ఎఫ్‌-1 వీసా నిబంధనల్లో మార్పులు


అమెరికాలో విద్యను అభ్యసించడం కోసం మంజారు చేసే ఎఫ్‌-1 వీసా నిబంధనల్లో మార్పులు చేశారు. ఈ నిబంధనల్లో మార్పులతో భారతీయ విద్యార్థులు కొత్త ఆంక్షలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఒకసారి మంజూరైన వీసాతో ఒక కోర్సును మాత్రమే పూర్తిచేయగలరు. మరొక కోర్సును అభ్యసించాలంటే మరొకసారి వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందే. ఈ నిబంధనల్లో మార్పుల ప్రకారం కొత్తగా చేరిన విద్యార్థులు ఇకపై విశ్వవిద్యాయాలను వెంటనే మార్చుకోలేరు. కనీసం ఒక ఏడాది చదువును విజయవంతంగా పూర్తి చేసిన తరువాతే విశ్వవిద్యాలయాలను మార్చుకోవడానికి వీలవుతుంది. వీసా ఆమోదం సమయంలో జాబితాగా ఇచ్చిన విద్యాసంస్థల్లోనే విద్యార్థులు కొనసాగాలి. కొత్తగా మరో విద్యా సంస్థను మార్చుకోవడానికి వీలు లేకుండా నిబంధనలు మార్పు చేశారు. ఈ నిబంధనను వచ్చే 30 నుంచి 60 రోజుల్లో పూర్తిగా అమలు చేస్తారని భావిస్తున్నారు. దీంతో ఆగస్టుల్లో ప్రవేశాలను ఎంచుకునే భారతీయ విద్యార్థులతోపాటు ఇప్పటికే అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థులను ఈ కొత్త నిబంధనలు ఎక్కువగా ప్రభావితం చేస్తాయని అంచనా వేస్తున్నారు. ఒకసారి ఎఫ్‌-1 వీసా వచ్చిన తరువాత మరోసారి కొత్త వీసాకు దరఖాస్తు చేసుకోకుండానే, వరసగా మాస్టర్స్‌ ప్రోగ్రామ్‌ వంటి బహుళ డిగ్రీలను పొందే అవకాశాన్ని కూడా నూతన నిబంధనలు ద్వారా దూరం చేశారు. నిబంధనల్లో చేసిన మరో ప్రధాన మార్పు ఏమిటంటే ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ (ఒపిటి) గ్రేస్‌ పీరియడ్‌ను భారీగా తగ్గించారు. గతంలో ఇది 60 రోజులు ఉండగా, దీన్ని 30 రోజులకు తగ్గించారు. ఈ మార్పులను ఇటీవల ఏళ్లలో విద్యార్థి వీసా విధానంలో చేసిన అత్యంత కఠినమైన మార్పులుగా ఈ రంగానికి చెందిన నిపుణులు భావిస్తున్నారు. హైదరాబాద్‌లోని ప్రముఖ విదేశీ విద్యా సలహాదారు నిషిధర్‌ రెడ్డి బొర్రా మాట్లాడుతూ ‘మనదేశ విద్యార్థుల్లో ఎక్కువ మంది వీసా స్టాంపింగ్‌ సులభంగా పొందడం కోసం అధిక ఫీజులు వసూలు చేసే విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేసుకుంటారు. అమెరికాకు వెళ్లిన తరువాత అక్కడ తక్కువ ఫీజులు ఉండే చిన్న విశ్వవిద్యాలయాల్లో చేరతారు. ఇలాంటి అవకాశం కొత్త నిబంధనలతో ఉండదు’ అని అన్నారు. ఇప్పుడు జారీ అయ్యే ఎఫ్‌-1 వీసాలు గరిష్టంగా నాలుగేళ్ల కాలపరిమితితోనే జారీ అవుతాయని తెలిపారు.

About The Author