e- pass: కావాలా.. ఇలా అప్లై చేసుకోండి
రాష్ట్రంలో లాక్డౌన్ అమలు నేపథ్యంలో అత్యవసర ప్రయాణాల నిమిత్తం పోలీసులు ఈ–పాసులు జారీ చేస్తున్నారు. https://policeportal.tspolice.gov.in వెబ్సైట్లోకి వెళ్లి అక్కడ సూచించిన విధంగా వివరాలు నమోదు చేసి తగిన ఆధారాలు/డాక్యుమెంట్లు సమర్పించాలి. అయితే అత్యవసరాలు, వైద్యసేవలు, వివాహాలు, మరణాలకు మాత్రమే తక్షణం పాసులు జారీ చేస్తున్నారు. కారణాలు సహేతుకంగా లేకున్నా, డాక్యుమెంట్లు సరిగా లేకున్నా తిరస్కరిస్తున్నారు. విమాన ప్రయాణాలు, రైలు ప్రయాణాలు చేసేవారు ఎలాంటి పాసులు తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు.
తెలంగాణవాసులైతే ఇలా..
https://policeportal.tspolice.gov.inవెబ్సైట్ ఓపెన్ చేయాలి. అందులో ముందుగా మీరు కంటైన్మెంట్ జోన్లో లేనని, తాను కంటైన్మెంట్ ప్రాంతానికి ప్రయాణించడంలేదని, తనకు కోవిడ్ అనుమానిత లక్షణాలు ఏమీ లేవని, తాను సమర్పించే అన్ని వివరాలు నిజమైనవేనని స్వయం ధ్రువీకరణ ఇవ్వాలి. తర్వాత అందులోని ఒక్కో కాలమ్‌ను నింపాలి. పేరు చిరునామా, వాహనం వివరాలు, దాని సీటింగ్ సామర్థ్యం, ప్రయాణం తేదీ, తిరుగు ప్రయాణం తేదీ, ఏ రూట్లో వెళ్లి వస్తారు తదితర అన్ని వివరాలు నింపాలి. ఆఖర్లో నిర్దేశించిన మూడు కీలకమైన కాలమ్స్‌లో మీ ఫొటో (80కేబీ), ఆధార్ (500కేబీ), తరువాత ఏ కారణం వల్ల ప్రయాణం చేస్తున్నామో సంబంధిత ధ్రువీకరణ పత్రం (500కేబీ, ఆసుపత్రి, వివాహం, మెడికల్ ఎమర్జెన్సీ, డెత్ సర్టిఫికెట్) తదితరాలు తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి.
ఇతర రాష్ట్రాల వారికి..
ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చేవారికి కూడా మార్గదర్శకాలు దాదాపుగా ఒకటే. ఈ సదుపాయాన్ని మంగళవారం నుంచి అందుబాటులోకి తీసుకువచ్చారు. కాకపోతే, ఏ రాష్ట్రం నుంచి వస్తున్నారు? నివాస పూర్తి చిరునామా, తెలంగాణలోని ఏ జిల్లా, ఏ పోలీస్‌స్టేషన్ పరిధిలోకి వెళ్తున్నారు? ఆ చిరునామా? ఏ రూట్లో వచ్చి వెళతారు? తదితర వివరాలు అదనంగా జోడించాల్సి ఉంటుంది. మిగిలిన ధ్రువీకరణ పత్రాలు యథావిధిగా సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు తెలంగాణ పోలీసులు 1,24,225 పాసులు జారీ చేశారు.