గోదావరిఖనిలో జరిగిన పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల ప్రచార సభలో శ్రీ కేసీఆర్…

గోదావరిఖనిలో జరిగిన పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ప్రసంగించిన ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్.
ఈ సభలో మంత్రి శ్రీ కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీ బోర్లకుంట వెంకటేష్ నేత, ఎంపీ శ్రీ కేశవ రావు, ఎమ్మెల్యేలు శ్రీ బాల్క సుమన్, శ్రీ కోరుకంటి చందర్, శ్రీ నడిపెల్లి దివాకర్ రావు, శ్రీ దాసరి మనోహర్ రెడ్డి, శ్రీ దుర్గం చిన్నయ్య, ఎమ్మెల్సీలు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం శ్రీ కేసీఆర్ మాట్లాడుతూ…
-ఈ గ్రౌండ్‌లో తెలంగాణ ఉద్యమం కోసం, అనేక సభను సమావేశాలు మనం అందరం కలిసి పెట్టుకున్నాం. విద్యార్థుల శిక్షణా శిభిరాలు పెట్టుకున్నాం. అనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సమావేశాలు పెట్టుకున్నాం. మీ అందరి ఆశిస్సులతో సుదీర్ఘమైన పోరాటం తరువాత తెలంగాణ రాష్ట్రం సంపాదించుకున్నం.

-మిమ్ములను అందరిని నేను ఒకే మాట కోరుతున్నా. ఎన్నికలు వస్తే గజిబిజి గందరగోళం ఆగమాగం కావొద్దు. ఎలక్షన్ రాగానే చాలా మంది బయలుదేరుతరు… చాలా విషయాలు చెబుతారు. అన్ని వినాలి… శాంతంగా వినాలి. ఆలోచన చేయాలి… చర్చలు జరగాలి. వాస్తవాలు ఏంది గమనించే ప్రయత్నం చేయాలి.

-టీఆర్‌ఎస్ ప్రభుత్వం రాకముందు… తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాక ముందు పరిస్థితులు ఏవిధంగా ఉండే … ఈ రోజు ఎట్లా ఉన్నాయి… అన్న విషయాలను ఆలోచన చేయాలి. అప్పుడు కరెంటు వ్యవసాయానికి ఎలా వచ్చేది.. ఇప్పుడు కరెంటు వ్యవసాయానికి ఎలా వస్తుంది. ఆ రోజు పెన్షన్ ఎంత వచ్చేది… ఈ రోజు అర్హులైన అందరికి పెన్షన్ ఎంత వస్తుంది. ఇలా ప్రతి రంగంలో కూడా గుణాత్మకమైన మార్పులు మనకు కనిపిస్తున్నాయి.

-అన్నం ఉడికిందా అంటే మొత్తం చూడాల్సిన అవసరం లేదు… ఒక్క మెతుకు తీసుకుని చూస్తే సరిపోతుంది. ఒకనాడు తెలంగాణ ప్రాంతంలో 24 లక్షల మోటార్లు ఉంటే ప్రతి రోజు ఎక్కడో ఒక దగ్గర లాఠీచార్జీ, ధర్నా కరెంటు కోతలు, పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు, కాలిపోయే మోటర్లు… కొద్ది సమయంలో అన్ని బాగు చేసుకుని 29 రాష్ట్రాలు ఈ దేశంలో ఉంటే 24 గంటల ఉచిత కరెంటు రైతులకు ఇచ్చే ఒకే ఒక రాష్ట్రంగా తెలంగాణను మార్చుకున్నాం.

-మరి ఇంతకు ముందుకు ప్రభుత్వాలు లేకుండేనా… కేసీఆర్ కన్నా ముందు ముఖ్యమంత్రులు లేకుండిరా… మరి ఎందుకు ఇవ్వలేదు.

-ఈ రోజు ఎన్నికల వేల ప్రచారం కోసం వస్తున్న రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీలకు మొక్కాలే… వారు ఇద్దరు ఒకరి మీద ఒకరు చేతులు ఎక్కించుకుని పొట్లాటకు దిగుతుండ్రు. వాళ్లు ఎందుకు కొట్లాడుతుండ్లో వాళ్లకే తెలువదు. వాళ్ల కొట్లాటలకు మనం ఆగం కావొద్దు. ఇన్నేండ్లు ఈ దేశాన్ని పాలించింది ఎవరు. 70 ఏండ్లుగా పాలిస్తున్నది కాంగ్రెస్, బీజేపీలే కదా…. ఇంకా ఎవరైనా పరిపాలించినారా. మద్యలో కొద్ది సమయం మాత్రమే వీళ్ల సపోర్టు తోనే వేరే వాళ్లు పాలించారు. కాని మొత్తం కాంగ్రెస్, బీజేపీలే పరిపాలన చేసినాయి. దేశాన్ని మంది ఎవరో పాలించినట్లు దానికి జిమ్మెదారి వేరేవాైళ్లెనట్లు. దానిపై వీళ్లు వీళ్లే పొట్లాడుకుంటూ మనలను జోకర్లు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు.

-నరేంద్ర మోడీని దించుతం … రాహుల్ గాంధీని ఎక్కిస్తం మనకు ఏమోస్తుంది… పార్టీల అధికారం మారినంత మాత్రానా ఈ దేశం ఏమైనా మారుతుందా. పథకాల పేర్లు మార్పు తప్ప ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. నరేంద్ర మోడీ ఐదేండ్లు పాలిస్తే ప్రజలకు వచ్చిన మేలు ఏమిటో చెప్పాలి.

-బొగ్గు గనిలో పనిచేసే కార్మికులు మిలటరీ కంటే తక్కువ ఏమీ కాదు. దినదిన గండం నూరేండ్ల ఆయుస్సుగా వారి జీవితం బండ కింద కొనసాగుతుంది. బొగ్గు గని కార్మికుల జీతాల నుంచి కట్ చేసే ఇన్‌కంటాక్స్‌తోనే కేంద్ర ప్రభుత్వం నడుస్తుందా… ఆదాయ పన్ను మాఫీ చేయాలని తెలంగాణ అసెంబ్లీ తీర్మాణం పాస్ చేసి పంపినా, నేను ఎన్నిసార్ల పోయి విజ్ఞప్తి చేసినా దానిపై స్పందన లేదు. కార్మికుల ఆదాయపన్ను మాఫీ చేస్తే పోయేదేం లేదు… కానీ చెయ్యరు.. ఎందుకంటే అడిగే వాడు లేడు. చెయ్యక పోతే చేసేది ఏమీ లేదు. అందువల్ల మీ అందరితో ఒకటే ప్రార్థిస్తున్నాం… దయచేసి దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు రావాలి.

-గోదావరిఖని ప్రాంతం, పెద్దపల్లి నియోజకవర్గం రాజకీయంగా చాలా చైతన్యవంతమైన ప్రాంతం. 2001న నాకెందుకు పంచాది అనుకుని ఊరికే ఉంటే తెలంగాణ వస్తుండేనా… కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ వ్యాప్తంగా గులాబీ జెండా ఎగరవేశాం. అట్లనే ఈ దేశం కూడా మారాలి… దేశంలో సంపద ఉంది… భగవంతుడు ఇచ్చిన వనరులు ఉన్నాయి. వాటిని వినియోగించుకోలేని దద్దమ్మలు ఈ దేశాన్ని పాలిస్తున్నారు. దేశంలో నీళ్లు లేక సాగు, తాగునీటికి కటకట ఉన్నదా…నీళ్లు ఉండి కూడా మీ చేతగాని తనం వల్ల ఉన్నదా… దానిపై దమ్ముంటే చర్చకు రాహుల్‌గాంధీ, మోడీ రావాలి.

-మూడున్నర లక్షల యూనిట్ల కరెంటు దేశంలో ఉత్పత్తి అవుతుంటే దానిని ఎందుకు వాడుకోలేకపోతున్నాం. మీరు అవలంభించే తప్పుడు విధానాల వల్లే ఈ పరిస్థితి వచ్చింది కదా. పేదరికం, వ్యవసాయం, సాగునీరు, రైతుల, కార్మికుల బాధల గురించి మాట్లాడరు… కాని సీఎం జాతకాలు చూస్తాడనే ప్రజలకు సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నారు. వ్యక్తిగతమైన నిందారోపణలు చేస్తున్నారు.

-గోదావరిఖని సభావేదిక నుంచి మీ అందరిని ప్రార్థించేది ఒక్కటే పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పెద్ద ఎత్తున కార్మికులు ఉన్న ప్రాంతం. నాయకలు.. అనేక సంఘాలు ఉన్నటువంటి ప్రాంతం. ఈ దేశంలో గుణాత్మకమైన మార్పు రావాలి.

-అవసరానికి మించి కరెంటు ఉంటే కూడా సగం కరెంటు వాడే తెలివి లేదు. సగం దేశం చీకట్లో ఉంటుంది. ఉత్తర భారత దేశంలో రోజు కరెంటు కోతలు ఉంటాయి. ఇంత డంబాచారం మాట్లాడే నరేంద్ర మోడీ రాష్ట్రం గుజరాత్‌లో కూడా 24 గంటల కరెంటు ఇవ్వడం లేదు. ఉన్న వసతులు, వనరులు, అవకాశాలు వాడలేని వాళ్లు… వాళ్లే పరస్పరం నిందారోపణలు చేసుకుని మనలను తికమక పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి మాయలకు మోసాలకు పోకండి… ఆలోచించండి. బీజేపీ, కాంగ్రెస్‌లకు సంపూర్ణ మెజార్టీ వస్తలేదు… కేంద్రంలో ప్రాంతీయ పార్టీల కూటమే నిర్ణయాత్మక శక్తిగా మారి దేశాన్ని పాలించనుంది. అందుకే మన 16 మంది ఎంపీలను గెలిపించాలని కోరుతున్నా. 16 ఎంపీలను దీవించి పార్లమెంటుకు పంపండి… నా శక్తి మేరకు దేశానికి దిశా నిర్ధేశం చేసే ప్రయత్నం చేస్తాను.

-గతంలో మంచిర్యాల జిల్లా చేయాలని కొట్లాడితే చెయ్యలేదు. కాని తెలంగాణ రాష్ట్రంలో మంచిర్యాల జిల్లా, పెద్దపల్లి జిల్లాలను చేసుకున్నాం. అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టు మీ జిల్లాలోనే కడుతున్నాం. 200 కిలోమీటర్ల పొడవున గోదావరి నది నీటితో నింపి ఉంచే ప్రయత్నం చేస్తున్నాం. అనేక సంక్షేమ పథకాలు అమలు చేసుకున్నాం.

సింగరేణి కార్మికులకు కూడా గతంలో ఏ ప్రభుత్వాలు చేయని అనేక కార్యక్రమాలు చేసినం. ఇప్పటి వరకు 6200 మందికి డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చినం. మిగిలిన వారికి కూడా ఇప్పిచ్చే బాధ్యత నాది. ఉద్యోగం వద్దు అనుకునే వారి రూ.25 లక్షలు ఇస్తున్నాం. కార్మికులు చనిపోతే రూ.20 లక్షలు ఇస్తున్నాం.

-ఆనాడు లక్ష రూపాయలు ఇవ్వమన్నా ఇవ్వలేదు. లాఠీలతో కొట్టినారు. కొప్పుల ఈశ్వర్ నెలరోజులు జైలుకు కూడా వెళ్లినాడు. అవి అన్ని చూసినం కాబట్టే ఈ రోజు ఆ బాధ ఉండొద్దని ప్రయత్నం చేస్తున్నాం. కార్మికుల ఇండ్లకు ఫ్రీ కరెంటు ఇప్పించినాం.. ఇంటి నిర్మాణానికి రూ. 10లక్షల వరకు వడ్డీ లేని రుణం ఇప్పించినాం. మిగిలిన సమస్యలను కూడా పరిష్కారం చేస్తాం.

-తమ్మిడిహట్టి దగ్గర బ్యారేజీ పూర్తి చేసి రెండున్నర లక్షల ఎకరాలకు నీటిని అందిస్తాం. టీఆర్‌ఎస్ రాకముందు తెలంగాణ ఎలా ఉండే టీఆర్‌ఎస్ వచ్చిన తరువాత తెలంగాణ ఎలా ఉందో ఆలోచన చేయండి. తెలంగాణ ప్రజల ప్రతినిధిగా, మీ బిడ్డగా దేశానికే ఒక నిర్దేశాన్ని ఇవ్వబోతున్నాం ఆశీర్వదించండి. ఎక్కడి తెలంగాణ… ఏం తెలంగాణ అని అమమాన పర్చిన వారు కనుమరుగయ్యారు.

-ఈ రోజు మనం దేశానికి రోల్‌మోడల్‌గా నిలిచాం. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, డబుల్ బెడ్‌రూం ఇండ్లు, 24 గంటల కరెంటు, మన సంక్షేమం, కేసీఆర్ కిట్లు, కళ్యాణ లక్షి, షాదీ ముభారక్ వంటి పథకాలు దేశంలో ఎక్కడా లేవు. అనేక రాష్ట్రాల వారు వచ్చి మన పథకాలను అధ్యయనం చేసి పోతున్న విషయం మీకు తెలుసు. రామగుండంలో మెడికల్ కాలేజీ తప్పకండా ఏర్పాటు చేస్తామని తెలిపారు. చెన్నూరు రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేస్తాం. క్యాతన్‌పల్లి, నర్సాపూర్, సీసీనస్పూర్, మంచిర్యాల ప్రాంతాలను కలిపి కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. పోడు భూముల సమస్య, రైతుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం. రైతుల పట్టాల విషయంలో ఎవరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకండి. జూన్ వరకు ఓపిక పట్టాలని విజ్ఞప్తి చేశారు. కొత్త రెవెన్యూ చట్టం తెస్తున్నం. మేము నిజాయితీగా పనిచేసే రెవెన్యూ ఉద్యోగులకు వ్యతిరేకం కాదు.

-పెద్దపల్లి అభ్యర్థి బోర్లకుంట వెంకటేష్ నేత ఉద్యోగిగా పదవీ విరమణ చేసుకుని ప్రజాసేవ కోసం ముందుకు వచ్చినాడు. వెంకటేశ్ కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

About The Author