కరోనా నుంచి కోలుకున్నా.. కొత్త ముప్పు!


గోరుచుట్టుపై రోకటి పోటు అంటే ఇదేనేమో! ఒకవైపు రోజూ లక్షల మంది కోవిడ్‌ బారిన పడి అల్లాడుతుంటే.. మరోవైపు వైరస్‌ దాడి నుంచి ఎలాగో కోలుకున్న వారిలో కొందరు, ఓ కొత్త జబ్బుకు గురికావడం, మరణాలు సైతం సంభవిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. మ్యుకోర్‌మైకోసిస్‌ లేదా బ్లాక్‌ ఫంగస్‌ అనే ఈ వ్యాధి వైద్య నిపుణులను సైతం కలవరానికి గురి చేస్తోంది. ప్రస్తుతానికి ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లలో కోవిడ్‌ నుంచి బయటపడిన రోగులు కొందరిలో ఈ బ్లాక్‌ ఫంగస్‌ కనిపిస్తున్నట్లు సమాచారం. దీని లక్షణాలు కొంచెం భయం గొలిపేవిగానే ఉన్నప్పటికీ అతి తక్కువ మందిలోనే ఈ వ్యాధి కన్పించడం కాస్త ఊరటనిచ్చే అంశం. వీలైనంత త్వరగా గుర్తించడం ద్వారా మందులతోనే ఈ సమస్యను అధిగమించవచ్చని వైద్యులు చెబుతున్నారు.
గత ఏడాదే వెలుగులోకి..
వాతావరణంలోనూ ఉండే మ్యుకోర్‌మైకోసిస్‌ అనే శిలీంద్రానికి గాలిద్వారా వ్యాపించే కోవిడ్‌–19తో సంబంధం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. గత ఏడాది కోవిడ్‌–19 తొలి దశలోనే దీన్ని కొన్నిచోట్ల గుర్తించారు. గతంలో దీన్ని జైగోమైకోసిస్‌ అని పిలిచేవారు.

ఎవరికి సోకుతుంది?
కోవిడ్‌–19 నుంచి కోలుకున్న వారికి సోకే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మధుమేహం, మూత్రపిండాల సమస్యలు, కేన్సర్‌లతో కోవిడ్‌–19కి గురైతే సమస్య మరింత జటిలమవుతుంది. అవయవ మార్పిడి జరిగిన వారు, స్టెరాయిడ్లు వాడుతున్న వారికీ ఈ శిలీంద్రంతో ముప్పు ఉంటుంది. అమెరికాకు చెందిన సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ ప్రకారం ఇది మధుమేహుల్లో ఎక్కువ కనిపిస్తుంటుంది. కోవిడ్‌ కంటే ముందు ఈ ఫంగస్‌ చాలా అరుదుగా మాత్రమే కనిపించేది. అయితే కోవిడ్‌ కారక కరోనా.. రోగ నిరోధక వ్యవస్థను బలహీన పరుస్తున్న విషయం తెలిసిందే. అలాగే మధుమేహులకు వైరస్‌ సోకే అవకాశం ఉండటం.. వారికి స్టెరాయిడ్లతో చికిత్స కల్పిస్తుండటం బ్లాక్‌ ఫంగస్‌ వ్యాప్తికి కారణమవుతోందని అంచనా. ఫంగస్‌ వల్ల జరిగిన జరుగుతున్న నష్టం తెలుసుకునేందుకు ఎమ్మారై స్కాన్‌ చేయాల్సి ఉంటుంది.

ప్రాణాంతకమూ కావచ్చు: మ్యుకోర్‌మైకోసిస్‌ను సకాలంలో గుర్తించకపోయినా, చికిత్స చేయకపో యినా..అంధత్వం సంభవించవచ్చు లేదా ముక్కు, దవడ ఎముకలను తొలగించాల్సి రావచ్చు. కొన్ని సందర్భాల్లో మరణం సంభవించే అవకాశమూ ఉంటుంది. సకాలంలో గుర్తించకపోతే ఫంగస్‌ సోకిన వారిలో సగం మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. గుజరాత్‌లోని సూరత్‌ నగరంలో బ్లాక్‌ఫంగస్‌ బారిన పడ్డ సుమారు యాభై మందికి చికిత్స చేస్తుండగా.. ఇంకో అరవై మంది చికిత్స కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. వ్యాధి బారిన పడ్డ వారిలో ఏడుగురు చూపు కోల్పోయినట్లు తెలుస్తోంది.

కోవిడ్‌ చికిత్సలో జాగ్రత్త వహించాలి
కోవిడ్‌ రోగులకు ఆక్సిజన్‌తో చికిత్స కల్పిస్తున్న సందర్భంలో హ్యుమిడిఫయర్‌ నుంచి నీరు లీక్‌ కాకుండా జాగ్రత్త పడాలని, అలాగే టోసిలిజుమాబ్‌ వంటి స్టెరాయిడ్లను చాలా విచక్షణతో మాత్రమే ఉపయోగించాలని, తద్వారా బ్లాక్‌ ఫంగస్‌ వ్యాప్తిని కొంతవరకైనా అడ్డుకునే వీలేర్పడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

బ్లాక్‌ ఫంగస్‌ అంటే..
మ్యుకోర్‌మైకోసిస్‌ అనేది ఓ అరుదైన శిలీంద్రం. తేమతో కూడిన ఉపరితలాలపై ఎక్కువగా కనిపిస్తుంటుంది. నల్లగా బూజు పట్టినట్లు ఉండటం వల్ల దీన్ని బ్లాక్‌ ఫంగస్‌గా వ్యవహరిస్తున్నారు.

ఇవీ లక్షణాలు: దీని బారిన పడిన వారిలో కనిపించే సాధారణ లక్షణాల్లో ముఖం ఒకవైపు వాపు ఉండటం ఒకటి. తలనొప్పి, ముక్కుదిబ్బడ, ముక్కు పైభాగంలో, లేదా నోటి లోపలి భాగంలో నల్లటి కురుపులు, జ్వరం, పాక్షిక దృష్టి లోపం, కళ్ల కింద నొప్పి వంటివి కొన్ని ఇతర లక్షణాలు.

About The Author