నగరంలో కొత్తగా విద్యుత్తు బస్సులు…

నగరంలో కొత్తగా ప్రవేశ పెడుతున్న విద్యుత్తు బస్సులు మంగళవారం నుంచి రహదారులపై పరుగులు తీయనున్నాయి. ఇప్పటికే సిద్ధంగా ఉన్న 40 బస్సులను ఆర్టీసీ ఎండీ సునీల్‌ శర్మ సాయంత్రం లాంఛనంగా ప్రారంభిస్తారు. ఇందుకు మియాపూర్‌-2 వేదికవుతోందని గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ ఈడీ వినోద్‌కుమార్‌ చెప్పారు.
ఎన్నాళ్లకెన్నాళ్లకు.. నిజానికి విద్యుత్తు బస్సులు ఆరు నెలల కిందటే నగరానికి వచ్చాయి. రూట్ల కేటాయింపు, బస్సుల రిజిస్ట్రేషన్‌ తదితర ప్రక్రియలు పూర్తి చేసుకొని పరుగులు పెట్టడానికి అప్పట్లోనే సిద్ధమయ్యాయి. ఈలోగా శాసన సభ ఎన్నికలు వచ్చాయి. కొత్త ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా వీటిని ప్రారంభించాలని బస్సులను సమకూరుస్తున్న ‘ఒలెక్ట్రా గ్రీన్‌ టెక్‌’ సంస్థతో పాటు టీఎస్‌ఆర్టీసీ భావించింది. అయితే వివిధ కారణాల వల్ల జాప్యం జరిగింది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండడంతో ముఖ్యమంత్రి లేదా రవాణా శాఖ మంత్రితో ప్రారంభించడానికి ఆటంకం ఏర్పడింది. తర్వాత లోక్‌సభ ఎన్నికలు ఆ వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు ఇలా వరుస షెడ్యూళ్లు ఉండటంతో చివరకు ఆర్టీసీ ఎండీ చేతుల మీదుగా ప్రారంభించేయడానికి ఏర్పాట్లు చేశారు.
అన్నీ విమానాశ్రయానికే… శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రస్తుతం మెట్రో లగ్జరీ ఏసీ (వోల్వో) బస్సులు పరుగులు పెడుతున్నాయి. వాటి స్థానంలో ఇప్పుడు పొగలేని విద్యుత్తు బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ‘ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌’ సంస్థతో ఆర్టీసీ కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా మొదటి విడతగా 40 బస్సులు వస్తున్నాయి. ఇవన్నీ అందుబాటులోకి వస్తే ఏ మార్గంలో అయినా ప్రతి 20 నుంచి 30 నిమిషాలకు విమానాశ్రయానికి బస్సులు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం విమానాశ్రయానికి 5 మార్గాల్లో 36 బస్సులు తిరుగుతున్నాయి. మరో 10 బస్సులు అదనంగా విమానాశ్రయానికి నడిపేందుకు ఆర్టీసీ చర్యలు తీసుకుంటోంది. దీంతో విమానాశ్రయానికి నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వెళ్లే బస్సుల సంఖ్య 46కి చేరనుంది. ఇందులో 40 విద్యుత్తు బస్సులు కాగా మిగతావి మెట్రో లగ్జరీ బస్సులు. గతంలో కొన్ని మార్కోపోలో బస్సులు నడిచేవి.. వాటిని పూర్తిగా తొలగిస్తున్నారు.
మెట్రోకు అనుసంధానంగా.. బుధవారం నుంచి విద్యుత్తు బస్సులు అందుబాటులోకి వస్తున్న వేళ.. ప్రస్తుతం వీటి స్థానంలో నడుస్తున్న మెట్రో లగ్జరీ ఏసీ బస్సులను వివిధ మార్గాలకు విస్తరించాలని ఆర్టీసీ నిర్ణయించింది. మెట్రోకు అనుసంధానంగా కొన్ని బస్సులను నడపనున్నట్లు కూకట్‌పల్లి డీవీఎం దేవదానం తెలిపారు. మెట్రో తిరగని మార్గాల్లో డిమాండ్‌ ఉన్న మార్గాల్లో మరి కొన్నిటిని నడపాలని నిర్ణయించారు. ఈ క్రమంలో మియాపూర్‌ నుంచి జేఎన్‌టీయూ, హైటెక్‌ సిటీ రైల్వే స్టేషన్‌, సైబర్‌టవర్స్‌, మైండ్‌స్పేస్‌, బయోడైవర్సిటీ మీదుగా వేవ్‌రాక్‌ పార్కుకు 195డబ్ల్యూ నంబరుతో 4 బస్సులు నడపనున్నారు. అలాగే 300/126 నంబరుతో మియాపూర్‌, జేఎన్‌టీయూ, హైటెక్‌సిటీ, సైబర్‌టవర్స్‌, మైండ్‌స్పేస్‌, బయోడైవర్సిటీ, షేక్‌పేట, మెహిదీపట్నం, పీవీనరసింహారావు మార్గంలో ఉప్పల్‌ రింగురోడ్డు వరకూ నడపనున్నారు.

About The Author