నిత్యపెళ్ళికూతరు… మొదటి భర్త సహకారంతో మోసాలు


అనాథనని నమ్మించి ప్రేమ పేరుతో వివాహాలు చేసుకుంటున్న సుహాసిని అసలు గుట్టు రట్టైంది.
తన మొదటి భర్త సహకారంతోనే ఇలా మోసాలకు పాల్పడుతోందని తెలిసింది.

ఈక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఆమె రెండో భర్త తెరపైకి వచ్చాడు. తన నుంచి వివిధ రూపాల్లో సుహాసిని రూ.15 లక్షలు దోచుకుందని ఆరోపించాడు. ఈమేరకు ఆయన ఆదివారం ఓ వీడియో విడుదల చేశాడు.

2018లో నాకు సుహాసిని అనాథగా పరిచయమైంది. నేనంటే ఇష్టమని, పెళ్లి చేసుకుందామని ప్రతిపాదన పెట్టింది. దీంతో 2019 మే 22న వివాహం చేసుకున్నాం.
మా కుటుంబ సభ్యులతో మంచిగా నటించి పలువురి నుంచి రూ.10 లక్షలు తీసుకుంది. రెండు నెలల తర్వాత ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చింది.

అంతకు ముందే సుహాసిని తన మేనమామ అంటూ నెల్లూరు జిల్లా కోనేటిరాజుపాళేనికి చెందిన మొదటి భర్తని నాకు పరిచయం చేసింది. తన ఇద్దరు పిల్లల్ని మేనత్త పిల్లలని నమ్మించింది. ఆమె ప్రవర్తనపై అనుమానం రావడంతో వివరాలు ఆరా తీశా. నాకు మేనమామగా పరిచయం చేసిన వ్యక్తే సుహాసిని భర్త అని ఆ పిల్లలు వారికే పుట్టినట్లు తెలిసింది. వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించినా వారు స్పందించలేదు. మరుసటి రోజే ఆమె మా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆ సమయంలో దాదాపు రూ.5 లక్షల విలువజేసే బంగారం తీసుకెళ్లింది. మరోసారి పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదు. తనను ఎవరూ ఏమీ చేయలేరన్న ధోరణితో ఆమె ప్రవర్తిస్తోంది అని ఆ వీడియోలో బాధితుడు పేర్కొన్నాడు.

About The Author