ఇంటి నుంచి ఆస్పత్రికి వెళ్లేందుకు లక్షా 20 వేలు


మహమ్మారి కరోనా వైరస్‌ వ్యాప్తిని కొందరు క్యాష్‌ చేసుకోవాలని చూస్తున్నారు. కరోనాను ఆసరాగా చేసుకుని బాధితుల నుంచి భారీగా దండుకుంటున్నారు. మానవత్వం మరచి కాసులకు కక్కుర్తి పడుతున్నారు. కరోనా రోగిని తరలించేందుకు అంబులెన్స్‌ డ్రైవర్‌ భారీగా డబ్బులు డిమాండ్‌ చేశాడు. 350 కిలో మీటర్ల దూరానికి రూ.లక్షా 20 వేలు వసూల్‌ చేశాడు. దానికి సంబంధించిన బిల్లు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఎందుకు రా ఈ దోపిడీ..? మానవత్వం కొంచెమైనా ఉండాలని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హరియాణాలోని గురుగ్రామ్‌ నుంచి కరోనా బాధితుడిని ఎక్కించుకుని పంజాబ్‌లోని లూదియానా వరకు (350 కిలోమీటర్లు) వెళ్లాలి. అంబులెన్స్‌ను మాట్లాడగా డ్రైవర్‌ రూ.లక్షా 40 వేలు ఇవ్వమని కోరాడు. ఎంత బతిమిలాడిన తగ్గలేదు. చివరకు ఆక్సిజన్‌ మా వద్ద ఉంది.. అని చెప్పడంతో రూ.20 వేలు తగ్గించుకున్నాడు. గురుగ్రామ్‌ నుంచి లూదియానాకు సోమవారం కరోనా బాధితుడిని అంబులెన్స్‌ డ్రైవర్‌ చేర్చాడు. అందుకు ఆయన తీసుకున్న మొత్తం రూ.లక్ష 20 వేలు. దానికి సంబంధించిన బిల్లు కుటుంబసభ్యులకు ఇచ్చాడు.

ఐపీఎస్‌ అధికారి పంకజ్‌ నైన్‌ ఈ బిల్లును ట్వీట్‌ చేశారు. సిగ్గుండాలి అని పేర్కొఒంటూ ఆ బిల్లు ఫొటోను పంచుకున్నారు. ఈ బిల్లు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే అధిక మొత్తం ఛార్జీ చేసిన అంబులెన్స్‌ డ్రైవర్‌పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. ప్రభుత్వాలు అంబులెన్స్‌ సేవలకు కూడా నిర్ధిష్ట ధరలు ప్రకటించింది. కానీ అంతకుమించి వసూల్‌ చేస్తుండడంతో పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది.

About The Author