అన్నదమ్ముల ఘర్షణలో గర్భిణి మృతి


అన్నదమ్ముల ఘర్షణలో ఓ గర్భిణి మృతి చెందింది. ఈ విషాద సంఘటన రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మోకిల గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిజాంపేట్‌ పెంటయ్య, భిక్షపతి అన్నదమ్ములు. వీరికి ఇంటి స్థలం విషయంలో తరచూ గొడవలు జరుగుతున్నాయి. గ్రామ పెద్దలు, పంచాయతీ పాలకవర్గం సభ్యులు వీరి ఇద్దరి మధ్య ఇటీవల రాజీ కుదిర్చారు. బుధవారం సాయంత్రం భిక్షపతి నిర్మిస్తున్న ఇంటిపై ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ ఇటుక బయటకు విసిరారు. ఆ ఇటుక.. ఇంటి పక్కన కూర్చున్న పెంటయ్యపై పడింది. దీంతో తనను చంపడానికే భిక్షపతి ఇటుక వేశాడంటూ అతడు నానా గొడవ చేశాడు. విషయం తెలుసుకున్న పెంటయ్య కుమారులు శ్రీనివాస్, శ్రీకాంత్, పద్మారావు భిక్షపతిపై దాడికి దిగారు.దీంతో భిక్షపతి భార్య పద్మతో పాటు ఐదు నెలల గర్భిణి అయిన ఆమె మనుమరాలు లావణ్య(22)లు వచ్చి గొడవ ఆపేందుకు ప్రయత్నించారు. ఆ ఘర్షణలో లావణ్య కడుపుపై శ్రీనివాస్‌ తన్నడంతో ఆమె స్పహ తప్పి పడిపోగా శంకర్‌పల్లిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారని పోలీసులు తెలిపారు. చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందినట్టు పేర్కొన్నారు. లావణ్య స్వగ్రామం శంకర్‌పల్లి మండలం కొండకల్‌ గ్రామం కాగా.. పటాన్‌చెరువు మండలం పెద్దకంజర్ల గ్రామానికి చెందిన సత్యంతో ఆమెకు వివాహమైంది. లావణ్య రెండు రోజుల కిందట అమ్మమ్మ ఇంటికి చుట్టపుచూపుగా వచ్చింది. బంధువుగా వచ్చిన ఆమె ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది. కాగా, ఈ ఘటనలో పెంటయ్య, శ్రీనివాస్, శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకున్నామని, పద్మారావు పరారీలో ఉన్నాడని సీఐ గోపీనాథ్‌ తెలిపారు. ఇరువర్గాల వారు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు.

భారీగా పోలీసుల మోహరింపు
మృతురాలు లావణ్య స్వగ్రామం కొండకల్‌ నుంచి, అత్తవారు గ్రామం పెద్దకంజర్ల నుంచి గ్రామస్తులు, బంధువులు గురువారం మోకిలకు చేరుకోవడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.

About The Author