ఎంత చేసినా మీ రుణం తీర్చుకోలేను


‘పులివెందుల నియోజకవర్గంలో ఈ మేరకు చేయగలుగుతున్నామంటే దానికి దేవుని దయ, మీ అందరి చల్లని దీవెనలే కారణం. నాన్న చనిపోయినా నన్నెవరూ వదిలి పెట్టలేదు. నన్ను మీలో ఒకడిగా భావించి తోడుగా నిలబడ్డారు. పులివెందుల మాకు వదిలేయండి.. మేము చూసుకుంటాం. రాష్ట్రం వైపు కన్నుపెట్టి చూడండని మీరంతా దీవించి పంపారు. మీ దీవెనలతోనే ఈరోజు నేను ఈ స్థానంలో ఉన్నాను. ఎంత చేసినా మీ రుణం తీర్చుకోలేను’ అని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. మీ ఆప్యాయతకు చేతులు జోడించి, శిరస్సు వంచి పేరుపేరున హృదయ పూర్వక కృతజ్ఞతలు అంటూ భావోద్వేగంతో పేర్కొన్నారు. అనంతపురం నుంచి గురువారం సాయంత్రం వైఎస్సార్‌ జిల్లా పులివెందులలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానానికి చేరుకున్న ఆయన అక్కడ ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అదే వేదికపై పులివెందుల ప్రాంత అభివృద్ధి కోసం రూ.633.19 కోట్లతో చేపట్టిన 25 అభివృద్ధి పనుల శిలాఫలకాలను ఆవిష్కరించారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. వివరాలు..
ఆ రోజులు గుర్తుకొచ్చాయి..
► ఈ రోజు నాన్నగారి పుట్టిన రోజును రాష్ట్ర వ్యాప్తంగా రైతు దినోత్సవంగా నిర్వహించుకోవడం.. ఇదే రోజున మన ఊరిలో నా బంధువుల మధ్య, నా ఆత్మీయుల మధ్య, నా కుటుంబ సభ్యుల మధ్య ఈ పండుగను జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది.
► పులివెందులలో అభివృద్ధి, వేగంగా జరుగుతున్న పనుల తీరును చూస్తే నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన పనులు గుర్తుకు వచ్చాయి. నాన్న చనిపోయిన తర్వాత పులివెందుల గురించి ఎవరూ పట్టించుకోలేదు. ఆ తర్వాత అంత వేగంగా పనులు జరగడం ఇప్పుడే చూస్తున్నా.
► పులివెందుల బస్టాండు సెంటర్‌లో రూ.76.68 కోట్లతో తలమానికం లాంటి సిటీ సెంట్రమ్‌ను ఏర్పాటు చేస్తున్నాం. రూ.98.66 కోట్లతో రింగ్‌రోడ్డు, మెయిన్‌రోడ్ల బ్యూటిఫికేషన్‌ పనులతోపాటు మార్కెట్‌యార్డు నుంచి ఏపీ కార్ల్‌ వరకు ఫోర్‌లేన్‌ను వేస్తున్నాం.
► రాయలాపురం బ్రిడ్జిని ఫోర్‌లేన్‌ రోడ్డుకు అనుసంధానం చేస్తున్నాం. పేదలందరి కోసం నిర్మిస్తున్న జగనన్న మెగా కాలనీలో రోడ్లు, అండర్‌ గ్రౌండ్‌ తాగునీరు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ మొదలైన సదుపాయాల కోసం రూ. 154.2 కోట్ల పనులకు ఈరోజు శంకుస్థాపన చేశాం. ఈ కాలనీకి సంబంధించి గిట్టనివారు కొందరు కోర్టులో కేసు వేశారు. నెలాఖరులోగా కోర్టు కేసు తెగిపోగానే ఆ పనులకు శ్రీకారం చుడతాం.
ఇంకా అభివృద్ధి పనులు ఇలా..
► మున్సిపల్‌ డిపార్టుమెంటు ద్వారా రూ.139.19 కోట్లతో మార్కెట్లు, షాపింగ్‌ కాంప్లెక్స్‌తోపాటు నాణ్యమైన తాగునీరు, క్లోరైడ్‌ సెన్సర్లు, సిటిజన్‌ సెంటర్‌ సర్వీసు, డిజిటల్‌ లైబ్రరీ, మెడిటేషన్‌ హాలు, సిటిజన్‌ మేనేజ్‌మెంట్‌ సెంటర్, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్, బయో మైనింగ్, ఐదు శ్మశాన వాటికలు.
► రూ.30 కోట్లతో స్కిల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి ఒకటి చొప్పున 25 చోట్ల ఈ సెంటర్ల ఏర్పాటు.
► వాటర్‌ రిసోర్స్‌ డిపార్టుమెంట్‌ ద్వారా రూ.76.65 కోట్లతో ఉలిమెల్ల సరస్సు, గరండాల వంక అభివృద్ధి, వంక వెంబడి సైకిల్‌ ట్రాక్, వాకింగ్‌ ట్రాక్, మెడిటేషన్‌ సెంటర్‌.
► రాణిగారితోపు వద్ద 25 ఎకరాల్లో విద్యార్థుల కోసం బొటానికల్‌ గార్డెన్, బటర్‌ ఫ్లై పార్కు, ఇతర పార్కులు. కాలుష్యాన్ని నివారించేందుకు రూ.22.43 కోట్లతో టెరిషనరీ ట్రీట్మెంట్‌ ప్లాంట్, గ్రీనరీ అభివృద్ధి.
► పులివెందుల నియోజకవర్గంలో 109 గ్రామ పంచాయతీల్లోని 299 గ్రామాల్లో నిరంతరం తాగునీటి సరఫరా కోసం రూ.480 కోట్లతో వాటర్‌ గ్రిడ్‌. ఈ పనుల్లో భాగంగా 250 ఓవర్‌ హెడ్‌ ట్యాంకులు.. 2 వేల కిలోమీటర్ల మేర పైపులైన్‌తో పార్నపల్లె నీరు 44 వేల కుటుంబాలకు సరఫరా.
► ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ ద్వారా డాక్టర్‌ వైఎస్సార్‌ క్రికెట్‌ స్టేడియం నిర్మాణం. వేంపల్లెలో రూ.2 కోట్లతో రైతు బజార్ల ఏర్పాటు. 14 గ్రామాలకు నాణ్యమైన విద్యుత్‌ కోసం రూ.27 కోట్లతో 132 కేవీ సబ్‌ స్టేషన్‌ ప్రారంభం. 8 రూ.500 కోట్లతో ప్రారంభించిన మెడికల్, నర్సింగ్‌ కళాశాలలు, ఆస్పత్రి పనులు 2023 డిసెంబర్‌ నాటికి పూర్తి. ఇదే తీరులో రాష్ట్ర వ్యాప్తంగా 16 కొత్త మెడికల్‌ కాలేజీ పనులు.
► జీఎన్‌ఎస్‌ఎస్‌ నుంచి గాలేరు–నగరికి సంబంధించిన ఎత్తిపోతల ద్వారా హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌కు నీరును లిఫ్ట్‌ చేసి పులివెందుల, రాయచోటి, తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు, పలమనేరు నియోజకవర్గాలకు తరలింపు. కొన్నిచోట్ల సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకుల ఏర్పాటు. రూ.5,036 కోట్లతో చేపట్టే ఈ పనులు 2024 నాటికి పూర్తి.8 రూ.3,015 కోట్లతో గండికోట నుంచి 40 రోజుల్లో చిత్రావతి, పైడిపాలెం ప్రాజెక్టులకు నీటిని ఎత్తిపోసే పనులు 2023కి పూర్తయ్యేలా చర్యలు.
► చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నుంచి ఎర్రబల్లి చెరువును నింపడం, వేముల మండలంలోని యురేనియం ప్రభావిత 7 గ్రామాలకు తాగునీటి సరఫరా కోసం రూ.1,113 కోట్లు ఖర్చుతో చురుగ్గా పనులు.
► రూ.17.5 కోట్లతో శాప్‌ ఆధ్వర్యంలో శరవేగంగా స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ పనులు. పులివెందులలో రూ.34.2 కోట్లతో 12 ఎకరాల్లో కొత్త బస్సు డిపో నిర్మాణం వచ్చే ఏడాది చివరి నాటికి పూర్తి.
► గండి వీరాంజనేయస్వామి దేవస్థాన పునర్నిర్మాణ పనులు 2023 జూన్‌ నాటికి పూర్తి. రూ.12.26 కోట్లతో చేపట్టిన శిల్పారామం పనులు డిసెంబరు నాటికి పూర్తయ్యే అవకాశం. డిసెంబర్‌కు పైడిపాలెం వద్ద టూరిజం సౌకర్యాలు కల్పన.
► ఇడుపులపాయ వద్ద రూ.20 కోట్లతో చేపట్టిన పర్యాటక సర్క్యూట్, వైఎస్సార్‌ మెమోరియల్‌ గార్డెన్‌ పనులు, పులివెందుల మార్కెట్‌ యార్డు అభివృద్ధి పనులు, రూ.13.21 కోట్లతో మండలానికి ఒకటి చొప్పున చేపట్టిన 7 గిడ్డంగుల నిర్మాణాలు డిసెంబర్‌కి పూర్తి.

About The Author