భార్యతో సఖ్యతగా మెలుగుతున్నాడనే…
మండల పరిధిలోని నారమ్మగూడెం శివారులో గత ఏప్రిల్ 22న చోటు చేసుకున్న హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. తన భార్యతో సఖ్యతగా మెలుగుతున్నాడనే అనుమానంతో సమీప బంధువే మరికొందరితో కలిసి ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. హత్య కేసులో సూత్రధారితో పాటు మరో నలుగురిని సోమవారం అరెస్ట్ చేసినట్లు ఎస్‌ఐ కొండల్‌రెడ్డి తెలిపారు. కేసు వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. పెద్దవూర మండలం తుంగతుర్తికి చెందిన వంగూరి మహేందర్, నిడమనూరు మండలం నారమ్మగూడేనికి చెందిన మచ్చ శ్రీకాంత్ వరుసకు సోదరులు.కాగా, మహేందర్ తన భార్యతో కలిసి నల్లగొండలో ఉంటూ హాస్టళ్లకు సరుకులు సరఫరా చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రెండేళ్ల క్రితం శ్రీకాంత్ నల్లగొండలో డిగ్రీ చదువుతూ సోదరుడు మహేందర్‌తో కలిసి ఉండేవాడు. ఆ క్రమంలో మహేందర్ ఇంట్లో లేని సమయంలో అతడి భార్యతో శ్రీకాంత్ సఖ్యతగా మెలుగుతున్నాడని అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో కుటుంబంలో గొడవలు జరగడంతో మహేందర్‌ను వదిలి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది.
గొడవలకు సోదరుడే కారణమని..
తన కుటుంబంలో గొడవలకు సోదరుడు శ్రీకాంత్ కారణమని మహేందర్ కక్ష పెంచుకున్నాడు. అతడిని ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. అందుకు తన సమీప బంధువులు, స్నేహితులైన రావులపాటి దేవేందర్, రావుల పాటి మురళి, పంగ కిరణ్, భూతం హరి ప్రసాద్‌ను సంప్రదించాడు. అప్పటినుంచి అదును కోసం వేచిచూస్తున్నాడు.
స్కార్పియోతో ఢీకొట్టి.. కంట్లో కారం చల్లి..
మహేందర్ కుటుంబంలో గొడవలు జరిగినప్పటి నుంచి శ్రీకాంత్ స్వగ్రామానికి వెళ్లిపోయాడు. అయితే, అప్పటినుంచి కక్ష పెంచుకున్న మహేందర్ సోదరుడు శ్రీకాంత్‌ను అంతమొందించేందుకు అదునుకోసం చూస్తున్నాడు. గత ఏప్రిల్ 22న రేగులగడ్డలోని సమీప బంధువు దశదినకర్మలో శ్రీకాంత్ పాల్గొన్నాడు. ఆ కార్యానికి మహేందర్ కూడా హాజరయ్యాడు. అయితే, శ్రీకాంత్ బైక్‌పై వెళ్లే క్రమంలో హత్య చేయాలని నిర్ణయించుకుని నారమ్మగూడెం శివారులో తన బంధువులు, స్నేహితులతో మాటేశాడు. కార్యం ముగిసిన అనంతరం శ్రీకాంత్ మరో ఇద్దరు బంధువులను బైక్‌పై ఎక్కించుకుని స్వగ్రామానికి బయలుదేరాడు. మార్గమధ్యలో నారమ్మగూడెం వద్ద అతడి బైక్‌ను మహేందర్ స్కార్పియో వాహనంతో ఢీకొట్టాడు. కిందపడగానే కంట్లో కారం చల్లి తమ వెంట తెచ్చుకున్న కత్తులతో పొడిచి, గొడ్డళ్ల నరికి అంతమొందించారు. అనంతరం అదే వాహనం పరారయ్యారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో..
శ్రీకాంత్‌ను సమీప బంధువు మహేందర్ మరికొందరితో కలిసి హత్య చేశాడని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు హత్య కేసులో సూత్రధారి మహేందర్‌తో పాటు పాత్రధారులు రావులపాటి దేవేందర్, రావుల పాటి మురళి, పంగ కిరణ్, భూతం హరి ప్రసాద్ నల్లగొండలో ఉన్నట్లు గుర్తించి అరెస్ట్ చేసినట్లు ఎస్‌ఐ వివరించారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి 14రోజుల రిమాండ్ విధించినట్లు తెలిపారు.