సాంప్రదాయ పంటలతో పాటు రైతులకు అదనపు ఆదాయం…
సాంప్రదాయ పంటలతో పాటు రైతులకు అదనపు ఆదాయం ఉండేలా ప్రోత్సహించాలని, ఇందుకోసం అగ్రో ఫారెస్ట్రీ ని పెద్ద ఎత్తున అమలు చేయాలని అధికార యంత్రాంగానికి చీఫ్ సెక్రటరీ డా. ఎస్.కె.జోషి సూచించారు. రానున్న ఐదో విడత హరితహారంలో అగ్రో ఫారెస్ట్రీ అమలును యుద్ద ప్రాతిపదికన అమలు చేసి, ఔత్సాహిక రైతులను ప్రొత్సహించాలని సీ.ఎస్ తెలిపారు. ఆర్థిక, వ్యవసాయం, అనుబంధ రంగాలు, అటవీ శాఖ ఉన్నతాధికారులతో సచివాలయంలో సమావేశమైన చీఫ్ సెక్రటరీ ఆగ్రో ఫారెస్ట్రీ అమలు, అధ్యయనంపై చర్చించారు. అగ్రో ఫారెస్ట్రీ లో భాగంగా ఇప్పడు తెలంగాణలో ఉన్న పరిస్థితులు, ప్రత్యామ్నాయ ఉపాధి కోసం ముందుకు వస్తున్న రైతులు, అదే సమయంలో ఆయా ఉత్పత్తులకు ఉన్న మార్కెట్ పరిస్థితులను కూడా అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఉన్న ఆగ్రో ఫారెస్ట్రీ మిషన్ ను పునర్ వ్యవస్థీకరించి అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో రాష్ట్ర స్థాయి ఆగ్రో ఫారెస్ట్రీ మిషన్ ను ఏర్పాటు చేయాలని, సంబంధిత శాఖల నుంచి ఒక్కో అధికారిని డైరెక్టర్లుగా నియమించాలని సమావేశంలో నిర్ణయించారు. సాంప్రదాయ పంటలకు తోడు వెదురు, ఎర్ర చందనం, సుబాబుల్, సరుగుడు, నల్ల తుమ్మ, సీతాఫల్, పనస, వేప, ఉసిరి లాంటి పంటలు, తోటలు వేసేలా ప్రొత్సహించనున్నారు. వచ్చే సీజన్ కోసం ఎంతమంది రైతులకు, ఏమేరకు సాగు కోసం, ఎన్ని మొక్కలు అందించవచ్చనే కార్యాచరణను సిద్దం చేయాలని, ఏప్రిల్ నెలలోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చేలా ప్రతిపాదనలను సిద్దం చేయాలని చీఫ్ సెక్రటరీ సూచించారు. ప్రస్తుత పంటలను కాదని, కొత్త పంటలు, వాణిజ్య తరహాలో వేస్తే తమకు ఏ విధంగా మంచి ఆదాయం వస్తుందో, అందుకోసం ప్రభుత్వంవైపు నుంచే అందే సహాయం ఎలా ఉంటుందన్న విధివిధానాలను కూడా సిద్దం చేయాలని తెలిపారు. ఆగ్రో ఫారెస్ట్రీ కింద రైతులు పండించే ఉత్పత్తులకు డిమాండ్, మార్కెట్ విశ్లేషణను కూడా అధ్యయనం చేయాలన్నారు.
సమావేశంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి, పీసీసీఎఫ్ పీ.కే.ఝా, సీఎం ఓఎస్డీ (హరితహారం) ప్రియాంక వర్గీస్, గ్రామీణాభివృద్ది శాఖ కమిషనర్ నీతూ ప్రసాద్, హార్టీ కల్చర్ కమిషనర్ వెంకట్రామ్ రెడ్డి, అదనపు పీసీసీఎఫ్ ఆర్.ఎం. డోబ్రియల్, ఆర్థిక శాఖ అధికారి శివశంకర్ పాల్గొన్నారు.