ దిశగా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఫైర్ అయ్యింది. ప్రభుత్వాస్పత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్ డేటాను పూర్తి వివరాలతో సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.