పల్లీ చట్నీ చేయాల్సిన అసలు పద్ధతి ఇదే!
పల్లీ చట్నీ చేయాల్సిన అసలు పద్ధతి ఇదే! – ఇలా చేస్తే పిల్లలు టిఫెన్ కంటే పచ్చడే ఎక్కువ తింటారు!
కావాల్సిన ఇంగ్రీడియంట్స్ :
పల్లీలు- 1 కప్పు.
నూనె – 2 టేబుల్ స్పూన్లు
పచ్చిమిర్చి – 10(మీ కారానికి తగినన్ని)
ఎండుమిర్చి – 2.
ఆవాలు – 1 టీస్పూన్
పచ్చి శెనగపప్పు – ఒక టీస్పూన్
మినపప్పు – ఒక టీస్పూన్
కరివేపాకు – కొద్దిగా.
ఉప్పు – రుచికి సరిపడా
చింతపండు – కొద్దిగా
బెల్లం ముక్క – చిన్నది
తయారీ విధానం :
ఈ టేస్టీ చట్నీ కోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని పల్లీలను వేసి లో ఫ్లేమ్ మీద అవి చక్కగా వేగే వరకు వేయించుకోవాలి.
సన్నని సెగ మీద వేయించుకోవడం ద్వారా పల్లీలు లోపలి వరకు బాగా వేగి చట్నీ చాలా రుచికరంగా ఉంటుంది.పల్లీలు మంచిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచం చల్లార్చుకోవాలి.
అవి కాస్త చల్లారిన తర్వాత పొట్టు తొలగించుకొని పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి.
నూనె కొద్దిగా వేడయ్యాక పచ్చిమిర్చిని ముక్కలుగా తుంపి వేసుకొని లో ఫ్లేమ్ మీద కలుపుతూ వేయించుకోవాలి.అవి చక్కగా వేగిన తర్వాత వాటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు, వేయించిన పచ్చిమిర్చి, ఉప్పు, చింతపండు, బెల్లం ముక్క వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి.
అనంతరం ఆ మిశ్రమంలో చట్నీకి సరిపడినన్ని నీళ్లు వేసుకొని మరోసారి గ్రైండ్ చేసుకోవాలి. అయితే, చట్నీని మరీ పలుచగా కాకుండా కాస్త చిక్కగానే మిక్సీ పట్టుకోవాలి.
తర్వాత దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడే టేస్ట్ చెక్ చేసుకొని ఉప్పు, చింతపండు, బెల్లంవంటివి అడ్జస్ట్ చేసుకోవాలి.
అనంతరం చట్నీకి తాలింపుకోసం పచ్చిమిర్చి వేయించుకున్న కడాయిలోని నూనెలో ఎండుమిర్చి తుంపలు, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసి వేయించుకోవాలి.
పోపు దినుసులన్ని మంచిగా వేగాక కరివేపాకు వేసి కలుపుతూ కాస్త వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.ఆ తర్వాత ఈ తాలింపుని ముందుగా ప్రిపేర్ చేసుకున్న చట్నీలో వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి.
అంతే, ఎంతో రుచికరంగా ఉండే “పల్లీ చట్నీ” తయార్ అవుతుంది!ఇక్కడ మీరు చట్నీని కాస్త గట్టిగా గ్రైండ్ చేసుకున్నట్లయితే ఫ్రిడ్జ్ లో ఉంచితే రెండు రోజుల పాటు నిల్వ ఉంటుంది!
టిప్స్ :
ఈ రెసిపీలో చిన్న బెల్లం ముక్క వేసుకోవడం ద్వారా చట్నీకి సరికొత్త టేస్ట్ వస్తుంది.
ఇందులో ఉప్పు, కారం, పులుపు, తీపి ఇలా అన్ని సరిపోను ఉంటేనే రుచి బాగుంటుంది.
కాబట్టి, ఈ పదార్థాలన్ని తగిన పరిమాణంలో తీసుకోవాలి.ఇక్కడ గట్టి చట్నీని ఇష్టపడే వారు వాటర్ కాస్త తక్కువ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి.
అదే, చట్నీ కాస్త జారుడుగా కావాలనుకుంటే నీళ్లు కొద్దిగా ఎక్కువగా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి.