యాదాద్రి లో ఘనంగా గరుడద్వజం ఆవిష్కరణ…


దేవతలకు ఆహ్వానం పలుకుతూ ఘనంగా గరుడద్వజం ఆవిష్కరణ
శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా, రెండో రోజు శనివారం ధ్వజారోహణ నిర్వహించారు. స్వామి కల్యాణం కు సకల దేవతలకు గరుత్మంతుని ద్వారా చరాచర సృష్టికి ఆహ్వానం పలుకుతూ చేపట్టిన ఈ వేడుక కనుల పండుగగా సాగింది. ఆగమయుక్తంగా ఇంద్రాది అష్టదిక్పాలకులు, గంధర్వ, కిన్నెర, కింపురుషాది దేవగణాలు, సప్త అధోలోక జీవులను స్వాగతిస్తూ లాంఛనంగా వేద మంత్రోచ్ఛరణలతో ఆలయ ప్రాకారంలోని ధ్వజస్తంభంపై గరుడ పటాన్ని ఎగరేయడమే ధ్వజారోహణ అని అర్చకులు తెలిపారు. అలాగే కల్యాణ ఉత్సవాలకు దుష్ట శక్తుల వల్ల ఎటువంటి అవరోధాలు లేకుండా ఉండేందుకు కూడా ధ్వజారోహణ నిర్వహించినట్లు అర్చకులు చెప్పారు. ధ్వజస్తంభానికి మామిడి ఆకులు, దర్బలు కట్టి, గరుత్మంతుని చిత్రం గీసిన వస్త్రాన్ని అర్చకులు ఎగరేశారు. ఉత్సవాలకు ఆలయానికి విచ్చేయు భక్తులకు రక్షించుటకై గరుత్మంతుడు భగవానున్ని వేడుకొనుటకై ధ్వజ స్తంభంను, గరుడ పటంను అలంకరించి అర్చకులచే మంగళవాయిద్యాల మధ్య మంత్ర జపములు ఉచ్చరించారు. ఈ ఉత్సవాల్లో ఈవో గీతారెడ్డి‌, చైర్మన్ నర్సింహ్మమూర్తి, ప్రధానార్చకులు నల్లందీగల్ లక్ష్మీనరసింహాచార్యులు, కారంపుడి నరసింహాచార్యులు, యాజ్ఞీకులు, ఆధ్వర్యంలోని వేదపండితులు, అర్చకులు, పారాయణికులు వేడుకగా నిర్వహించారు.

About The Author