మళ్లీ రాఫెల్‌కు ముడిపెట్టి… మోడీ మెడలో వేసి… నానా పాట్లు..!!
మళ్లీ రాఫెల్‌కు ముడిపెట్టి… మోడీ మెడలో వేసి… నానా పాట్లు..!!
బంగ్లాదేశ్ విముక్తి అనంతరం అప్పటి విపక్షనేత వాజపేయి అప్పటి ప్రధాని ఇందిరను ప్రశంసల్లో ముంచెత్తాడు… మనం మనం లోలోపల ఎన్ని విషయాలపై ఎన్ని తన్నుకున్నా సరే, దేశం అనే అంశం వచ్చేసరికి మొత్తం ఏకమవ్వాలి… ఏ కుర్చీలో ఎవరున్నారనేది అప్రస్తుతం…. వాజపేయి ఓ స్టేట్స్‌మన్… అందుకే అలా స్పందించాడు… ఇప్పుడూ అంతే… మోడీని మనం అనేక విషయాల్లో తిట్టుకుందాం… కానీ నిన్నటి ఎయిర్ స్ట్రయిక్స్ విషయంలో తనదే అంతిమ, రాజకీయ నిర్ణయం… అందుకని క్రెడిట్ తనకే దక్కుతుంది… అనివార్యంగా…! కానీ ఎన్నికల ముందు ఇది బీజేపీకి, మోడీకి లాభిస్తుందనే సందేహాలు విపక్షనేతల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి…
ఎన్నికలకుముందు మోడీ ఇలాంటి పనులేవో చేస్తాడని అనుకుంటున్నదే, అసలు పుల్వామా దాడి వెనుక కూడా మోడీ కుట్ర ఉండొచ్చు అనే తరహాలో విమర్శలు స్టార్ట్ చేశారు మొదట్లో… ప్రత్యేకించి ఫిమేల్ చంద్రబాబు మమత, మేల్ ముఫ్తి చంద్రబాబు వంటి నేతలు..! అయ్యో, పుల్వామా దాడితో మాకు సంబంధం లేదని పాకిస్థానీ ప్రధాని ఇమ్రాన్ చెబుతున్నాడు కదా అని వ్యాఖ్యానించి చంద్రబాబు తను జాతినేత తప్ప ఇంకెన్నడూ జాతీయనేతగా ఎదగలేడు అని తనకుతాను నిరూపించుకున్నాడు… సోషల్ మీడియా చంద్రబాబు వైఖరిని బట్టలిప్పి మరీ జాడించింది…
త్రివిధ దళాలు, కీలక నిఘా సంస్థలు, విదేశాంగశాఖ ఈ రాజకీయాలతో పనిలేకుండా… కాగల కార్యానికి పూర్వరంగం సిద్ధం చేస్తాయి… ఒక్కసారి స్థిర రాజకీయ నిర్ణయం వెలువడితే ఇక పూర్తిస్థాయిలో రంగంలో దిగుతాయి… వచ్చేవి ఎన్నికలు, బీజేపీ ఎందుకు ఊరుకుంటుంది..? మోడీ వోకే అన్నాడు… మిరాజ్ విమానాలు గాలిలోకి ఎగిరాయి… ఇక్కడా వ్యతిరేక వ్యాఖ్యలకు దిగితే ఇంకా భ్రష్టుపట్టిపోతామనే విషయం ముందుగా గుర్తించింది రాహుల్ కోటరీ ప్లస్ కేజ్రీవాల్… బీజేపీ నేతలకన్నా ముందే మన ఎయిర్ ఫోర్స్ సామర్థ్యాన్ని కీర్తిస్తూ ట్వీట్లు కొట్టారు… ముఫ్తిని వదిలేయండి, ఆమె అవసరం వేరు, కశ్మీర్లో ఆమె రాజకీయం వేరు… మమత, చంద్రబాబు ఎట్సెట్రా మోడీ వ్యతిరేకులకు ఏం స్పందించాలో తెలియలేదు… మోడీని పొగడలేరు, పొగడాల్సిన అవసరమూ లేదు… అందుకని ఈసారి జాగ్రత్తగా మన రక్షణ దళాల్ని కీర్తించారు… పొరపాటున కూడా మోడీకి మైలేజీ రాకుండా జాగ్రత్తపడ్డారు… కానీ ఈ పరిణామాలు ఎక్కడ బీజేపికి ప్లస్ అవుతాయో అనే సందేహం… అందుకని… అబ్బే, ఇదంతా మన సైన్యం ఘనతే తప్ప మోడీదేమీ లేదు అనే తరహాలో సోషల్ మీడియాలో ప్రచారానికి దిగాయి మోడీ వ్యతిరేక శిబిరాలు…
ఇక్కడ చంద్రబాబు అండ్ మమత బ్యాచ్ మరిచిపోయింది ఏమిటీ అంటే..? ఇలాంటి విషయాల్లో ఎంత మోడీ వ్యతిరేక ప్రచారానికి దిగినా సరే… అది మళ్లీ మళ్లీ ఎయిర్ స్ట్రయిక్స్పైనే చర్చకు దారితీస్తూ, అంతిమంగా మోడీకే లాభం చేస్తారు అని..! మాయావతి అనే మరో లీడర్… మరి ముందే ఈ ఎయిర్ స్ట్రయిక్స్ ఎందుకు చేయలేదు అని వ్యాఖ్య… దాదాపు అదే తరహాలో పలువురు కాంగ్రెస్ నేతల ప్రశ్నలు… నిజమే, మోడీకి ముందే చేతకాలేదు సరే… కశ్మీర్ ఉగ్రవాద సమస్య చాలా పాతదే కదా… మరి పాత కాంగ్రెస్ ప్రభుత్వాలు, చంద్రబాబులు చక్రాలు తప్పిన అతుకుల బొంత సర్కార్లు ఏం చేశాయట..? సో, ఇక ఇవన్నీ కాదని మళ్లీ పాతబడిన ఆ రాఫెల్ విమానాన్ని తీసుకొచ్చి, మరో వ్యతిరేక ప్రచారానికి పూనుకున్నది విపక్షం… (మజ్లిస్ ఒవైసీ ధోరణి ప్రశంసనీయం… గతంలో ఐసిస్‌పై గానీ, ఇప్పుడు జైషేపై గానీ పదునైన విమర్శలు చేస్తూ, కేంద్రాన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు… మోడీని విభేదించే విషయాల్లో ఇంతకుమించిన పదును చూపించవచ్చుగాక.., పర్లేదు… తప్పదు…)…