శివరాత్రి రోజు శివ పురాణం చదివితే…
శివరాత్రి రోజు శివ పురాణం చదివితే….
శివుడు లింగరూపంలో ఉద్భవించిన పవిత్రమైన రోజు మహాశివరాత్రిగా హిందూ పురాణాలు పేర్కొన్నాయి. పరమేశ్వరుడి మహిమలను కూడా శివ పురాణం తెలియజేస్తు ది
మహాశివరాత్రి నాడు శివపురాణాన్ని చదివితే ముక్తి లభిస్తుందని పురాతన పండితులు పేర్కొన్నారు. శివపార్వతుల గురించి తెలిపే ఈ పవిత్ర గ్రంథాన్ని చదివినవారికి, విన్నవారికీ పుణ్యం కలుగుతుందట. శివరాత్రి పండుగను హిందువులు ఏటా జరుపుకుంటారు. తెలుగు నెలల ప్రకారం మాఘమాసంలోని బహుళపక్షం 13 రోజును మహాశివరాత్రిగా పరిగణించి ప్రత్యేకంగా శివారాధన చేస్తారు.
ఈ రోజునే శివుడు లింగ రూపంలో ఉద్భవించినట్లు పురాణాలు ఘోషిస్తున్నాయి. అలాగే శివపార్వతుల కల్యాణం కూడా ఈ రోజే జరిగిందని నమ్ముతారు. అంటే సతీదేవి అగ్నిప్రవేశం తర్వాత హిమవంతుని కుమార్తె పార్వతిగా జన్మించింది. ఆ తర్వాత శివుని కోసం ఘోర తపస్సు చేసి భర్తగా పొందింది.
శివరాత్రి రోజు వేకువనే నిద్రలేచి తల స్నానం చేసి శివుడికి పాలు, పెరుగు, తేనే, నెయ్యి, బిల్వ పత్రాలు, పార్వతి దేవికి ఎరుపు జాకెట్టు, గాజులు సమర్పించాలి. శివ పురాణం ప్రాసస్త్యాన్ని షౌనికాది మునులకు సూత మహర్షి తెలియజేసినట్లు అథర్వణ వేదంలో తెలియజేశారు. ఈ గ్రంథాన్ని చదివేటప్పుడు కొన్ని నియమాలను పాటించాలని ఆయన తెలిపాడు. శివపురాణంలోని నియమాల ప్రకారం ఈశ్వరుడుని పూజిస్తే భక్తులను అనుగ్రహిస్తాడని పేర్కొన్నారు.
అతిథులను ఆహ్వానించి మంచి గడియల్లోనే దీన్ని చదవడం ప్రారంభించాలి. అలాగే పరిశుభ్రమైన, పవిత్రమైన ప్రదేశంలోనే కూర్చోవాలి. పూజ గది లేదా ఇంట్లోని ఓ ప్రదేశాన్ని ఆవు పేడతో శుద్ధిచేసి అక్కడ చదవాలి. శివలింగం పక్కనగానీ, శివాలయంలో అయితే మరీ మంచిది.
ముందు విఘ్నేశ్వరుని పూజించాలి. కథ చెప్పేవారు ఉత్తర ముఖంగా కూర్చుని ఉండాలి. వినేవారు తూర్పునకు ముఖం ఉంచి ఆశీనులు కావాలి. విన్నవారికి వచ్చే సందేహాలను ఖచ్చితంగా నివృత్తి చేయాలి.
నిర్మలమైన మనసుతో కథ వినాలి. కేవలం శివుని యందే మనసు లగ్నం చేసి కథ వింటే పరమేశ్వరుని అనుగ్రహం పొందుతారు.
తమ స్థోమతకు తగినట్లు దానం చేయాలి. కథ వింటున్నప్పుడు ఓం నమ:శివాయ మంత్రాన్ని చెప్పుకోవాలి.
శివ పురాణం చదివేవారు, విన్నవాళ్లు తప్పని సరిగా బ్రహ్మచర్యం పాటించాలి. పురాణం పూర్తయినంత వరకు నేలపై పవళించి, కేవలం పండ్లు మాత్రమే స్వీకరించాలి. కథ పూర్తయిన తర్వాతే సాత్వికాహారాన్ని భుజించాలి.
పురాణం పూర్తయిన తర్వాత ఉద్వాసన పలకాలి. బ్రాహ్మణులకు, కథ చదివిన వారికి దానం చేయాలి.
శివరాత్రి మరుసటి రోజు హోమం నిర్వహించాలి. ఆవు నేయి మాత్రమే దీనికి ఉపయోగించాలి. రుద్ర సంహిత లేదా గాయత్రీ మంతం పటిస్లూ హోమం కొనసాగించాలి.