ఆర్యభట్ట (భారత శాస్త్రవేత్త)…
ఆర్యభట్ట (భారత శాస్త్రవేత్త)
భారతదేశం కన్న శాస్త్రవేత్తలలో ఆర్యభట్టు ప్రాతఃస్మరణీయుడు. ప్రపంచానికి సున్న(“0”) ను అందించిన గొప్పవాడు.
ఆర్యభట్ట క్రీ.శ. 476 వ సంవత్సరంలో పాటలీపుత్రంలో(నేటి పాట్నా)లో జన్మించాడు. కానీ చాలామంది ఇతడు కేరళలో జన్మించి, పాటలీపుత్రంలో స్థిరపడ్డాడని వాదనలు ఉన్నాయి. కాని వీటికి ఆధారంలేదు. ఇతడు వర్తక కుటుంబానికి చెందినవాడు. వీరి తల్లిదండ్రులు, జీవితం గురించి అంతగా పరిశోధన జరగలేదు.
ఏదేమైనప్పటికీ ఆర్యభట్టు తన సుప్రసిద్ద ఆర్యభట్ట సిద్దాంతం(ఆర్యభట్టీయం) పాటలీపుత్రంలోనే రచించాడనడంలో ఎటువంటి అభ్యంతరమూ లేదు.
నలందా విశ్వవిద్యాలయములో విద్యాధ్యయనం చేసి, అక్కడే ఆచార్యుడుగా, ఆ పిదప ప్రతిష్ఠాత్మక ఉపాధ్యక్ష (Vice Chancellor) పదవిలో తన విధులను నిర్వర్తించి వినుతి కెక్కిన ఘనాపాఠి; ఖగోళశాస్త్ర విజ్ఞానఖని.
భూమి గోళాకారములో ఉంటుందని, తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుందని, దాని వలన రాత్రింబవళ్ళు ఏర్పడతాయని ప్రపంచానికి తొలుతగా తెలియజేసిన ఘనత ఆర్యభట్టుదే! చంద్రునికి స్వయంప్రకాశకత్వం లేదని, సూర్యకాంతి చేతనే ప్రకాశిస్తున్నాడని చెప్పాడు. గ్రహణములు రాహుకేతువుల వల్ల ఏర్పడడం లేదని, భూమి యొక్క నీడ చంద్రునిపై పడినపుడు చంద్రగ్రహణం; భూమి, సూర్యుల మధ్యకు చంద్రుడు వచ్చినపుడు సూర్యగ్రహణం ఏర్పడతాయని తన పరిశోధనల ద్వారా సహేతుకంగా నిరూపించి ప్రపంచదేశాలకు తెలిపినవాడు ఆర్యభట్టే! ఈ సౌరమండలం (Solar Family) మధ్యలో భూగ్రహం ఉందని ప్రథమంగా ప్రతిపాదించి ‘జియోసెంట్రిక్’ దృక్పథానికి పునాది వేసిన గొప్ప శాస్త్రవేత్త ఆర్యభట్టు.
సూర్యుని నుండి వివిధ గ్రహాలకు గల దూరాన్ని గురించి కూడా ఆర్యభట్టు తన పరిశోధనల ద్వారా తెలియజేశాడు. ఆయన కనుగొన్న విలువలు, నేటి ఆధునిక విజ్ఞానశాస్త్ర కొలతలతో సరిపోవడం సంభ్రమాశ్చర్యాలను కలిగిస్తుంది. ఆర్యభట్టు 23 సంవత్సరముల వయసులోనే “ఆర్యభట్టీయం” అనే ఖగోళశాస్త్ర గ్రంథాన్ని రచించాడు. నేటికీ ఈ గ్రంథం ఖగోళ, గణిత శాస్త్రజ్ఞులకు ప్రామాణికం. ఆర్యభట్టు గణితశాస్త్రములో కూడా దిట్ట. వృత్తపరిధిని కనుగొనుటకు ఉపయోగించే గ్రీకు సంకేతం “π” విలువను (22/7) ఆర్యభట్టు ఆనాడే లెక్కగట్టి 3.1416 గా చెప్పాడు. వర్గము, వర్గమూలము, ఘనము, ఘనమూలముల గురించి వివరించాడు.
నేడు బీజగణితములో కనిపిస్తున్న సమీకరణములకు ఆర్యభట్టే మూలపురుషుడు. పెద్దసంఖ్యలకు కోడ్ లను సూచించిన ఘనత సైతం ఆయనదే! “ఆర్యభట్ట సిద్ధాంతము” అనే పేరుతో ఆయన వ్రాసిన మరొక గ్రంథమే నేడు మన భారతదేశములోని పంచాంగాలకు ఆధారము. ఆర్యభట్టు యొక్క మేధాసంపత్తిని గుర్తించి మన భారతప్రభుత్వం, ఆయన చూపిన విజ్ఞానపథానికి సంకేతంగా మనదేశం ప్రయోగించిన తొలి ఉపగ్రహానికి “ఆర్యభట్ట” అని నామకరణం చేయడం మనందరికీ ఎంతో గర్వకారణం.
* గణితంలో ఇతని ఘనకార్యాలు:
1.ఇప్పుడు మనము పాశ్చాత్యులు కనుగొన్నారనుకొంటున్న విషయాలైన “భూమి తన అక్షం చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగడం,భూమి చుట్టు చంద్రుడు తిరగడం” గురించి ఆనాడె తన గ్రంథం లో పేర్కొన్నాడు.
2.4 కు 100 కూడి వచ్చినదాన్ని 8 తో హెచ్చవేసి తర్వాత 62,000కు కూడి వచ్చినదాన్ని 20,000తో భాగిస్తే వృత్తపరిధి మరియు వృత్తవ్యాసం నిష్పత్తికి సమానమని చెప్పాడు. దీని విలువ 3.1416 అని చెప్పాడు.గమనించి చూస్తే ఇదే గణితంలోని “పై”విలువ అని తెలుస్తుంది. ఆధునిక గణితం ప్రకారం ఈ విలువ 3.14159.చూడండి ఆనాడే ఇతను ఎంత సరిగా విలువ గణించాడో.
3.చంద్రుని వెలుతురు సూర్యరశ్మి పరావర్తనంవలన కలుగుతుందని చెప్పాడు.
4.గ్రహణాలు రాహు,కేతువులవలన కాదు అని అవి ఒకే వరుసలోకి వచ్చినప్పుడు కలుగుతాయని గ్రంథంలో పొందుపరచాడు.
5.సంవత్సరానికి 365 రొజులని కూడా చెప్పాడు.
6.భూమి యొక్క చుట్టుకొలత 24385 మైళ్లని (నేటి విజ్ఞానం ప్రకారం ఇది 24900 మైళ్ళు) అని కనుగొన్నాడు.
తర్వాతికాలంలో ఇతని గ్రంథాన్ని గ్రీకులు, అరబ్బులు గ్రహించారు.
వీరు క్రీ.శ.551 లో మరణించారు.