బామ్మ పోరాటం 30 ఏళ్లకు ఫలించింది…
ఆ బామ్మ పోరాటం 30 ఏళ్లకు ఫలించింది. పోరాటంలో విజయం సాధించలేనని దాదాపు నిర్ధారించుకున్న 94 ఏళ్ల బామ్మ… ఆఖరి ప్రయత్నంగా ప్రధాని మోడీకి ఒక లేఖ రాశారు. మోడీ కార్యాలయం స్పందించడంతో 30ఏళ్ల పోరాటంలో బామ్మ విజయం సాధించినట్టు అయింది. ఇప్పుడు కోటి రూపాయలను ఆమె అందుకోబోతున్నారు.
హెబే బెంజమిన్ భర్త జార్జ్ బెంజమిన్ భారత ఆర్మీలో ఇంజనీర్ గా పనిచేశాడు. 30 ఏళ్ల క్రితం రిటైర్ అయ్యాడు. ఆ తర్వాత ఫ్యామిలీతో ఇజ్రాయిల్ వెళ్లిన జార్జ్ అక్కడే చనిపోయారు. దాంతో మరో ఆదాయ వనరు లేని ఆయన భార్య తనకు ఫించన్ ఇవ్వాల్సిందిగా భారత రక్షణ శాఖను కోరింది. కానీ అటు నుంచి ఎలాంటి స్పందన లేదు.
ఎన్నిసార్లు లేఖలు రాసినా సానుకూల స్పందన రాలేదు. జార్జ్ భార్య ఇజ్రాయిల్‌లో ఉండడంతో ఇక్కడి అధికారులు స్పందించలేదు. న్యాయబద్దంగా తనకు రావాల్సిన ఫించన్ ఇవ్వకపోవడంతో తన స్నేహితుల సాయంతో హెబే పోరాటం చేస్తూనే ఉన్నారు. ఆఖరి ప్రయత్నంగా ప్రధాని నరేంద్ర మోడీకి ఆమె లేఖ రాశారు. 30ఏళ్లుగా భారత రక్షణ శాఖతో తాను చేస్తున్న పోరాటాన్ని వివరించి… న్యాయం చేయాల్సిందిగా అభ్యర్ధించారు.
ఆమె లేఖపై వెంటనే స్పందించిన పీఎంవో… తక్షణం ఆమెకు ఫించన్ పునరుద్దరించడంతో పాటు, పాత బకాయిలు చెల్లించాల్సిందిగా ఆదేశించింది. దీంతో ఆఘమేఘాల మీద ఫైల్ కదులుతోంది. బకాయి పెన్షన్ సొమ్ము, వడ్డీతో కలిపి 94 ఏళ్ల హెబే దాదాపు కోటి రూపాయలను అందుకోబోతున్నారు. 30 ఏళ్ల తర్వాత తనకు న్యాయం జరిగేలా చేసిన ప్రధాని మోడీకి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.