నాబార్డు మరియు మహిళా అభివృద్ధి సోసైటీ(MAS) వారు సంయుక్తంగా…
నాబార్డు మరియు మహిళా అభివృద్ధి సోసైటీ(MAS) వారు సంయుక్తంగా వ్యవసాయోత్పత్తిదారులతో ముఖాముఖి సమావేశాన్ని తేదీ: 26.03.2019న ఉదయం 11.00 గంటలకు నాబార్డు ప్రాంతీయ కార్యాలయం, ఆర్.టి.సీ. క్రాస్ రోడ్డు, ముషీరాబాద్, హైదరాబాద్లో నిర్వహించారు. శ్రీ సి. పార్థసారథి IAS, ప్రిన్సిపల్ సెక్రటరీ, వ్యవసాయ మరియు సహకార శాఖ వారు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఈ ముఖాముఖి సమావేశం నందు నాబార్డు సీజీఎం శ్రీ విజయ్ కుమార్, నాబార్డు జనరల్ మేనేజర్ శ్రీ కె.ఐ.షరీఫ్, సెర్ప్ సీఈవో శ్రీమతి పౌసుమీబసు IAS, మార్కెటింగ్ శాఖ సంచాలకులు శ్రీమతి జి.లక్ష్మీబాయి, హార్టికల్చర్ కమీషనరు శ్రీ ఎల్. వెంకట్రామిరెడ్డి, NIRD, వ్యవసాయ శాఖ మరియు మార్కెటింగ్ శాఖ అధికారులతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయోత్పత్తిదారుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో ముందుగా నాబార్డు సీజీఎం శ్రీ విజయ్కుమార్ గారు మాట్లాడుతూ వ్యవసాయోత్పత్తిదారుల సంఘాలతో అనుబంధంగా ఉన్న ప్రతి ఒక్క శాఖ నందు వ్యవసాయోత్పత్తిదారుల సమస్యలపై ఒక నోడల్ అధికారిని నియమించాల్సిన ఆవశ్యకతను తెలిపారు. అదేవిధంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు.
అదేవిధంగా, సెర్ప్ సీఈవో శ్రీమతి పౌసుమిబసు IAS గారు మాట్లాడుతూ వ్యవసాయోత్పత్తిదారుల సంఘాలకు మార్కెటింగ్లో మెళకువలు మరియు రైతులకు ఎరువులు, విత్తనాలు సరఫరా చేయుటకు అవకాశం కల్పించాల్సిందిగా కోరారు.
ఈ సందర్భంగా వ్యవసాయ మరియు సహకార శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ సి. పార్థసారథి IAS గారు మాట్లాడుతూ వ్యవసాయోత్పత్తిదారుల సంఘాలు కో-ఆపరేటీవ్ వ్యవస్థలో నూతన ఆవిష్కరణగా పేర్కొన్నారు. స్వయం పాలన మరియు స్వయం ప్రతిపత్తితో వ్యవహరిస్తున్న ఈ వ్యవసాయోత్పత్తిదారుల సంఘాలకు కొనుగోలు సంస్థలుగా అవకాశం కల్పించుటకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. అయిననూ ఈ ఉత్పత్తి సంఘాలు ఒకదానితో ఒకటి పోటీ పడకుండా రైతుల అభివృద్ధికి పాటుపడాల్సిందిగా కోరడమైనది. అదేవిధంగా వ్యవసాయోత్పత్తిదారుల సంఘాలను తీర్చిదిద్దుటకు అవసరమైన ప్రభుత్వ సంస్థ ఏదేనీ ఇప్పటివరకు లేనందున, ఈ సంఘాలకు సంబంధించి నోడల్ ఏజెన్సీగా వ్యవసాయ మార్కెటింగ్ శాఖను ప్రకటించారు. ఈ వ్యవసాయోత్పత్తిసంఘాలకు అవసరమైన శిక్షణ మరియు ఇతర అవగాహనా సదస్సులను విస్తృతంగా ఏర్పాటు చేయాల్సిన అవసరముందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్త బ్యాంకర్ల సమావేశంనందు వ్యవసాయోత్పత్తిదారుల సంఘాల అభివృద్ధికై చేపట్టాల్సిన చర్యల గురించి చర్చించాల్సిన ఆవశ్యకతను వ్యక్తం చేశారు. అదేవిధంగా, ఈ వ్యవసాయోత్పత్తిదారుల సంఘాలను తీర్చిదిద్దుట కొరకు తెలంగాణ ప్రభుత్వం మరియు నాబార్డు వారు ఒక ఒప్పందానికి రావాల్సిన ఆవశ్యకతను కూడా వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో ముఖ్యంగా వ్యవసాయోత్పత్తిదారుల సంఘాలతో ముడిపడి ఉన్న అన్ని శాఖల అధికారులను సమన్వయపరుచుట, తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయోత్పత్తిదారుల స్థితిగతులు, వారు ఎదుర్కొంటున్న సమస్యలు మరియు సవాళ్లపై కులంకుశంగా చర్చించడమైనది.
ఈ సమావేశంలో తెలంగాణలోని వ్యవసాయోత్పత్తిదారుల సంఘాలకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన పాలసీని తీసుకురావాల్సిన ఆవశ్యకతను గుర్తించి, వీటికి సంబంధించి ఇతర రాష్ట్రాలలో తీసుకున్న పాలసీలను పరిశీలించుటకు నిర్ణయించడమైనది.