65 లక్షలతో గ్రామాలకు తాగునీరు-టీజీ వెంకటేశ్
కర్నూలు: పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. ఓ వైపు కరోనా, మరోవైపు నీటి ఎద్దడితో అల్లాడి పోతున్న ప్రజల దాహార్తి తీర్చేందుకు నడుం కట్టారు. కర్నూలు జిల్లాలోని ఐదు గ్రామాల ప్రజలకు తాగునీటిని అందించనున్నారు. పైపులైన్లు, బావుల ద్వారా తాగు నీటిని అందించేందుకు 65 లక్షల రూపాయలు ఖర్చు చేయనున్నారు. మే 16న తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన ఈ ప్రకటన చేశారు. జిల్లాల్లో పలు గ్రామాల్లో తాగు నీరు అందక అష్టకష్టాలు పడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీజీ వెంకటేశ్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తీవ్రంగా ఉండటంతో ఇప్పటికే టీజీ వెంకటేశ్ ఆక్సిజన్ ప్లాంట్, వెంటిలేటర్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, ఇతర వైద్య పరికరాల కోసం ఇప్పటికే 60 లక్షల రూపాయలను తన సాయంగా ప్రకటించారు. ఇక వైద్యం కోసం ఆసుపత్రులకు వస్తున్న కరోనా రోగులకు ముందుండి సేవలు చేయాలని డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని ఆయన కోరారు.