స్నేహమా.. కన్నీరే మిగిల్చావా!
మద్యం మత్తు…అతివేగం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. స్నేహితుల దినోత్సవం రోజున సరదాగా పార్టీ చేసుకుని తిరిగి వస్తుండగా…కారు అదుపుతప్పి నాలుగు పల్టీలు కొట్టడంతో ఓ యువతి దుర్మరణం పాలైంది. కొండాపూర్‌లో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. గచ్చిబౌలి సీఐ గోనె సురేష్ తెలిపిన ప్రకారం…తెల్లాపూర్‌లోని బోన్సాయ్ అపార్ట్‌మెంట్ ఫ్లాట్ నెంబర్ 520లో నివాసం ఉండే డి.వినయ్ కుమార్, జ్యోతి దంపతుల కుమార్తె డి.అశ్రిత (23) కెనడాలో ఎం.టెక్ పూర్తి చేసింది. ఇటీవలే ఇండియాకు వచ్చింది. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో స్నేహితులైన తరుణి, సాయిప్రకాష్, అభిషేక్‌లతో కలిసి ఆమె మాదాపూర్‌లోని స్నార్ట్ పబ్‌కు స్కోడా కారులో వెళ్లారు.అక్కడే మరికొంత మంది మిత్రులూ కలిశారు. రాత్రి 11 గంటల వరకు అక్కడే గడిపారు. అనంతరం స్కోడా కారులో అభిషేక్ డ్రైవింగ్ చేయగా..సాయిప్రకాశ్ ముందు సీట్లో, అశ్రిత, తరుణిలు వెనుక సీట్లో కూర్చున్నారు. వీరు పబ్‌లో మద్యం సేవించారు. ఈక్రమంలో వీరి కారు హఫీజ్‌పేట్ ఆర్‌వోబీ నుంచి మదీనాగూడకు వెళుతుండగా..రాత్రి 11.30 గంటల సమయంలో కొండాపూర్‌లోని మై హోం మంగళ సమీపంలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న రాళ్లను ఢీ కొట్టింది. నాలుగు పల్టీలు కొట్టడంతో వెనక డోర్ తెరుచుకుని.వెనక సీట్లో ఉన్న అశ్రిత కింద పడటంతో తలకు, తరుణికి తీవ్ర గాయాలయ్యాయి. బెలూన్స్ తెరుచుకోవడంతో డ్రైవింగ్ చేస్తున్న అభిషేక్ సురక్షితంగా బయటపడ్డారు.బెలూన్ ఓపెన్ అయినా ముందు సీట్లో ఉన్న సాయి ప్రకాష్‌కు గాయాలయ్యాయి. కారు వెనకాలే మరో కారులో వస్తున్న వీరి మిత్రులు చిన్మయ్, వివేక్‌లు ప్రమాదాన్ని చూసి క్షతగాత్రులను కొండాపూర్‌లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అశ్రిత మృతి చెందినట్లు అక్కడి వైద్యులు ధృవీకరించారు. కాగా డిన్నర్‌లో అభిషేక్, సాయి ప్రకాష్, తరుణి, అశ్రితలు వోడ్కా సేవించినట్లు పోలీసులు తెలిపారు. మద్యం మత్తులోనే అభిషేక్ కారును 120 కిలోమీటర్ల వేగంతో నడిపినట్లు తెలిసిందన్నారు. అందువల్లే ప్రమాదం చోటుచేసుకుందని పేర్కొన్నారు. డ్రైవింగ్ చేసిన అభిషేక్‌కు అర్ధరాత్రి దాటిన తరువాత బ్రీత్ ఎనలైజర్ పరీక్ష చేయగా 10 ఎంఎల్‌గా నిర్ధారణ అయ్యిందన్నారు.
నిబంధనలు బేఖాతరు
ఆదివారం బోనాలు కావడంతో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి మంగళవారం ఉదయం ఆరు గంటల వరకు వైన్స్, బార్‌లు, పబ్‌లలో మద్యం అమ్మకాలపై నిషేధం విధిస్తూ కమిషనర్ వీ.సీ.సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. కమిషనర్ ఆదేశాలను బేఖాతర్ చేస్తూ కస్టమర్లకు మద్యం అందించారు. కాగా పబ్ పేరు స్నార్ట్ అని ఉన్నప్పటికీ రుచి ఇండియా రెస్టారెంట్ అండ్ బార్ పేరిట లైసెన్స్ తీసుకున్నారు. పి.మమత పేరున లిక్కర్ లైసెన్స్ ఉంది. పబ్‌లోకి వెళ్లిన వారికి వోడ్కా అమ్మినట్లు ఆధారాలు సేకరించిన గచ్చిబౌలి పోలీసులు స్నార్ట్ పబ్ యజమాని, మేనేజర్‌లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించినందుకు 188 ఎక్సైజ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు మాదాపూర్ సీఐ రవీంద్ర ప్రసాద్ తెలిపారు.