మాజీ మంత్రికి జై కొడుతున్న గ్రామాలు


ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఈటల రాజేందర్‌ను సీఎం కేసిఆర్‌ మంత్రి వర్గం నుంచి బర్తరఫ్‌ చేయడం సరికాదని, నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు ఈటల వెంటే ఉన్నారని, తాము కూడా ఈటల రాజేందర్‌ వెంటనే ఉంటామని హనుమాన్‌ దేవస్థాన కమిటీ చైర్మన్‌ ఆకుల సదానందం, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు రమేష్‌గౌడ్, ఎంపటి సుధీర్‌ అన్నారు. మంగళవారం సాయిరూప కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హుజూరాబాద్‌ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ది చేసిన ఘనత ఈటలకే దక్కుతుందన్నారు. సమావేశంలో టీఆర్‌ఎస్‌ నాయకులు పోతుల సంజీవ్, రాపర్తి శివ, బీఆర్‌గౌడ్, గోసు్కల చందు, కొలుగూరి దేవయ్య, గూడూరి మహేందర్‌రెడ్డి, మురాద్‌హుస్సేన్, రాజ్‌కుమార్, సందీప్‌ పాల్గొన్నారు.
ఈటల వర్గీయుల సంబరాలు
వీణవంక: మండలంలోని ఎల్భాకలో ఈటల రాజేందర్‌ వర్గీయులు సోమవారం రాత్రి టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. సర్పంచ్‌ కొత్తిరెడ్డి కాంతారెడ్డి, జెడ్పీటీసీ మాడ వనమాల మంత్రి గంగుల కమలాకర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించడంపై మండిపడ్డారు. నిన్నటి వరకు ఈటలకు మద్దతు పలికి తెల్లవారేసరికి టీఆర్‌ఎస్‌కు జై కొట్టారని పేర్కొన్నారు. గ్రామస్తులంతా ఈటలకే మద్దతు తెలుపుతున్నారని, ఇక గ్రామానికి పట్టిన పీడ పోయిందని టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఈటల వర్గీయులు రాజారాం, మాడ గౌతమ్‌రెడ్డి, రాజ్‌కుమార్‌ యాదవ్, రాజు, పొన్నాల అనిల్, సంపత్‌ తదితరులు పాల్గొన్నారు.

About The Author