ఐదవ విడత హారితహారం కోసం నర్సరీలను పూర్తి స్థాయిలో సిద్దం చేయాలని…
రానున్న వర్షాకాలంలో మొదలయ్యే ఐదవ విడత హారితహారం కోసం నర్సరీలను పూర్తి స్థాయిలో సిద్దం చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికార యంత్రాంగాన్ని చీఫ్ సెక్రటరీ ఎస్.కే.జోషి ఆదేశించారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాల్లో తెలంగాణకు హరితహారం ఒకటని, అన్ని శాఖలు వచ్చే హరితహారం విజయవంతానికి శ్రమించాలని సచివాలయం నుంచి జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో సీఎస్ కోరారు. వచ్చే హరితహారం టార్గెట్ వంద కోట్ల మొక్కలను నాటడమని, ప్రభుత్వానికి అందిన నివేదికల ప్రకారం 72 శాతం నర్సరీల్లో మొక్కల పెంపకం జరుగుతోందని, మిగతా చోట్ల కూడా సిద్దం చేయాలన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పెంచుతున్న మొక్కల్లో తప్పనిసరిగా 25 నుంచి 30 శాతం అటవీ పండ్ల జాతులు, మరో పది శాతం ఇండ్లలో పెంచుకునే ( హోమ్ స్టెడ్ ప్లాంట్స్) మొక్కలు ఉండాలన్నారు. ప్రాంతాల వారీగా వాతావరణ పరిస్థితులు, ప్రజలు కోరుకున్న మొక్కలు అందించేలా అటవీ, గ్రామీణాభివృద్ది, మున్సిపల్ శాఖలు ఉండాలన్నారు. పంచాయితీకి ఒక సర్సీరీ ఏర్పాటుపై జిల్లాల వారీగా సీ.ఎస్ ఆరాతీశారు. ఇంకా వెయ్యి పంచాయితీలో నర్సరీలను సిద్దం చేయాల్సిఉందని, ఆ పనులు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. కొత్తగూడెం, వరంగల్ జిల్లాలు నర్సరీ లక్ష్యాలను వంద శాతం పూర్తి చేశాయని ఆ జిల్లాల కలెక్టర్లు, అధికారులు, సిబ్బందిని చీఫ్ సెక్రటరీ అభినందించారు. ఐదో విడత హరితహారం కోసం అన్ని జిల్లాలు తమ కార్యాచరణ ప్రణాళికలను సిద్దం చేసి ప్రభుత్వానికి పంపాలని కలెక్టర్లను కోరారు. ప్రభుత్వం గతంలోనే తీసుకున్న నిర్ణయం ప్రకారం ఆగ్రో ఫారెస్ట్రీని ప్రోత్సహిస్తోందని, దీనిలో భాగంగా గంధపు, వెదురు మొక్కలను రైతులకు అందిస్తామని, ఉద్యానవన శాఖ నోడల్ ఎజెన్సీగా పనిచేస్తుందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. పట్టణ ప్రాంతాలు, మున్సిపాలిటీల్లో నర్సరీల పెంపకం కోసం స్వయం సహాయక బృందాల మహిళలను భాగస్వామ్యం చేయాలని సూచించారు. ఇక రెవన్యూ రికార్డులతో అటవీ భూముల పరిశీలన కార్యక్రమంపై కూడా వీడియో కాన్ఫరెన్స్ లో చర్చించారు. 66 లక్షల ఎకరాల అటవీ భూమికి సంబంధించి ఇప్పటికే సమారు యాభై నాలుగు లక్షల ఎకరాల పరిశీలను, రెవెన్యూ రికార్డుల్లో గుర్తించటం పూర్తయిందని, మిగతావి కూడా వివిధ దశల్లో ఉన్నాయని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారి తెలిపారు. సమావేశంలో చీఫ్ సెక్రటరీతో పాటు అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, గ్రామీణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్, భూ రికార్డుల ప్రక్షాళన ప్రత్యేక అధికారి శ్రీదేవి, అటవీ శాఖ పీసీసీఎఫ్ పృధ్వీరాజ్, అదనపు పీసీసీఎఫ్ లు డోబ్రియల్, స్వర్గం శ్రీనివాస్ లు పాల్గొన్నారు.