మంత్రిగా శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు.
సచివాలయంలో తన చాంబర్ లో రాష్ట్ర రవాణా, రోడ్లు మరియు భవనాలు , శాసనసభ వ్యవహారాలు మరియు హౌజింగ్ శాఖల మంత్రిగా శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి ప్రియతమ నాయకుడు శ్రీ కేసీఆర్ గారు నన్ను తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సభ్యునిగా తీసుకొని రోడ్లు మరియు భవనాలు, రవాణా, శాసనసభ వ్యవహారాలు మరియు హౌజింగ్ శాఖలు అప్పగించినందుకు వారికి హృదయ పూర్యక ధన్యవాదాలు తెలిపారు.
వారు అప్పగించిన ఈ బాధ్యతను వంద శాతం పూర్తి చేయటానికి నాశక్తి మేరకు ప్రయత్నం చేస్తానన్నారు. కేసీఆర్ గారితో వెన్నంటి వుండి, వారితో కలసి పనిచేయాలనేదే నా లక్ష్యం అని, వారి మాటే శిరోధార్యం గా భావించి వారు ఏ పని అప్పచెప్పినా వంద శాతం పూర్తి చేయటానికి నా శాయ శక్తుల ప్రయత్నం చేస్తానని తెలిపారు.
ఈ సందర్భంగా అది రవాణా శాఖే కావచ్చు, ఆర్.టి.సి. సమస్యలు కావచ్చు , రోడ్డు, భవనాల శాఖ కావచ్చు , హౌజింగ్ లోనే కావచ్చు, అందరు అధికారుల సమన్వయంతో పని చేస్తూ ముందుకు వెళ్తానని అన్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి కవిత , పలువురు ప్రజా ప్రతినిధులు, సచివాలయ, రవాణా, ఆర్.టి.సి. రోడ్లు , భవనాలు, హౌజింగ్ శాఖల అధికారులు, ఉద్యోగులు మంత్రి గారికి శుభాకాంక్షలు తెలిపారు.