ఆయుర్వేదం నందు నవరత్నాలను ఉపయోగించి చేయు వైద్య ప్రక్రియలు…

ఆయుర్వేదం నందు నవరత్నాలను ఉపయోగించి చేయు వైద్య ప్రక్రియలు –

నవరత్నాలు అనగా మాణిక్యం , ముత్యము , పగడము , పచ్చ, పుష్యరాగము , వజ్రము , నీలము , వైడూర్యము , గోమేధికము ఈ తొమ్మిదింటిని నవరత్నాలు అని పిలుస్తారు . చాలామందికి ఇవి కేవలం ఆభరణాలలో ఉపయోగించు విలువయిన రాళ్ళగా మాత్రమే పరిచయం . భారతీయ పురాతన ఆయుర్వేద వైద్యులు వీటిలోని ఔషధ గుణాలను తమ పరిశోధనల ద్వారా తెలుసుకుని వాటిని తమ వైద్యములో విరివిగా ఉపయోగించారు. వారు తమ పరిశోధనా ఫలితాలను తమ గ్రంథాలలో సంపూర్ణంగా వివరించారు . ఇవి ఎక్కువుగా సంస్కృత లిపిలో ఉన్నాయి . ఈ మధ్యకాలంలో నేను అటువంటి పురాతన గ్రంథాలను సేకరించి వాటిపైన కొంత పరిశోధన కూడా చేశాను . ఆ విలువైన సమాచారాన్ని ఇప్పుడు మీకు నేను అందించబోవుతున్నాను.

జ్యోతిష్యశాస్త్ర ప్రకారం మాణిక్యం అనగా కెంపు సూర్యునకు , ముత్యము చంద్రునకు , పగడము అంగారకునకు , మరకతము అనగా పచ్చ బుధునకు , పుష్యరాగము గురువునకు , వజ్రము శుక్రునకు , నీలము శనికి , వైడుర్యము రాహువునకు , గోమేధికము కేతువునకు ప్రీతికరములు మరియు ప్రతిరూపములుగా పేర్కొన్నారు . మరియు ఆయా గ్రహ దోషములకు ఆయా రత్నములను ధరించి గ్రహపీడ నుండి బయటపడవచ్చు.

ఇప్పుడు ఆయుర్వేదం నందలి నవరత్నాల ఉపయోగాలు మీకు తెలియచేస్తాను .

* మాణిక్యం –

ఈ మాణిక్యం పద్మరాగము అని ప్రసిద్ధి కలిగినది . తామరరేకు వన్నె కలిగి బరువుతో స్ఫుటంగా ఉండును. మిక్కిలి కాంతివంతముగా ఉండును. స్ఫుటముగా , బరువుగా , గుండ్రముగా ఉండు మాణిక్యం పరిశుద్ధం అయినది. ఈ మాణిక్యమును సరైన పద్ధతుల్లో శుద్దిచేసి పుటం పెట్టి ఆ భస్మమును ఉపయోగించిన శరీరము నందలి వాత,పిత్త, శ్లేష్మములను శాంతింపచేసి అగ్నిదీపమును కలిగించును. శరీరముకు దారుఢ్యము కలిగించును. మరియు దీనిని ధరించిన భూత , బేతాళ పీడలు తొలగును . అతి భయం వంటి మానశిక దోషాలలో ఇది మంచి ప్రభావం చూపించును.

* ముత్యము –

గుండ్రగా ఉండి తెల్లని కాంతి కలిగి , తేలికైనది , నీటి కాంతి కలిగి , నిర్మలంగా ఉండి అందంగా ఉన్న ముత్యము శుభకరమైనది. వెలవెలపోతూ పైన పొరలుపొరలుగా ఉండి గొగ్గులుగొగ్గులుగా ఉన్నది మంచి ముత్యం కాదుగా గ్రహించాలి.ఇలాంటి ముత్యాలను అసలు వాడకూడదు.

మంచి ముత్యమును పుఠం పెట్టి భస్మం చేసి ఒక మోతాదులో ప్రతినిత్యం పుచ్చుకొనుచున్న మనుజులకు రక్తపిత్తం, క్షయ వంటి రోగాలు నిర్మూలనం అగును. దేహమునకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చును. ఆయుష్షును వృద్దిచేయును . వీర్యవృద్ధి చేయును , శరీరం నందు జఠరాగ్ని వృద్ధిచెందించి శరీరానికి ఉత్సాహం కలుగచేయును .

* పగడం –

బాగా పండిన దొండపండు వలే ఎర్రని రంగు కలిగి గుండ్రని నునుపైన బుడిపెలు , వంకరలు , తొర్రలు మొదలగునవి లేకుండా పెద్దగా ఉండు పగడం శ్రేష్టమైనది. శుభప్రదం అయినది.

మంచి పగడమును సేకరించి సహదేవి ఆకు రసము నందు నానబెట్టిన శుద్ది అగును. దానిని భస్మము చేసి సేవించిన యెడల క్షయరోగములు , రక్తపిత్తములు , కాసరోగము , నేత్రరోగములు , విషదోషాలు మున్నగు వాటిని శమింపచేయును . అగ్నిదీప్తిని , జీర్ణశక్తిని కలిగించి వార్ధక్యమును పోగొట్టి దేహమునకు కాంతిని , బలమును కలిగించును. దీనిని ముట్టునొప్పికి విశేషముగా వాడుదురు.

* గరుడ పచ్చ –

మంచి గరుడపచ్చ ఆకుపచ్చని రంగు కలిగి మెరుగులు తేలుతూ బరువుగా , నున్నగా ఉండును. మిక్కిలి కాంతిమంతంగా ఉండును. దీనిని ఔషధముల యందు ఉపయోగించవచ్చు . తెల్లగా , నల్లగా , బుడుపులు కలిగి ఉన్న , పెలుసుగా ఉన్న ఆ పచ్చ మంచిది కాదు అని అర్థం .

గరుడ పచ్చను ఆవుపాలలో నానబెట్టి శుద్దిచేసి భస్మము చేసి సేవించుతున్న పాండువ్యాధులు , మొలలు , విషదోషాలు , సన్నిపాత జ్వరాలు , సామాన్య జ్వరాలు , వాంతులు , శ్వాస సంబంధ సమస్యలు , కాసరోగం , అగ్నిమాంద్యం వంటి రోగాలను పోగొట్టును . దేహమున మిక్కిలి కాంతిని ఇచ్చి మేలుచేయును .

* పుష్యరాగము –

పుష్యరాగము శుద్ధముగా , నునుపుగా , లావుగా , బరువుగా , ఎగుడుదిగుడు లేనిదిగా ఉండి గోగుపూవ్వు రంగు కలిగి తళతళ ప్రకాశించుచుండును. ఇట్టి లక్షణాలు కలిగినది అత్యుత్తమం అయినది.ఇలా కాక గోరోచనపు రంగు గాని పచ్చగా కాని మిక్కిలి తెలుపుగా గాని ఉండిన మంచిది కాదు.

దీని భస్మం సేవించిన తీవ్రమగు దాహమును , వాంతులను , వాతరోగములను , కుష్టు వ్యాధిని , విషదోషములను పోగొట్టి దేహమునకు మిక్కిలి కాంతిని కలుగచేయును .

* వజ్రము –

ఈ వజ్రము నందు స్త్రీ, పురుష , నపుంసక అని మూడు రకాల జాతులు కలవు.

ఎనిమిది అంచులు కలిగి , పక్షములు ఎనిమిది , కోణములు ఆరు కలిగి ఇంద్రధనస్సు వలే ప్రకాశించుతూ నీటివలె నీడదేరునది పురుషవజ్రము అనబడును.

గుండ్రనైన ఆడుకులు గట్టి ఉండు ఆకారం కలిగి ఉండినది స్త్రీ వజ్రం అనబడును.

మణిగిపోయిన మూలాలు , అగ్రమును కలిగి ఉండి మిక్కిలి గుండ్రముగా ఉండునది నపుంసక వజ్రం అనబడును.

మంచి పురుషజాతి వజ్రమును భస్మం చేసి వాడుతున్న సమస్తరోగములను పోగొట్టి వీర్యాభివృద్ధిని కలిగించి వార్థక్యమును పోగొట్టి బాగుగా ఆకలి పుట్టించును . మానవులకు ఇది అమృతప్రాయమై ఉండును.

* నీలము –

దీనిలో జలనీలము , ఇంద్రనీలము అను రెండు విభిన్న రకాలు కలవు. ఇందులో ఇంద్రనీలము శ్రేష్టము . జలనీలము తేలికగా ఉండి తెలుపుతో కూడిన వర్ణము కలిగి ఉండును. ఇంద్రనీలము బరువుగా ఉండి నలుపువర్ణము నందు నీలం మిశ్రితము కాక నీలవర్ణం కాంతి కలిగి నునుపుగా మలినం లేకుండా మృదువుగా మద్యభాగము నందు కాంతి కలిగి ఉండును. ఇది అత్యంత శ్రేష్టం అయినది.

ఈ నీలమును గాడిద మూత్రములో నానబెట్టి మంచి తీవ్రత కలిగిన ఎండలో ఎండించిన శుద్ధం అగును.

ఈ భస్మాన్ని ఉపయోగించుతున్న శ్వాస , కాస రోగాలు మానును . వీర్యవర్ధకం , త్రిదోషాలను హరించును . అగ్నిదీప్తిని పెంచును. విషమజ్వరం , మూలశంఖ రోగము , పాపసంబంధ రోగాలను హరించును .

* వైడుర్యము –

నలుపు , తెలుపు కాంతి కలిగి సమానమై , స్వచ్ఛమై , బరువై , స్ఫుటమై , లొపల తెల్లని ఉత్తరీయము వంటి పొర కలిగినది శ్రేష్టమైన వైడుర్యము . నల్లగా కాని తెల్లగా కాని ఉండి పారలుపొరలుగా ఉండి లొపల ఎర్రని ఉత్తరీయము వంటి పొర కలిగినది చెడు వైడుర్యముగా గుర్తించవలెను . మంచిది కాదు.

దీనిని కొండపిండి రసములో నానబెట్టి ఎండించి బాగా కాల్చి ఆ తరువాత గజపుటము వేయవలెను .

ఈ భస్మము రక్తపిత్తవ్యాధిని హరించును . బుద్ధిని , శరీర బలాన్ని , ఆయుర్వృద్దిని కలిగించును. పిత్తాన్ని పెంచును , అగ్నిదీప్తిని చేయును . మలములను శరీరం బయటకి వెడలించును.

* గోమేధికం –

ఇది ఆవుయొక్క మెదడుని పోలి ఉండటం వలన గోమేధికం అని పేరు వచ్చినది . ఇది స్వచ్చమైన గోమూత్రము కాంతి కలిగి నునుపుగా ఉండి హెచ్చుతగ్గులు లేకుండా బరువుగా ఉండి పొరలు లేకుండా దట్టముగా ఉండును. మెరుపు లేకుండా తేలికగా ఉండి కాంతివిహీనం అయి గాజుపెంకు వలే ఉండునది దోషయుక్తము .

దీనిని గోమూత్రము నందు నానబెట్టి ఎండించి ఆ తరువాత నేలగుమ్ముడు సమూల రసము నందు నానబెట్టి ఆ తరువాత ఎండించిన శుద్ది అగును. ఆ తరువాత నల్ల ఉమ్మెత్తకు రసము నందు నానబెట్టి ఎండించి పుఠం పెట్టిన భస్మం అగును.

ఈ గోమేధిక భస్మమును శ్లేష్మ, పైత్య రోగాలు , క్షయ , పాండువు వంటి రోగాల నివారణలో వాడతారు. అగ్నిదీప్తిని కలిగించి ఆహారాన్ని జీర్ణం చేయును . రుచికరంగా ఉండును. ఇంద్రియాలకు బుద్దిని , బలాన్ని ఇచ్చును.

పైన చెప్పినటువంటి రత్నభస్మాలను అనుభవవైద్యుల పర్యవేక్షణలోనే తగినమోతాదులో వాడవలెను. స్వంత నిర్ణయాలు మంచివి కాదు.

గమనిక –

నాచే రచించబడిన “ఆయుర్వేద మూలికా రహస్యాలు ” , ” ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు ” అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.

మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.

రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.

ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . మీకు కొరియర్ ద్వారా వస్తాయి. కొరియర్ చార్జీలు కూడ ఇందులోనే పైన మీరు ఎటువంటి డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు . పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.

ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .

కాళహస్తి వేంకటేశ్వరరావు

9885030034

అనువంశిక ఆయుర్వేద వైద్యులు

About The Author