పూరీ మఠంలోరూ.90 కోట్ల వెండి లభ్యం…

* పూరీ మఠంలోరూ.90 కోట్ల వెండి లభ్యం

* 522 వెండి ఇటుకలు స్వాధీనం *బరువు 18 టన్నులు

ఒడిశాలోని పూరీ పుణ్యక్షేత్రంలో శనివారం భారీ స్థాయిలో వెండి నిల్వలు బయటపడ్డాయి. శ్రీజగన్నాథస్వామి ఆలయం ఎదురుగా ఉన్న ఎమ్మార్ మఠంలో కొన్ని దశాబ్దాలుగా ఉపయోగించని గది నుంచి నాలుగు చెక్కపెట్టెల్లో 522 వెండి ఇటుకలు లభ్యమయ్యాయి. ఒక్కోటీ 38 నుంచి 40 కేజీల బరువుండే ఈ వెండి ఇటుకల ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు రూ. 90 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే వీటి మొత్తం బరువు 18 టన్నుల 87 కిలోల 650 గ్రాములుగా లెక్కగట్టారు. చోరీ చేసిన కొన్ని వెండి ఇటుకలను విక్రయించేందుకు ప్రయత్నించిన బారల్, దాస్ అనే ఇద్దరు తాపీమేస్ర్తీల నుంచి రాబట్టిన సమాచారం ఆధారంగా పోలీసులు ఈ నిల్వ రహస్యాన్ని ఛేదించారు. మఠం మరమ్మతు పనుల కోసం ఒడిశా రాష్ట్ర పురావస్తుశాఖ విభాగం వీరిని ఇటీవల నియమించినట్లు పోలీసులు తెలిపారు.

మఠంలోని వెండి నిల్వలున్న గదిలో మేస్త్రీలు సీలింగ్ పనులు జరుపుతుం డగా సిమెంటు పెళ్లలు ఊడి కిందున్న ఓ చెక్కపెట్టెపై పడి అది విరిగిందని, దీంతో అందులోంచి కొన్ని వెండి ఇటుకలను బయటకు తీసి విక్రయించాలనుకున్నట్లు నిందితులు తమ విచారణలో అంగీకరించారని పోలీసులు చెప్పారు. ఈ ఇటుకలపై కోల్‌కతా మింట్ అనే అక్షరాలతోపాటు యూఏఈ, జపాన్, చైనా, దుబాయ్ అనే ముద్రలు కూడా ఉన్నట్లు వివరించారు. ప్రస్తుతం ఈ ఇటుకలను మఠం ఆవరణలోనే కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంచామని పూరీ ఎస్పీ సంజయ్ కుమార్ తెలిపారు. కాగా, వెండి ఇటుకలతోపాటు లక్ష నగదును స్వాధీనపరచుకున్నామని, ఆ సొత్తును పూరీ సింహద్వారం ఠాణాకు అప్పగించనున్నట్లు ఢెంకనాల్ జిల్లా ఎస్పీ సతీష్ తెలిపారు. దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ సంజయ్ కుమార్, సిటీ డీఎస్పీ ఆర్.కె. పాయిక్రాయ్, సింహద్వార్ ఠాణా ఇంచార్జ్ ఎం.కె. సేనాపతి తదితరుల పర్యవేక్షణలో చెక్క పెట్టెల నుంచి ఈ వెండి నిల్వలను వెలికితీసే కార్యక్రమం కొనసాగింది.

About The Author