లైవ్‌లో బూతులు.. భార్యతో సహా పబ్జీ మదన్ అరెస్ట్
యూ ట్యూబ్ చానల్ గేమ్స్ పేరిట పబ్జీ మదన్ సాగించిన వ్యవహారం గురించి తెలిసిందే. నిషేధిత పబ్జీని లైవ్ స్ట్రీమింగ్ చేసినందుకు.. మహిళల పట్ల ఆసభ్య పదజాలంతో లైవ్ స్ట్రీమింగ్ చేసినందుకు మదన్‌ను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. అజ్ఞాతంలో ఉన్న అతడిని చెన్నై పోలీసులు శుక్రవారం ధర్మపురిలో అదుపులోకి తీసుకున్నారు. ఈ ఛానల్‌కు అడ్మిన్‌గా వ్యవహరిస్తున్న ఆయన భార్య కృతికను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. వీరి చానల్‌కు 8 లక్షల సబ్‌స్క్రైబర్స్ ఉన్నారని, వారిలో మైనర్లే అధికంగా ఉన్నారని పోలీసులు తెలిపారు. అంతేగాక మదన్ చానల్ వేదికగా గేమ్స్ ఆడిన వారిలో సంపన్నుల పిల్లలే ఉన్నట్టు విచారణలో వెలుగు చూసింది. తమిళనాడులోని సేలం ప్రాంతానికి చెందిన మదన్ కుమార్ మణిక్కం అలియాస్ మదన్.. మదన్, టాక్సిక్ మదన్ 18+, పబ్జీ మదన్ గర్ల్ ఫ్యాన్ అనే యూట్యూబ్ చానల్‌ను నడుపుతున్నాడు. ఇందులో గేమింగ్ ట్రిక్స్‌కు సంబంధించిన వీడియోలు పోస్ట్ చేసేవాడు. నిషేధిత పబ్జీ గేమ్ గురించి వీడియోలు చేశాడు. ఆ తర్వాత దానిని అశ్లీల పదజాలంతో కూడిన వీడియోలు చేయడానికి ఉపయోగించాడు. భారత్‌లో బ్యాన్ చేసిన పబ్‌జీ గేమ్ ఆడుతూ ఇటీవల బూతులతో మదన్ లైవ్ స్ట్రీమింగ్ చేశాడు. ఈ వీడియోలో మహిళలను అవమానిస్తూ, దూషిస్తూ అతడు చేసిన వ్యాఖ్యలపై వివాదం చేలరేగింది. దీంతో ఛానల్‌ను బ్యాన్ చేయాలని పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో చెన్నై వాసి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వీరిని అరెస్టు చేశారు.
ముందస్తు బెయిల్ కోసం మదన్ కోర్టును ఆశ్రయించాడు. జడ్జి దండపాణి మాట్లాడుతూ.. చానల్ వేదికగా మదన్ మహిళలను అసభ్యపద జాలంలో దూషించిన ఆడియోను విన్న తర్వాత బెయిల్ కోసం వాదించండి అంటూ మదన్ న్యాయవాదికి హితవు పలికారు. మదన్ వాయిస్ రికార్డులు విన్న తర్వాత మద్రాస్ హైకోర్టు షాక్‌కు గురయ్యింది. జూన్ 17న బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. మరోవైపు మదన్ అశ్లీల పదజాలంతో కూడిన గేమింగ్ వీడియోస్ ద్వారా అతను నెలకు రూ. 3 లక్షలకు పైగా సంపాదించేవాడని పోలీసులు తెలిపారు. మదన్ వద్ద మూడు లగ్జరీ కార్లు ఉన్నాయని పేర్కొన్నారు.