కొవిడ్‌కు డీఆర్‌డీఓ కొత్త మందు.. నీళ్లలో కలుపుకుని తాగేయడమే…
కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు, భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ, డీఆర్‌డీఓ కు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసన్ అండ్ అలయిడ్ సైన్సెస్, హైదరాబాద్‌లోని డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్‌తో కలసి అభివృద్ధి చేసిన కోవిడ్ మందు అత్యవసర వినియోగానికి భారత డ్రగ్ కంట్రోలర్ జనరల్, డీసీజీఐ ఆనుమతించింది.
కోవిడ్‌తో ఆస్పత్రిలో చేరిన వారు త్వరగా కోలుకునేందుకు ఈ మందు ఉపయోగపడుతోందని క్లినికల్ ట్రయల్స్‌లో తేలింది. కోవిడ్ పేషెంట్లకు ఆక్సిజన్ మీద ఆధారపడాల్సిన పరిస్థితిని కూడా ఈ ఔషధం తగ్గిస్తోందని ప్రయోగాలలో నిరూపితమైంది… 2-డియోక్సీ-డి-గ్లోకోజ్… 2-డీజీ గా వ్యవహరిస్తున్న ఈ యాంటీ-కోవిడ్-19 ఔషధాన్ని, కోవిడ్ బాధితుల మీద పరీక్షించినప్పుడు వారిలో అత్యధిక శాతం మందికి ఆర్‌టీ పీసీఆర్ పరీక్షల్లో నెగెటివ్ ఫలితాల వచ్చాయి. ఈ మందు కోవిడ్ రోగులకు అత్యంత మేలు చేస్తుందని రక్షణ శాఖ తమ ప్రకటనలో తెలిపింది. కోవిడ్ మహమ్మారిని సమర్ధవంతంగా ఎదుర్కోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు స్పందిస్తూ డీఆర్‌డీఓ కోవిడ్ చికిత్స కోసం 2-డీజీ ఔషధ ప్రాజెక్ట్ ను చేపట్టింది… కరోనా మొదటి వేవ్ విరుచుకుపడిన 2020 ఏప్రిల్ నెలలో డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలు హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, సీసీఎంబీ తో కలసి ఈ మందుపై ప్రయోగాలు చేశారు. ఇది సార్స్-కోవ్-2 వైరస్‌కు వ్యతిరేకంగా సమర్థంగా పని చేయడమే కాకుండా, వైరస్ పెరుగుదలను అడ్డుకుంటోందని ప్రయోగాల్లో వెల్లడైంది.ఈ ఫలితాల ఆధారంగా భారత డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఈ మందును కోవిడ్-19 రోగుల మీద రెండో దశ ప్రయోగాలు చేయడానికి 2020 మే నెలలో అనుమతించింది.