కమ్యూనిస్టు పార్టీల కార్యకర్తల ఆవేదన…
కమ్యూనిస్టులు ఎక్కాల్సిన రైలు ఓ జీవితకాలం లేటన్నది మరోసారి రుజువైందని వామపక్ష పార్టీల అభిమానులు వాపోతున్నారు. ముఖానికి రంగేసుకునే వారితో పొత్తేమిటని ఆనాడు ఎన్టీఆర్‌ను, మొన్న చిరంజీవిని కాలదన్నిన కమ్యూనిస్టు పార్టీలు ఈసారి పవన్ కల్యాణ్‌తో జట్టు కట్టినా ప్రయోజనం లేకపోయిందే అని మదనపడుతున్నారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన కొత్తలో అంటే 1983 ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు 66 సీట్లు ఇస్తామంటే సినిమా వాళ్లతో పొత్తు పెట్టుకోబోమని భీష్మించి వచ్చిన అవకాశాన్ని చేజార్చుకున్నారు. ఆ ఎన్నికల్లో ఎన్టీఆర్ ఘన విజయాన్ని చూసిన తర్వాత అయ్యో రైలు మిస్సయిందే అని అంచనా వేశారు. 2009 ఎన్నికలకు ముందు సినీనటుడు చిరంజీవి సామాజిక న్యాయం, ప్రజాసేవే మార్గమంటూ ప్రజారాజ్యం పార్టీని స్థాపించి సీట్ల సర్దుబాటుకు రమ్మంటే ఉభయ కమ్యూనిస్టుల్లో ఒక పక్షం ససేమి కుదరదంది. చిరంజీవితో కలిస్తే కమ్యూనిస్టులపై కులం ముద్ర పడుతుందని ఆ రోజున అడ్డం కొట్టారు. ఆ ఎన్నికల్లో చిరంజీవికి వచ్చిన ఓట్ల శాతాన్ని చూసి అరెరే పొరబాటు చేశామే అని లోలోన అంచనాలు వేసుకుని తమను తాము సర్దిపుచ్చుకున్నారు. సామాజిక న్యాయానికి పెద్ద పీట వేస్తున్నట్టు చిరంజీవి చెప్పినా ఆవేళ ఉభయ కమ్యూనిస్టుల్లోని ఓ పార్టీ సుతారమూ అంగీకరించలేదు. చెరో 15 సీట్లు ఇస్తామని ఆనాడు చిరంజీవి పార్టీలో ఉన్న వామపక్ష అభిమానులు చెప్పినా తోసిపుచ్చారు. ఆ తర్వాత జరిగిన రాష్ట్ర విభజనతో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు తమ అస్థిత్వాన్నే కోల్పోయాయి. 2014 ఎన్నికల్లో రెండు కమ్యూనిస్టు పార్టీలలో దేనికీ శాసనసభలో ప్రాతినిధ్యమే లేకుండా ఉనికిని కోల్పోయాయి. 1952 నాటి తొలి ఎన్నికల్లో 66 సీట్లను గెలిచిన కమ్యూనిస్టు పార్టీ 2014 నాటికి సీపీఎం, సీపీఐగా విడిపోయి చెరో సీటు సాధించాయి. అటు తెలంగాణలో గాని ఇటు ఆంధ్రాలో గానీ ఒక్క సీటునూ గెలుచుకోలేక పోయాయి. ఓట్లు, సీట్లు తమకు ముఖ్యం కాదని, ప్రజా పోరాటాలే ఊపిరి అని ప్రకటించుకుని మరింత మిలిటెంట్ ఉద్యమాలతో ముందుకు పోయి పార్టీలను పటిష్టం చేసుకుంటామని, ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కుంటామంటూ గతంలో ఏయే వర్గాలలో పట్టు ఉందో ఆ వర్గాలతో కలిసి పనిచేయడం ప్రారంభించాయి. వామపక్ష శక్తుల ఐక్యతే ప్రధానమంటూ తమ నినాదమన్నాయి. విశాల వేదికలు నిర్మిస్తామని ప్రకటించాయి. ఇంతలో 2019 ఎన్నికలు వచ్చాయి. రెండేళ్ల కిందటివరకు చంద్రబాబు భాగస్వామిగా ఉన్న పవన్ కల్యాణ్‌తో, ఆయన పార్టీ జనసేనతో కలిసి ఆందోళనలు చేస్తామంటూ ముందుకు వచ్చాయి. అంతవరకు పరిమితమైతే బాగుండేదని, సీట్ల సర్దుబాటే మరీ అన్యాయంగా ఉందని ఆ పార్టీల్లోని సీనియర్లు వాపోతున్నారు. చిరంజీవితోనే సీట్ల సర్దుబాటు వద్దనుకున్నప్పుడు ఆయన తమ్ముడైన పవన్‌తో ఎలా పొత్తు పెట్టుకుంటారన్నది వారి వాదన. చిరంజీవి చెప్పిన సామాజిక న్యాయానికి, పవన్ కల్యాణ్ చెప్పిన సామాజిక న్యాయానికి తేడా ఏమిటని ప్రశ్నిస్తున్నారు.కలిసి పోటీచేస్తే మర్యాదలైనా మిగిలేవి
ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కలిసి పోటీచేస్తే కనీసం పరువు మర్యాదలైనా మిగిలేవి. చెరో 15 సీట్లు కావాలని రెండు కమ్యూనిస్టు పార్టీలు ప్రతిపాదిస్తే పవన్ కల్యాణ్ నాన్చి నాన్చి తనకు వేరే ప్రత్యామ్నాయం లేదని భావించిన తర్వాత చర్చలకు దిగారు. ఈలోగా కమ్యూనిస్టు పార్టీలే తమకు జిల్లాకో సీటు ఇవ్వండని కోరాయి. ఇది కొలిక్కి రాకుండానే జనసేన అధినేత కొన్ని సీట్లకు తమ అభ్యర్థులను ప్రకటించారు. వీటిల్లో సీపీఐకి అంతో ఇంతో బలం ఉన్నవి పోయాయి. చివరకుఆ 13 కాస్తా 7 అయ్యాయి. వీటిల్లో కమ్యూనిస్టులకు బలం ఉన్నవి నామమాత్రమే. ఇప్పుడు పవన్ ఇచ్చిన సీట్లలో కమ్యూనిస్టు పార్టీలకున్న బలం అతి స్వల్పమే. పైగా ధనబలం ముందు వీళ్లు నెగ్గుకు రావడం కష్టం. జనసేన ఓట్లు ఎంతవరకు బదిలీఅవుతాయన్నది సందేహమే.ఇదే సమయంలో కమ్యూనిస్టుల ఓట్లు ఎంతవరకు జనసేనకు పడతాయనేది కూడా అనుమానాస్పదమే.పార్టీ అస్థిత్వాన్ని నిలుపుకోవాలంటే ఉమ్మడిగా కమ్యూనిస్టులు పోటీచేస్తే సరిపోయే దానికి ఎవరో’సినిమా నటుడి’తో పొత్తుకు పోయి భంగపడడం ఎందుకన్నది ఆ పార్టీలలోని సీనియర్ నేతలు, కార్యకర్తలను వేధిస్తున్న ప్రశ్న