కరోనాకు ఆనందయ్య మందు!


ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారి నియంత్రణకు ఆయుర్వేద ఔషధం దివ్యంగా పనిచేస్తోందన్న ప్రచారంతో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామం పేరు జాతీయ స్థాయిలో మార్మోగుతోంది. వ్యాక్సిన్లు, మందులు, ఆక్సిజన్, చికిత్స కోసం డబ్బులు మంచినీళ్లలా ఖర్చు చేస్తున్నా కట్టడి కాని వైరస్‌ను కేవలం ఆకులు, వివిధ రకాల వంటింటి దినుసులతో రూపొందించిన ఆయుర్వేద మందులతో నియంత్రిస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. ఆయుర్వేద ఔషధం కావడం, సైడ్‌ ఎఫెక్ట్‌లు లేకపోవడం, ఉచితంగా ఇస్తుండటంతో శాస్త్రీయంగా నిర్దారణ కాకున్నా కృష్ణపట్నానికి క్యూలు కడుతున్నారు. ఆనందయ్య కరోనా మందుగా దీన్ని వ్యవహరిస్తున్నారు.
తెల్లవారుజాము నుంచే…
మూడు రోజుల విరామం తర్వాత శుక్రవారం ఉదయం కృష్ణపట్నంలో ఆనందయ్య మందు పంపిణీ కార్యక్రమం ప్రారంభం కావడంతో తెల్లవారు జాము నుంచే పెద్ద ఎత్తున తరలి వచ్చిన వారితో ఆ ప్రాంతం జనసంద్రంగా మారింది. ఆస్పత్రుల నుంచి సైతం ఆక్సిజన్‌ సిలిండర్లతో వచ్చిన వారున్నారు. దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర వాహనాల రద్దీతో ట్రాఫిక్‌ స్తంభించింది. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి మందు పంపిణీని ప్రారంభించారు. మొదలు పెట్టిన రెండున్నర గంటల వ్యవధిలోనే మందు అయిపోవడంతో చాలామంది నిరాశగా వెనుదిరిగారు. మరోవైపు వాహనాలు వస్తూనే ఉన్నాయి. రద్దీని ఒక దశలో పోలీసులు కూడా నియంత్రించలేని పరిస్థితి ఎదురైంది.
రాష్ట్రం నుంచే కాకుండా తెలంగాణ, తమిళనాడు నుంచి కూడా పెద్ద సంఖ్యలో వాహనాలు, అంబులెన్స్‌లు బారులు తీరాయి. మందు తయారీలో కీలకమైన ఆకులు, దినుసులు తగిన మేరకు లేకపోవడంతో కేవలం కరోనా వైరస్‌ సోకిన కొందరికి మాత్రమే మందు పంపిణీ చేశారు. క్యూలో కరోనా బారిన పడిన వారు ఉండడంతో మందు కోసం వచ్చిన ఇతరుల్లో ఆందోళన నెలకొంది. శనివారం మందు పంపిణీ నిలిపి వేస్తున్నట్లు ఆనందయ్య ప్రకటించారు. కరోనా బాధితులు పెద్ద ఎత్తున తరలిస్తుండటంతో గ్రామస్తులు వాహనాలను నిలిపివేశారు. మందు పంపిణీ సమాచారంతో జాతీయ మీడియా చానళ్లు ఉదయం నుంచే ప్రత్యక్ష ప్రసారాలు చేశాయి. కాగా ఆనందయ్యను పోలీసులు అరెస్ట్‌ చేశారంటూ శుక్రవారం సాయంత్రం కొన్ని చానళ్లు, సోషల్‌ మీడియా పుకార్లు సృష్టించడంతో ఆయనకు భద్రత కల్పిస్తున్నారు.

సీఎం ఆదేశాలతో రంగంలోకి ఆయుష్‌ బృందం
ఆనందయ్య ఆయుర్వేద ఔషధంలో శాస్త్రీయతను నిర్దారించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆయుష్‌ కమిషనర్‌ రాములు శుక్రవారం సాయంత్రం కృష్ణపట్నంలో పర్యటించారు. మందు తయారీలో వినియోగిస్తున్న ఆకులు, వివిధ దినుసులను పరిశీలించి ఆనందయ్య బృందంతో మాట్లాడారు. ఆయన వెంట లైసెన్సింగ్‌ అథార్టీ అధికారి పీవీఎన్‌ ప్రసాద్, విజయవాడ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్‌ సాయి సుధాకర్, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఆయుర్వేదం) డాక్టర్‌ సాయికుమార్, డీపీఓ ధనలక్ష్మి, జేసీ హరేందిర ప్రసాద్, ఇన్‌చార్జి ఆర్డీఓ సువర్ణమ్మ తదితరులున్నారు. ప్రాథమికంగా బాగానే పని చేస్తున్నట్లు వెల్లడైందని, వారం రోజుల్లో సమగ్ర నివేదిక ఇస్తామని, అప్పటిదాకా పంపిణీ వద్దని ఆయుష్‌ డైరెక్టర్‌ సూచించారు.

నివేదిక కోరిన ఉప రాష్ట్రపతి
ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు కేంద్ర ఆయుష్‌ ఇన్‌చార్జి మంత్రి కిరణ్‌ రిజ్జూ, ఐసీఎమ్మార్‌ డైరెక్టర్‌ జనరల్‌ ప్రొఫెసర్‌ బలరామ్‌ భార్గవతో ఫోన్లో మాట్లాడారు. ఆయుర్వేద మందుపై అధ్యయనం జరిపి వీలైనంత త్వరగా నివేదిక వచ్చేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

వంటింటి మందులే…
–బొనిగే ఆనందయ్య, ఆయుర్వేద వైద్య నిపుణుడు
ఆయుర్వేద వైద్యాన్ని భగవాన్‌ వెంకయ్యస్వామి శిష్యుడు గురవయ్య వద్ద నేర్చుకున్నా. తమిళనాడు రెడ్‌ హిల్స్‌ ప్రాంతానికి చెందిన వివేకానంద వద్ద మరికొంత నేర్చుకున్నా. మా అమ్మకు ఆయుర్వేదంలో కొంత ప్రవేశం ఉంది. కరోనా మందును గ్రామంలో అనేక మందికి ఇచ్చా. మంచి ఫలితాలు వస్తున్నాయి. ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. నేను వాడే వస్తువులు అన్ని వంటింట్లోనే ఉంటాయి. మందు వాడిన తర్వాత 48 గంటల్లో నెగెటివ్‌ వస్తుంది. మా అన్నకు కరోనా పాజిటివ్‌ రావడంతో దినుసులతో మందు ఇవ్వడంతో వెంటనే తగ్గింది.

అనుమతులు రాగానే పునఃప్రారంభం: ఎమ్మెల్యే కాకాణి
ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు వచ్చాక మందు పంపిణీ పునఃప్రారంభమవుతుందని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి చెప్పారు. ఇతర రాష్ట్రాల వాసులు వ్యయ ప్రయాసలకు ఓర్చి రావద్దని విజ్ఞప్తి చేశారు. ఆన్‌లైన్‌ ద్వారా బుక్‌ చేసుకున్న వారికి కొరియర్‌ ద్వారా పంపిణీ చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలిపారు. కొన్నేళ్లుగా పలు వ్యాధులకు ఆయర్వేద మందులను ఆనందయ్య కుటుంబం ఉచితంగా పంపిణీ చేస్తోందన్నారు.

ఎలాంటి ఇబ్బంది కలగలేదు..
– ఉడతా మురళీకృష్ణ, ఈపూరు
ప్రజల్లోకి ఈ మందు అనూహ్యంగా చొచ్చుకుపోయింది. ముందు జాగ్రత్తగా మందు తీసుకున్నా. ఎలాంటి ఇబ్బందులు కలగలేదు.

చాలా బాగా పనిచేసింది…
– వెంపులూరు శ్రీనివాసులు, కృష్ణపట్నం
బొణిగి ఆనందయ్య ఆయుర్వేద మందు చాలా బాగా పని చేసింది. ఇటీవల నాకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈ మందును మూడు పూటలా మూడు రోజులు వాడా. త్వరగా తగ్గిపోయింది. సైడ్‌ ఎఫెక్ట్‌ లేవు. ఆకలి బాగా వేస్తోంది.

కరోనా తగ్గించే శక్తి ఉంది
– డాక్టర్‌ చక్రధర్‌రావు రాష్ట్రీయ, ఆయుష్‌ మెడికల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కోశాధికారి, నరుకూరు
ఆనందయ్య మందులో కరోనా వ్యాధిని తగ్గించే శక్తి ఉంది. ఐసీఎంఆర్, అల్లోపతి వైద్యులు కాకుండా ఆయుర్వేద రీసెర్చ్‌ సెంటర్‌ ద్వారా పరీక్షలు నిర్వహించాలి. పలు రాష్ట్రాల్లో ఆయుష్‌ మందుల ద్వారా కరోనా కట్టడికి స్పెషల్‌ డ్రైవ్‌ ప్రారంభించారు.

వైరస్‌ సోకిన వారికే ఇవ్వాలి..
– డాక్టర్‌ టీపీ నాయుడు, శ్రీకృష్ణ ఆయుర్వేద స్పెషాలిటీ ఆస్పత్రి, పొగతోట నెల్లూరు
కృష్ణపట్నంలో ఇస్తున్న ఆయుర్వేద మందుల్లో 16 సహజ వనమూలికలు వాడుతున్నారు. మేం కూడా తొలిదశ కరోనా వచ్చినప్పుడు వీటితో తయారు చేసిన కషాయాన్ని తాగమని చెప్పాం. గుంపులుగా ఉండడం వల్ల కరోనా పెరిగే అవకాశం ఉంది. వైరస్‌ సోకని వారికి మందు అవసరం లేదు. వచ్చిన వారికి మాత్రమే ఇవ్వాలి.

జిల్లేడుతో జాగ్రత్త..
– ఎస్వీ వెటర్నరీ వర్సిటీ ఫార్మకాలజీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ జీ.శ్రీనివాసరావు
ఆనందయ్య ఉపయోగించే పదార్థాల్లో ఔషధ గుణం కలిగిన ‘పర్సిటిన్‌’ ఉల్లిపాయలు, జామకాయలు, ద్రాక్ష విత్తనాల్లో కూడా ఉంటుంది. తెల్లజిల్లేడుతో తయారు చేసిన మందును కంటిలో పోయడం మాత్రం దుష్ఫరిణామాలకు తీసే ప్రమాదం ఉంది.

ఆనందయ్య మందు ఐదు రకాలు
కరోనాకు ఆనందయ్య మొత్తం ఐదు రకాల మందులను పంపిణీ చేస్తున్నారు. కరోనా రాకుండా రోగనిరోధక శక్తి పెంచడానికి ఒక మందు, పాజిటివ్‌ వచ్చిన వారికి నాలుగు రకాల మందులను ఇస్తున్నారు. కరోనా రాకుండా ‘పీ’ రకం మందును, కోవిడ్‌ వచ్చిన వారికి పీ, ఎఫ్, ఎల్, కే రకాలను ఇస్తున్నారు. ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోయిన వారికి నాలుగు రకాలతో పాటు పసరు డ్రాప్స్‌ ఇస్తున్నారు.

1. పీ:
ఇది ఊపిరితిత్తులను శుభ్రం చేస్తుంది. పాజిటివ్‌ వచ్చిన వారు రోజుకు రెండు సార్లు చొప్పున మూడు రోజులు, పాజిటివ్‌ లేని వారు రోగనిరోధక శక్తి పెంచుకోవడం కోసం ఒక్క రోజు రెండు సార్లు వినియోగించాలి.
ఇందులో తెల్ల జిల్లేడు, మారేడు ఇగురు, నేరేడు ఇగురు, వేప ఇగురు, దేవర్‌ దంగిలే ఐదు బకెట్లు, నల్ల జీలకర్ర, పట్టా, పసుపు, తోక మిరియాలు, పచ్చ కర్పూరం, ఫిరంగి చెక్క పొడి అన్ని కలిపి ఒక బకెట్‌లో సిద్ధం చేసి మిక్సీ వేసిన తర్వాత అవసరమైనంత తేనె కలిపి నాలుగు గంటల పాటు ఉడికించి మిశ్రమంగా తయారు చేసి ఇస్తున్నారు.

2. ఎఫ్‌:
పాజిటివ్‌ ఉన్న వారికి ఇస్తున్నారు. ఇందులో పుప్పింటి ఆకు ఒక బకెట్, మిరియాలు, నల్ల జీలకర్ర, పట్టా, పసుపు, పిప్పళ్లు, జాజికాయ, తేనెలను రెండు నుంచి మూడు కేజీల వరకు సిద్ధం చేసి ఆన్నింటిని కలిపి మిక్సీ వేసి చూర్ణంగా ఇస్తున్నారు. ఇది రోజు భోజనం తర్వాత రెండు సార్లు చొప్పున మూడు రోజులు తీసుకోవాలి.

3. ఎల్‌:
ఇది కూడా పాజిటివ్‌ ఉన్న వారికే. ఇందులో నేల ఉసిరి, గుంట గలగర ఆకులు ఒక బకెట్, మిరియాలు, నల్లజీలకర్ర, పట్టా, పసుపు, పిప్పళ్ల చెక్క, జాజికాయ, తేనె రెండు మూడు కేజీలు తీసుకొని సిద్ధం చేస్తున్నారు. దీనిని ఫీ,ఎఫ్‌ రకాల మందుతో పాటు రోజుకు ఒక్కసారి చొప్పున రెండు రోజులు తీసుకోవాలి.

4. కే:
ఇది కూడా పాజిటివ్‌ ఉన్న వారికే. ఇందులో పెద్ద పల్లేరు కాయలు ఒక బకెట్, మిరియాలు, నల్ల జీలకర్ర, పట్టా, పసుపు, పిప్పళ్ల చెక్క, జాజికాయ, తేనెలను రెండు నుంచి మూడు కేజీల తీసుకుని కలిపి దీన్ని సిద్ధం చేస్తున్నారు. ఇది పాజిటివ్‌ రోగులకు రోజుకు ఒక్క సారి చొప్పున రెండు రోజులు తీసుకోవాలి.

5. ఐ:
ఆక్సిజన్‌ తగ్గిన వారికి కంటి డ్రాప్స్‌. తేనె, ముళ్ల వంకాయ గుజ్జు, తోక మిరియాలను వినియోగిస్తారు. ఇందులో కిలో తేనె, వంద గ్రాముల తోక మిరియాలు, కొద్దిగా వంకాయ గుజ్జుతో సిద్ధం చేసి పల్స్‌ తీవ్రను బట్టి ఒక్కొక్క కంటిలో ఒక్కొక్క డ్రాప్‌ వేయాలి.

About The Author