నాన్న కోసం … ఇద్దరు కూతుళ్ళ కధ …
నాన్న కోసం …
ఇద్దరు కూతుళ్ళ కధ ..
తండ్రి కోసం అబ్బాయిల్లా మారిన ఇద్దరు అక్కాచెల్లెళ్ల కథ ఇది. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన జ్యోతి, నేహ తోబుట్టువులు. వీరి తండ్రి ఓ క్షురకుడు. 2014లో ఆయన అనారోగ్యం పాలయ్యారు. దాంతో షాప్ మూసివేయాల్సి వచ్చింది. కానీ ఆ షాపే వారి జీవనాధారం. తండ్రికి ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆ షాప్‌ను తామే చూసుకోవాలని ఆ ఆడపిల్లలిద్దరూ నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో మగాళ్లకు క్షవరం చేయడానికి వాళ్లు చాలా ఇబ్బందిపడేవారు. అదీకాకుండా ఆడపిల్లలు కావడంతో వచ్చే కస్టమర్లు అసభ్యంగా ప్రవర్తించేవారు. దాంతో వారు ఒక ఉపాయం ఆలోచించారు. ఇద్దరూ పూర్తిగా జుట్టు కత్తిరించేసుకుని, ప్యాంట్, చొక్కా వేసుకుని మగాళ్లలా వేషం మార్చుకున్నారు.
తమ పేర్లను దీపక్, రాజుగా మార్చేసుకున్నారు. అలా రోజుకు రూ.400 వరకు సంపాదిస్తూ తమ తండ్రికి చికిత్స చేయిస్తున్నారు. ‘మొదట్లో చాలా కష్టాలను ఎదుర్కొన్నాం. అబ్బాయిల్లా మారిపోయామని గ్రామంలోని వారంతా మమ్మల్ని ఎగతాళి చేసేవారు. కానీ మేం పట్టించుకోవడం మానేశాం. మా పనిపైనే దృష్టిపెట్టాం. ఇప్పుడు మాలో ధైర్యం పెరిగింది. చదువుకుంటూనే ఈ వృత్తిని కొనసాగిస్తున్నాం.’ అని మీడియా ద్వారా వెల్లడించారు. తమ కూతుళ్లు పడుతున్న కష్టం గురించి వారి తండ్రి మాట్లాడుతూ.. ‘వారు పనిచేస్తుంటే నా కడుపు తరుక్కుపోతోంది కానీ ఆడపిల్లలైనా ధైర్యంగా పని చేయడం చూసి గర్వపడుతున్నాను.’ అని తెలిపారు. జ్యోతి, నేహ ధైర్యాన్ని చూసి ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం వారిని సత్కరించి ఆర్థిక సాయం అందించింది.