ఒక బ్యాంక్ ఉద్యోగిఅనుభవం!
ఒక బ్యాంక్ ఉద్యోగిఅనుభవం!
….
సార్ ! మాకెందుకండీ మోడీ గారి బీమా ,ఆయనకు మేము ఓటువెయ్యలేదండి అని ఒక స్త్రీమూర్తి నాతో అంటూ ససేమిరా బీమా చేయటానికి ఒప్పుకోలేదు !
ఆ పాలసీ అప్పుడే అమలులోకి వచ్చిన కొత్తల్లో జరిగిన సంఘటన ఇది!
ఆవిడ మా బ్యాంకులో ఒక డ్వాక్రా గ్రూపు మెంబరు !!
ఏదోవిధంగా నచ్చచెప్పి ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమాయోజన క్రింద వాళ్ళాయన పేరు నమోదు చేసాము !
అబ్బ 330 రూపాయలు సార్ ! అంటూ బాధపడుతూనే ఒప్పుకున్నది ! భర్తను బ్యాంకుకు తీసుకు వచ్చి సంతకం పెట్టించింది ! .
భర్తకూడా ఏదో కూలినాలి చేసుకునేవాళ్ళం ఒకరోజుకూలి పోయిందికదా అని తెగబాధపడిపోయాడు ! సరే ఆయననుకూడా కాసేపు బుజ్జగించి మొత్తానికి ఒక పేరు చేర్పించాను అని సంబరపడ్డాను !
నా బాధనాది టార్గెట్ పూర్తిచేయాలికదా !
ఆయన పేరు అబ్దుల్ నబీ !
ఇది జరిగి మూడునెలలయ్యింది !
ఒకరోజు సాయంత్రం ఆరుగంటలకు బ్యాంకు మూసేసి ఇంటికి వెళ్ళటానికి మోటర్ సైకిలెక్కాను !
అప్పుడే ఆవిడ ఎదురొచ్చింది !
చూశాను !
ఆవిడ కళ్ళలో నీళ్ళు !
మోటర్ సైకిలు దిగి
ఏమిటమ్మా ! ఎందుకేడుస్తున్నావు అని అడిగాను !
సార్ ! మా ఇంటాయన పోయి పది దినాలయ్యింది ! అని చెప్పింది !
ఎక్కడి కెళ్ళాడమ్మా ? అనుమానంగా అడిగాను ! మనసుకు అర్ధమయినా కానట్లుగా ! నిక్షేపంలాగ ఉన్న మనిషికదా !
చనిపోయాడు సార్ ! ఉన్నట్లుండి BP పెరిగి పోయినాడుసార్ అని చెప్పింది !.
సార్ మొన్న ప్రధానమంత్రిగారి పాలసీ చేశారుకదా మాకేమయినా డబ్బులొస్తయ్యాసార్ అని అనుమానంగా అడిగింది !
Death certificate తీసుకొని రా అమ్మా ! ఫారాలు పూర్తిచేసి పంపుదాం అని చెప్పి ఇంటికి బయలుదేరాను.
ఒక వారం,పది రోజుల తరువాత death certificate తీసుకొని వాళ్ళబ్బాయిని వెంటపెట్టుకొని వచ్చింది !
ఒకటే ఫారం పూర్తిచేసి ఆవిడ passbook photocopy జతచేసి హెడ్డాఫీసుకు పంపాను ! ఆవిడే నామినీ కాబట్టి !
ఎప్పుడొస్తాయిసార్ డబ్బులు అని అడిగింది ! .
నాకు తెలియదమ్మా ! ఇదే మొదటిసారి నేనుకూడా పంపటం ! డబ్బులు నీ accountలో పడగానే message వస్తుంది అని చెప్పాను.
ఒకరోజు ఆవిడ వచ్చింది అప్పటికి పదిహేనురోజులు గడిచిపోయాయి ,సార్ నా ఫోనుకు message వచ్చింది 2 లక్షలు పడ్డట్లుగా, చూడండిసార్ ! .
Account తెరిచి చూశాను ! 2 లక్షలు జమ అయినాయి !
తృప్తిగా ఇంటికెళ్ళింది .
మరునాడు వాళ్ళబ్బాయిని తీసుకువచ్చి ఆ రెండులక్షలూ పట్టుకెళ్ళి పోయింది ! ఎంతోకొంత డిపాజిట్ చేసుకోమ్మా అని అడిగాను !
సార్ అవసరముందండీ అని చెప్పి మొత్తం పట్టుకెళ్ళింది !
ఒకరోజు!
ఆ రోజు బైకు తీసుకు రాలేదు బస్సెక్కుదామని రోడ్డుమీద నిలుచున్నాను ! ఒక కొత్త ఆటో నా ముందు ఆగింది ,అందులో ఎక్కబోయిన ఇద్దరిని వద్దన్నాడతను !
సాధారణంగా ఆటోలెక్కను నేను .
ఆటో ఆపి నాదగ్గరకు వచ్చాడా కుర్రవాడు ! ఆ డ్వాక్రాగ్రూపు ఆవిడ కొడుకతను !
సార్ లక్షాపాతికవేలకు ఈ ఆటోకొన్నా సార్ కొత్తది ! కాకపోతే కొని ఆర్నెల్లు తిప్పిన తరువాత మా బంధువొకడు డబ్బు అవసరం పడి అమ్ముతుంటే కొన్నాం ! ఆ రోజు బ్యాంకులో డబ్బులు తీసుకెళ్ళాం ఇందుకోసమే !
ఉండబట్టలేక అడిగాను మిగతా 75000 ఏం చేశారు అని అడిగాను ! .
చెల్లి పెళ్ళిచేసాం సార్ అన్నాడతడు అంతా మీ చలవే సార్ ,ఆటోమీద రోజూ 500 మిగులుతున్నది !
రాండి ఎక్కండిసార్ ఇంటిదగ్గరదింపుతాను అని చెప్పి నన్నొక్కడినే ఎక్కించుకొని ఇంటిదగ్గర దింపాడు ,డబ్బులిస్తే తీసుకోలేదు ! బలవంతంగా 100జేబులో పెట్టాను !
ప్రభుత్వ పాలసీలు చేసే మేలు అది !