23 నుంచి భారత్‌కు ఎమిరేట్స్ విమాన సర్వీసులు!
కరోనా మహమ్మారి నేపథ్యంలో భారత్‌తో సహా వివిధ దేశాలకు విమాన సర్వీసులపై ఆంక్షలు విధించిన ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ వాటిని సడలించింది. దుబాయి నుంచి భారత్‌తోపాటు దక్షిణాఫ్రికా, నైజీరియాలకు విమాన సర్వీసులను ప్రారంభించనున్నది. ఈ నెల 23 నుంచి విమాన సర్వీసులు మొదలవుతాయని ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు శనివారం జరిగిన క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సుప్రీం కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఆమోదించిన వ్యాక్సిన్లు వేయించుకున్న వారు దుబాయికి వచ్చేందుకు అనుమతించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అలాగే, విమానం బయలు దేరడానికి 48 గంటలు ముందుగా ఆర్టీపీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్ సమర్పించిన వారిని కూడా ప్రయాణానికి అనుమతినిస్తారు. భారత్ నుంచి ప్రయాణికుల విమానాలను వచ్చే నెల ఆరో తేదీ వరకు సస్పెండ్ చేసింది. అయితే, యూఏఈ గోల్డెన్ వీసాదారులు, వివిధ దేశాల దౌత్యాధికారులకు ఈ ఆంక్షలు వర్తించబోవని తెలిపింది.