చంద్రగిరి రైల్వేస్టేషన్ అభివృద్ధి చేయండి..
శ్రీవారి భక్తులకు సౌకర్యవంతంగా..
* చంద్రగిరి రైల్వేస్టేషన్ అభివృద్ధి చేయండి..
* అన్ని విధాలా అనుకూలం..
* చారిత్రాత్మక ప్రదేశం., శ్రీవారి మెట్టు మార్గంకు అతి సమీపం..
పర్యాటకంగా అభివృద్ధి చెందిన ప్రాంతం
* కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ కు ఎమ్మెల్యే చెవిరెడ్డి వినతి
* సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి
తిరుపతి,
చారిత్రాత్మక ప్రదేశం.. 11వ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయలు పాలించిన ప్రాంతం.. తల్లి వకుళామాత., తనయుడు శ్రీనివాసుడు కొలువుదీరిన ఆధ్యాత్మిక ప్రదేశం.. పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్న చంద్రగిరి.. ఇక్కడి రైల్వే స్టేషన్ ను అత్యాధునిక వసతులతో అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ ను కలిసి విన్నవించారు. ఈ మేరకు తిరుపతి పర్యటనకు విచ్చేసిన కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ను ఆదివారం ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి కూడా ఉన్నారు.
ఇదీ వినతి పత్రంలోని సారాంశం..
ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం అయిన తిరుపతిలో యాత్రికులకు విశిష్ట సేవలందిస్తున్న ప్రధాన రైల్వేస్టేషన్ కు.. చంద్రగిరి రైల్వే స్టేషన్ ప్రత్యామ్నాయంగా భావించవచ్చని తెలియజేశారు. తిరుపతి రైల్వే స్టేషన్ కు యాత్రికుల తాకిడి ఎక్కువగా ఉందని, అభివృద్ధికి స్థలాభావం సమస్యాత్మకంగా పరిణమించిందన్నారు. ప్రస్తుత ప్లాట్ ఫారం లు యాత్రికుల రద్దీకి అనుకూలంగా లేవన్నారు. రేణిగుంట సిఆర్ఎస్ వద్ద ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టినా భవిష్యత్తులో తిరిగి సమస్యలు ఉత్పన్నమవుతాయని వెల్లడించారు. చంద్రగిరి రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయడం ద్వారా శతాబ్దాల కాలానికి పైగా యాత్రికులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని చంద్రగిరి రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేయాలని కోరారు.
చంద్రగిరి రైల్వేస్టేషన్ కు అతి సమీపంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉందన్నారు. తిరుమలకు వచ్చే 50 శాతం పైగా యాత్రికులు ఈ ఆలయాన్ని సందర్శనార్థం విచ్చేస్తున్నారని తెలిపారు. శ్రీవారు లక్ష్మీదేవితో వివాహం తరువాత ఈ ఆలయంలో కొలువుదీరినట్లు పురాణాలు చెబుతున్నాయని వివరించారు. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి వచ్చే యాత్రికులు, ప్రయాణీకులు శ్రీనివాసమంగాపురం, తిరుమలకు చేరుకునేందుకు చంద్రగిరి రైల్వే స్టేషన్ చాలా సౌకర్యంగా ఉంటుందన్నారు. అంతే కాకుండా తిరుమలకు కాలినడకన వెళ్లే శ్రీవారి మెట్టు మార్గం చంద్రగిరి రైల్వే స్టేషన్ కు 4 కిలో మీటర్లు దూరంలో ఉందన్నారు. నీరు, విద్యుత్, ఇతర వనరులు పుష్కలంగా ఉన్నాయని అన్నారు. తిరుపతికి సమీపంలో ఉండటంతో చంద్రగిరి ప్రాంతం అభివృద్ధి దిశగా పయనిస్తోందని అన్నారు. చంద్రగిరి లో జూనియర్, డిగ్రీ కళాశాలలు ఉన్నాయని తెలిపారు. అన్ని విధాలా తిరుపతి ప్రధాన రైల్వే స్టేషన్ కు చంద్రగిరి ప్రత్యామ్నాయం అని పేర్కొన్నారు. చంద్రగిరి రైల్వే స్టేషన్ అభివృద్ధి పట్ల కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు..
ప్రపంచ స్థాయి గుర్తింపు కలిగిన శ్రీ వేంకటేశ్వర జంతు ప్రదర్శనశాలను సందర్శించేందుకు కుటుంబాలతో సహా వస్తుంటారని తెలిపారు. తిరుపతి ప్రధాన రైల్వే స్టేషన్ కంటే చంద్రగిరి రైల్వే స్టేషన్ నుండి జంతుప్రదర్శనశాలకు చేరుకోవడం అనుకూలంగా ఉంటుందన్నారు. తిరుపతి రైల్వే స్టేషన్ కు ప్రత్యామ్నాయంగా చంద్రగిరి రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేయాలని మరోమారు విజ్ఞప్తి చేశారు.
దామల చెరువు, పులిచెర్ల రైల్వే స్టేషన్ల మధ్య ఉన్న వల్లివేడు రైల్వే హాల్ట్ స్టేషన్ లో పలు రైల్ స్టాపింగ్ లు రద్దు చేసినట్లు తెలిపారు. ప్రజల అవసరాల దృష్ట్యా స్టాపింగ్ లు అమలు చేయాలని కోరారు.