దేశంలో కొత్తగా 53 వేల కరోనా కేసులు..
దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 53,256 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 88 రోజుల్లో ఇంత తక్కువగా నమోదవడం ఇదే మొదటిసారి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,99,35,221కి చేరింది. ఇందులో 2,88,44,199 మంది బాధితులు కోలుకోగా, 3,88,135 మంది మహమ్మారి వల్ల మరణించారు. మరో 7,02,887 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు 1422 మంది కొత్తగా చనిపోగా, 78,190 మంది కరోనా నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నది. ఇప్పటివరకు 28,00,36,898 మందికి వ్యాక్సిన్ పంపిణీ చేశామని వెల్లడించింది. అదేవిధంగా జూన్ 20 వరకు దేశవ్యాప్తంగా 39,24,07,782 నమూనాలకు కరోనా పరీక్షలు చేశామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్) తెలిపింది. ఇందులో నిన్న ఒకేరోజు 13,88,699 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని వెల్లడించింది.