యాదాద్రి దేవస్థానానికి అనుబంధంగా గల పాతగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం లో బ్రహ్మోత్సవాలు…
పాతగుట్టలో ఉత్సవాలకు ఏర్పాట్లు
?️ 11 నుంచి అధ్యయనోత్సవాలు
?️ 15 నుంచి బ్రహ్మోత్సవాలు
యాదాద్రి దేవస్థానానికి అనుబంధంగా గల పాతగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం 11 రోజుల పాటు వార్షికోత్సవాల నిర్వహణకు ముస్తాబవుతోంది. సంప్రదాయ ఏర్పాట్లకు అర్చక బృందం నడుం బిగిస్తోంది. ఈసారి భారీ ఎత్తున ఉత్సవాలు నిర్వహించాలని యాదాద్రి దేవస్థానం సంకల్పించింది. వరుసగా 11 రోజుల పాటు ఆలయోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి. ఆలయం, మండపాలను తీర్చిదిద్దేందుకు పనులు ముమ్మరం చేశారు. వచ్చే సోమవారం నుంచి మొదలయ్యే ఉత్సవాలలో పాల్గొనేందుకు వచ్చే భక్తులకు ఇక్కట్లు కలగకుండా ఏర్పాట్లు చేపట్టాలని యాదాద్రి దేవస్థానం నిర్ణయించింది. తొలుత ఈనెల 11 నుంచి 14 వరకు అధ్యయనోత్సవాలను నిర్వహిస్తారు. ఏటా నిర్వహించే బ్రహ్మోత్సవాలు ఈనెల 15న మొదలవుతాయి. వారం రోజులపాటు కొనసాగే బ్రహ్మోత్సవాలను ఆచారపరంగా ఘనంగా నిర్వహించనున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ఈవో గీతారెడ్డి వెల్లడించారు. తొలుత జరిగే అధ్యయనోత్సవాల్లో అలంకార సేవోత్సవాలనూ చేపడతారు. ప్రత్యేక రుత్వికులతో ప్రబంధ పారాయణం నిర్వహిస్తారు.
?️ బ్రహ్మోత్సవాల వివరాలు
ఈ నెల 15న మొదలయ్యే పాతగుట్ట ఆలయ బ్రహ్మోత్సవాల్లో తొలుత స్వస్తివాచనం, రక్షాబంధనం, విష్వక్సేన ఆరాధనతో శ్రీకారం చుడతారు. ఆ రోజు రాత్రి అంకురార్పణం జరుగుతుంది. 16న ఉదయం ధ్వజారోహణం, రాత్రి భేరీ పూజ, దేవతాహ్వానం, 17న ఉదయం అలంకార సేవోత్సవం, హవన పూజలు జరుగుతాయి. అదే రోజు రాత్రి ఎదుర్కోలు ఉత్సవాన్ని నిర్వహిస్తారు. 18న ఉదయం హనుమంత సేవోత్సవం, ఆరోజు రాత్రి తిరుకల్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తారు. 19న ఉదయం హోమాది పూజలు, గరుడ వాహనోత్సవాన్ని నిర్వహిస్తారు. అదేరోజు రాత్రి శ్రీ స్వామివారి రథోత్సవ పర్వం కొనసాగుతుంది. 20న ఉదయం పూర్ణాహుతి, మధ్యాహ్నం చక్రతీర్థ స్నానం, రాత్రి దేవతోద్వాసన, 21న ఉదయం అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించి ఉత్సవాలకు తెరతీస్తారు.