ప్రపంచంలోనే ఎత్తయిన శివలింగం ఇదే…

ప్రపంచంలోనే ఎత్తయిన శివలింగం ఇదే..

ప్రపంచంలోనే ఎత్తైన శివలింగం నిర్మాణం తుది దశకు చేరకుంది. కేరళలో రూ.10కోట్ల వ్యయంతో 111.2 అడుగుల ఎత్తుతో 8 అంతస్తులుగా ఈ శివలింగాన్ని నిర్మిస్తున్నారు. తమిళనాడు-కేరళ సరిహద్దుల్లోని చెంగల్‌ మహేశ్వర శివపార్వతి ఆలయ ప్రాంగణంలో 2012లో ఈ శివలింగం నిర్మాణాన్ని ప్రారంభించారు. నిర్మాణం దాదాపు 80 శాతం పూర్తవడంతో జనవరి 10న లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు ఆలయాన్ని సందర్శించి శివలింగం ఎత్తునుకొలిచారు. సంబంధిత పత్రాలను పరిశీలించి ఎత్తయిన శివలింగంగా రికార్డ్ క్రియేట్ చేసినట్లు అధికారికంగా ప్రకటించారు.
వారణాసి, బద్రినాథ్, గంగోత్రి, గోముఖ్, రామేశ్వరం, ధనుష్‌కోటి సహా పలు హిందూ పుణ్యక్షేత్రాల నుంచి తీసుకొచ్చిన మట్టి, జలాన్ని శివలింగ నిర్మాణంలో వినియోగించారు. దేశంలోని ప్రఖ్యాత శివాలయాలను సందర్శించిన అనంతరం శ్రీ మహేశ్వరానంద సరస్వతి ఈ శివలింగాన్ని డిజైన్ చేశారు. దేశంతో అత్యంత ఎత్తైన శివలింగం రికార్డు ఇంతకుముందు కర్నాటకలోని కోలార్ జిల్లా కోటిలింగా దేవాలయం పేరిట ఉంది. అక్కడ 108 అడుగుల శివలింగం కొలువై ఉంది. ఆ రికార్డును ఈ మహాశివలింగం అధిగమించింది.

ఈ శివలింగం ప్రత్యేకతలు..

ఎనిమిదో అంతస్తులో కైలాసగిరిలో శివపార్వతులు ఉన్నట్లు ప్రతిమలు కొలువుదీర్చారు.
ఆరు అంతస్తులు మానవదేహంలోని ఆరు శక్తి కేంద్రాలను సూచిస్తాయి.
కింది అంతస్తులో 108 శివలింగాలను ఏర్పాటు చేశారు. వీటికి భక్తులు అభిషేకాలు చేయవచ్చు.
ప్రతి అంతస్తులోనూ ధ్యానమండపాలు కలిగిన ఈ శివలింగం లోపలి భాగాలుంటాయి. అందులో పరశురాముడు, అగస్త్యుడు తదితరులు తపస్సు చేస్తున్నట్లు కొన్ని ప్రతిమలు ఏర్పాటు చేశారు.

About The Author