ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మెరుగ్గానే ఉన్నాం: మంత్రి కేటీఆర్
ప్రజల ప్రాణాలు కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు చెప్పారు. కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలిస్తున్నాయని తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో పరిస్థితి మెరుగ్గా ఉందన్నారు. ప్రభుత్వ చర్యలను కేంద్రం కూడా గుర్తించిందని, కేంద్ర ఆరోగ్య మంత్రి కూడా అభినందించారని వివరించారు. ఎప్పటికప్పుడు కరోనా కట్టడి చర్యలను ముమ్మరం చేస్తున్నామని, మరింత సమగ్ర కార్యాచరణతో ముందుకువెళతామని తెలిపారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి కేటీఆర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్.. బుధవారం బీఆర్కేఆర్ భవన్లో సమావేశమై చర్చించింది. తర్వాత కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
కొద్దిరోజుల్లోనే ఫలితాలు
రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, అంగన్వాడీలు, పంచాయతీ/మున్సిపల్ సిబ్బందితో ఏర్పాటు చేసిన బృందాలతో సర్వే చేపట్టామని.. ఇప్పటివరకు 60 లక్షల ఇళ్లలో సర్వే పూర్తయిందని కేటీఆర్ తెలిపారు. 2.1 లక్షల మందుల కిట్లను పంపిణీ చేశామని వెల్లడించారు. ప్రభుత్వ ఆస్పత్రుల ఓపీలలో అనుమానిత రోగులకు ఇచ్చిన కిట్లు వీటికి అదనమని చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నంతో వేల మందిని కాపాడుకోగలమన్నారు. కిట్‌లో ఇచ్చిన మందులను కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే వాడితే ఆరోగ్యం విషమించదని, ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం చాలా వరకు తగ్గుతుందని చెప్పారు. తాము చేపట్టిన ఆపరేషన్ ఫలితాలు ఒకట్రెండు రోజుల్లోనే కనిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
బ్లాక్ ఫంగస్‌పై అప్రమత్తం
కరోనా రోగుల్లో బయటపడుతున్న ప్రమాదకర బ్లాక్ ఫంగస్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, దాని చికిత్సకు అవసరమైన మందులను సమీకరించనుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో 1.5 లక్షల రెమిడెసివిర్ ఇంజెక్షన్లు నిల్వ ఉన్నాయని.. రాష్ట్రానికి అధిక సరఫరా కోసం వీటిని ఉత్పత్తి చేసే కంపెనీలతో సమన్వయం చేసుకుంటున్నామని వివరించారు. ఆస్పత్రుల్లో ఈ ఇంజెక్షన్ల వినియోగంపై ప్రభుత్వ పర్యవేక్షణ ఉందన్నారు.
అత్యవసర పరిస్థితుల్లో అరుదుగా వినియోగిస్తున్న టోసిలిజుమాబ్ ఇంజెక్షన్లను సరిపడే సంఖ్యలో సమీకరించాలని ప్రభుత్వానికి సూచించామన్నారు. రాష్ట్రంలో ఆక్సిజన్ డిమాండ్–సప్లై వివరాలను ఈ సమావేశంలో తీసుకున్నామని కేటీఆర్ తెలిపారు. ఆక్సిజన్ వినియోగంపై ప్రభుత్వం ఆడిట్ నిర్వహిస్తోందని, అవసరమైన మేరకే ఆక్సిజన్ వినియోగించేలా అన్ని ప్రైవేటు ఆస్పత్రులకు సూచించామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకే కోవిడ్ హెల్ప్‌లైన్ నంబర్ ఉండాలని ప్రభుత్వానికి సూచిస్తామన్నారు. జిల్లాల్లో కోవిడ్ నియంత్రణ చర్యలను స్థానిక మంత్రులు పర్యవేక్షిస్తున్నారని, వారితో సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించామని తెలిపారు.
వాక్సిన్ల ఉత్పత్తిదారులతో సమావేశాలు
కరోనా వ్యాక్సిన్‌ను ప్రజలందరికీ అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిందని, కరోనా చికిత్సకు అవసరమైన మందులతోపాటు వాక్సిన్ ఉత్పత్తిదారులతో త్వరలో సమావేశం కానున్నామని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో 45 ఏళ్లకు పైబడి జనాభా 92 లక్షలు ఉండగా.. ఇప్పటికే 38 లక్షల మంది వాక్సిన్ తొలి డోసు తీసుకున్నారని చెప్పారు. వీరిలో 3 లక్షల మంది ఫ్రంట్ లైన్ వారియర్స్‌తోపాటు 7.15 లక్షల మంది రెండు డోసులు తీసుకున్నారని పేర్కొన్నారు. 10 లక్షలకుపైగా జనాభాకు వాక్సినేషన్ పూర్తయిందని తెలిపారు.