విరక్తి కలిగిస్తోన్న స్టేట్ బ్యాంక్ సేవలు…


ఏ ప్రాంతమైనా, ఏ బ్రాంచైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా… అన్ని ఎస్.బి.ఐ. శాఖల్లో కనిపించే కొన్ని పదనిసలు. రుసరుసలు. వాస్తవ దృశ్యాల హారమే నా ఈ పోస్ట్.

ఏం బాబూ మీరేమన్నా ఉత్త పుణ్యానికి సేవలు చేస్తున్నారనుకుంటున్నారా ? వేలకు వేలు డబ్బులు తీసుకుని కులాసాగా ఏసీలో కూర్చుని పని చేస్తున్నారు. అది గుర్తుంచుకోండి అంటూ ఓ ప్రైవేట్ ఉద్యోగి ఆవేదన.

మీరేమో ఆన్ లైన్ సేవలు అంటారు. పాస్ వర్డేమో సరిగా రాదు. అది వచ్చేలోపల పుణ్యకాలం గడిచిపోతోంది. వాట్ నాన్సెన్స్. మీ మేనేజర్ ఎక్కడమ్మా… ఓ జెంటిల్మెన్ కి వచ్చిన సమస్య ఇది.

అమ్మా… మీరు రావడమే ఇప్పుడు వచ్చారు. వచ్చాక కంప్యూటర్ ఆన్ అవ్వలేదని చెప్పారు. మేనేజర్ గారేమో సిగ్నల్ ఇవ్వలేదంటున్నారు. మరో గంటపోతే లంచ్ బ్రేక్ అంటారు. ఏంటమ్మా ఇది. మా డబ్బులు మాకు ఇవ్వడానికి ఇంత పేచీలా. ఛ అంటూ ఓ ఇళ్లాలి గోల.

ఈ కౌంటర్ దగ్గరకు వస్తే.. ఆ కౌంటర్ అంటారు. ఆ కౌంటర్ దగ్గరకు వెళ్తే మరళా మీ కౌంటరే అంటారు. ఇదేం తిరకాసండీ. వేలు చేతులు చూపించడం మాని ఎక్కడికి వెళ్లాలో సరిగా చెప్పొచ్చుకదా. రోజుకో రూల్స్ మార్చేస్తోంటే మా బోటి అరకొర చదువులు వారికి అర్థం కావాలి కదా. అంటూ ఓ మధ్య వయస్సాయన రుసరుస.

రెండు గంటలుగా వెయిట్ చేస్తుంటే… ఇప్పుడు చావు కబురు చల్లగా చెబుతారేంటి. సర్వర్ డౌన్ అయ్యిందని. ఇదే సమస్య గత కొద్ది రోజులుగా చెబుతునే ఉన్నారు కదా. ఇదే బాదం అండీ.

సర్ ఇంకెంత సేపు సార్… చాలా సమయం నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇంకెంత సమయం పడుతుంది. అసలే మా బాస్ దగ్గర రెండు గంటల పర్మిషన్ పెట్టి వచ్చాను. కాస్త త్వరగా మా పని చూడండి. ఓ ప్రైవేట్ ఉద్యోగి బతుకు పోరాటం.

బ్యాంక్ అకౌంట్ పుస్తకం అప్ డేట్ చెయ్యడానికి మీకు టైం లేదా.. మిషన్ పని చెయ్యదా.. ఏంటి మేడం ఇది. ఎన్నిసార్లు రావాలి. ఎప్పుడు వచ్చినా ఇదే కంప్లైంటా… అసలు కస్టమర్లంటే మరీ అంత చులకన పనికిరాదు మేడం ఇది ఓ చిరు వ్యాపారి వాగ్వాదం.

మనమేదో వీరి మీద బతుకుతున్నట్లు మాట్లాడుతున్నారండీ. మనం కట్టే టాక్సులు, మన డిపాజిట్లతో వచ్చే జీతాలు తింటూ మనపై కనీస గౌరవం ఉండాలి కదా. ఒకప్పుడు బ్యాంకు ఉద్యోగులు ఎంత ఆప్యాయంగా ఉండేవారండీ. అబ్బే.. వీళ్లకి కనీసం కామన్ సెన్సు ఉండడం లేదంటూ రుసరుస లాడిపోతున్నారు ఓ డెబ్బై ఏళ్ల పెద్దాయన.

నాకే చదువు వస్తే మీకెందుకు అడుగుతానమ్మా… ఆ మాత్రం సరిగా చెబితే నీ సొమ్మేం పోతుందా. ముసలిదాన్నని కూడా చూడకుండా అలా కసురుకుంటావేమమ్మా… భలేగుందే వీరి ఎవ్వారం. కలికాలం లచ్చలు జీతాలు తీసుకున్న మీకే ఓపిక లేకపోతే….. పెన్షన్ డబ్బులపై బతుకుతోన్న మా పరిస్థితి ఏందమ్మా.. ఓ వృద్దురాలి ఆవేదన.

సర్ అసలే మూడు గంటలు వర్కింగ్ చేస్తోంది బ్యాంక్. ఈలోగా మీరు లేటుగా బ్యాంక్ కు వస్తే ఎలా అండీ. వచ్చారు సరే. వచ్చిన వెంటనే సీట్ లో కూర్చుని పని స్టార్ట్ చెయ్యాలి కదా. అటు ఇటు తిరుగుతూ… ఫోన్ పట్టుకుని కబుర్లు చెబుతారేంటండి. ఛ… మీరేం మనుషులండీ… అంటూ ఓ కుర్రాడి గుర్రు.

సర్ ఫారం నింపడంలో చిన్న మిస్టేకే కదండీ… మళ్లీ నింపుకుని రావాలంటే.. ఇంత పెద్ద క్యూలైన్లో కష్టం కదండీ.. ప్లీజండీ… ఓ చిన్న తప్పుని కూడా సరిచేసుకోలేని బ్యాంకు ఉద్యోగితో ఓ యువతి బతిమాలుకోవడం.

గతంతో పోల్చితే బ్యాంకు ఉద్యోగులకు భారీగా జీతాలు పెరిగాయి. ఎలవెన్సులు పెరిగాయి. గతంలో బ్యాంకు ఉద్యోగులకు ఉండే కరెంట్ కోతలు, చేతి రాతలు, పెద్ద పెద్ద లెడ్జర్ల మధ్య పని చేసే తిప్పలు ఇప్పటి తరం బ్యాంకు ఉద్యోగులకు లేవు. అయినా సరే అప్పటి బ్యాంకు ఉద్యోగుల్లో ఉండే ఆత్మీయత ఇప్పటి బ్యాంకుల్లో కనీసం కానరాదు.

నోట్ – ఇప్పటికీ అక్కడక్కడ ఎవరో ఒక పుణ్యాత్ముడు మానవత్వంతో పని చేస్తున్నారు. వారికి నమస్కారాలు.

About The Author